Kukur temple : ఆ ఆలయంలో శునకమే దేవుడు.. ఆ రహస్యం ఏంటో తెలుసా..
మన దేశంలో అక్కడక్కడ కొన్ని వింత ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : మన దేశంలో అక్కడక్కడ కొన్ని వింత ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తుంటారు. అలాగే కొన్ని దేవాలయాల్లో దేవున్ని కాకుండా ఎలుకలను, తాబేళ్లను ఇలా జంతువులను పూజిస్తూ ఉంటారు. అలాంటి ఒక వింత ఆలయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో దేవుడిని కాకుండా కుక్కను మాత్రమే పూజిస్తారట. ఇంతకీ ఈ వింత ఆలయం ఎక్కడ ఉంది. ఎందుకు శునకాన్ని దేవునిలా ఆలయంలో పెట్టి పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వింత ఆలయం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయాన్ని కుకుర్‌దేవ్ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడి ప్రజలకు ఈ ఆలయం పై ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే అధిక సంఖ్యలో భక్తులు భక్తితో పూజలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. కుకుర్‌దేవ్ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుండి 132 కిలోమీటర్ల దూరంలో దుర్గ్ జిల్లాలోని ఖాప్రి గ్రామంలో ఉంది. ఇది శివుని ఆలయమే కానీ ఈ ఆలయ గర్భగుడిలో కుక్క విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ శునక విగ్రహాన్నే ప్రజలు పూజిస్తారు. ఈ ఆలయం 200 మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కుక్కల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం ఉండడం వలన వల్ల ఇక్కడి ప్రజలకు కుక్కల ద్వారా, కుక్కకాటు వల్ల ఎలాంటి రోగాలు రావని నమ్ముతారు.
ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన కుక్కల స్మారక చిహ్నం విశ్వాసపాత్రమైన కుక్కను గుర్తు చేస్తుంది. శతాబ్దాల క్రితం బంజారా తన కుటుంబంతో కలిసి ఈ గ్రామానికి వచ్చాడని ఇక్కడి నివాసితులు చెబుతున్నారు. అతనితో పాటు ఒక కుక్క కూడా ఉంది. ఒకసారి ఊరిలో కరువు రావడంతో ఆ సంచారకుడు ఆ ఊరి వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. కానీ అప్పు తీర్చలేకపోయాడు. దాంతో అతను తనకు ఎంతో విశ్వాసం చూపించే కుక్కను వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టాడు. ఒకసారి వడ్డీ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగిందట, ఆ తర్వాత దొంగలు వ్యాపారి వస్తువులను ఎక్కడ దాచి పెట్టారో ఆ ప్రదేశానికి ఆ కుక్క తీసుకువెళ్లిందని చెబుతారు. దాంతో వ్యాపారి వస్తువులన్నీ దొరికేశాయట. వడ్డీ వ్యాపారి సంతోషించి, కుక్క విధేయతకు సంతోషించి, దానిని విడిపించాలని నిర్ణయించుకుని తిరిగి సంచారకుడి ఇంటికి పంపాడు. జరిగిన సంఘటన గురించిన పూర్తివిశేషాలను ఓ లేఖలో రాసి కుక్క మెడకు వేలాడదీశాడట.
కుక్క ఇంటికి చేరుకోవడంతో బంజారా కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. వడ్డీ వ్యాపారి నుంచి కుక్క పారిపోయిందని వారు భావించారు. దాంతో కోపం వచ్చి కుక్కను కొట్టి చంపేశాడు. కానీ తరువాత అతను తన మెడలో వేలాడదీసి ఉన్న లేఖను చదివాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. సంచార మనిషి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత అదే స్థలంలో కుక్కను పాతిపెట్టి అక్కడ స్మారకాన్ని నిర్మించాడు. తరువాత ప్రజలు స్మారక చిహ్నాన్ని దేవాలయంగా మార్చారు. దీనిని నేడు కుకుర్ ఆలయంగా పిలుస్తారు.