ఆ ఆలయంలో అద్భుతం.. హనుమంతుడే ప్రసాదం తిని ఊపిరి పీల్చుకుంటారు.. ఎక్కడో తెలుసా..
బజరంగ్ బలి వైభవాన్ని ఎంత పొగిడినా తక్కువే. భక్తులు హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే వారికి ఆ ఫలం లభిస్తుంది.
దిశ, వెబ్ డెస్క్ : బజరంగ్ బలి వైభవాన్ని ఎంత పొగిడినా తక్కువే. భక్తులు హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే వారికి ఆ ఫలం లభిస్తుంది. మంగళవారం బజరంగబలికి అంకితం చేసిన రోజుగా చెప్పుకుంటారు. అందుకే ఈ రోజున హనుమంతుని ఆలయంలో భారీగా భక్తుల సంఖ్య ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు జనసందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయంలో కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఏంటి అంటారా.. ఇటావాలో వెలసిన హనుమాన్ ఆలయంలోని బజరంగ బలి ఏ ప్రసాదాన్నయినా స్వీకరిస్తారని అక్కడి భక్తుల విశ్వాసం.
పిలువా మహావీర్ ఆలయం..
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో అద్భుత శక్తులు ఉన్నాయని చెబుతారు. అందుకే ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారట. దేశం నలుమూలల నుండి భక్తులు మంగళవారం ఇక్కడకు చేరుకుని తమ కోరికలను చెబుతారట. అయితే ఈ ఆలయంలో ఉన్న అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హనుమంతుని విగ్రహం పడుకుని ఉంటుంది. ఇలా పడుకుని ఉన్న హనుమంతుని ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇదో ఆలయం.
పిలువా మహావీర్ ఆలయ చరిత్ర..
పిలువా మహావీర్ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే సుమారు 300 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని రాజా హుకం చంద్ర ప్రతాప్ చౌహాన్ నిర్మించారని చరిత్ర చెబుతుంది. పిలువా మహావీర్ ఆలయం నుండి హనుమంతుని విగ్రహాన్ని తొలగించడానికి రాజు హుకం చంద్ర ప్రతాప్ ప్రయత్నించాడని చరిత్ర చెబుతుంది. అయితే అతను దానిని ఆ ప్రదేశం నుండి తరలించలేకపోయాడని చెబుతారు. ఆ తర్వాత ఈ ప్రదేశంలో ఒక దేవాలయాన్ని నిర్మించారని, బజరంగ బలిని పూజించడం ప్రారంభించారని చెబుతారు.
పిలువా మహావీర్ ఆలయంలోని రహస్యాలు..
పిలువా మహావీర్ ఆలయం అనేక అద్భుత దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన విశ్వాసం ఏమిటంటే, ఇక్కడ దేవునికి ఏ ప్రసాదాన్ని సమర్పించినా, దానిని స్వయంగా స్వీకరిస్తాడట. దీని తర్వాత ప్రసాదం ఎక్కడికి వెళ్లింది అన్న విషయాలు కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉందట. అంతే కాదు హనుమంతుడి విగ్రహం ఊపిరి కూడా పీల్చుకుంటుందని అక్కడి పండితులు చెబుతున్నారు. దాని చుట్టూ జై సియారామ్ అనే శబ్దం కూడా వస్తూనే ఉంటుందట. అందుకే ఈ ఆలయంలో బజరంగ్ బలి నివాసం ఉంటాడని చెబుతారు.