స్మార్ట్ సిటీ పేరుతో ఇష్టారాజ్యం.. అడ్డుగా ఉన్నాయని గోడలు ధ్వంసం

దిశ, కరీంనగర్ సిటీ: స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో, గుత్తేదారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. నగర అభివృద్ధి కోసం బల్దియా ఇచ్చిన వెసులుబాట్లను ఆసరాగా చేసుకుంటూ, ఇష్టారీతిన తవ్వకాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలాలే కాదు.. నిర్మాణాలు కూడా కూల్చుతూ, మాకెవరు అడ్డు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాము చేపట్టబోయే నిర్మాణాలకు అడ్డొస్తున్నాయనే సాకుతో ఇళ్ల ప్రహరీ గోడలు కూడా కూల్చివేస్తున్నారు. ఇదేమిటని అడిగినా, అడ్డొచ్చిన వారిపై దాడి చేసినంత పనిచేస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే […]

Update: 2021-11-18 12:06 GMT

దిశ, కరీంనగర్ సిటీ: స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో, గుత్తేదారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. నగర అభివృద్ధి కోసం బల్దియా ఇచ్చిన వెసులుబాట్లను ఆసరాగా చేసుకుంటూ, ఇష్టారీతిన తవ్వకాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలాలే కాదు.. నిర్మాణాలు కూడా కూల్చుతూ, మాకెవరు అడ్డు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాము చేపట్టబోయే నిర్మాణాలకు అడ్డొస్తున్నాయనే సాకుతో ఇళ్ల ప్రహరీ గోడలు కూడా కూల్చివేస్తున్నారు. ఇదేమిటని అడిగినా, అడ్డొచ్చిన వారిపై దాడి చేసినంత పనిచేస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్ల యజమానులు బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా, నగరంలోని 58వ డివిజన్ పరిధిలో గల జ్యోతినగర్ ప్రాంతంలోని కోర్టు వెనుక భాగంలో మురికి కాల్వ నిర్మాణం చేపట్టారు. 18 ఫీట్ల వెడల్పు గల రోడ్డుపై కోర్టు వెనుక నుంచి మాజీ ఎమ్మెల్యే కట్టారు దేవేందర్ రావు ఇంటి వైపు కాలువ తవ్వారు. డ్రైనేజీ నిర్మాణం కోసం ఇళ్ల పక్క నుంచి కాలువ తవ్వాల్సి ఉంటుంది. అయితే, గుత్తేదారు సూచనతో కూలీలు ప్రహరీ గోడల పునాదులు పెకిలిస్తూ కాలువ తీశారు. దీంతో 2-10-277 అనే నెంబరు గల ఇంటి ప్రహరీ గోడ 12 గజాల వరకు కూలిపోయింది. మరో 15 గజాల గోడ కూలిపోయేందుకు సిద్ధంగా ఉండగా, దానికి కర్రలు అడ్డుపెట్టారు.

గుత్తేదారు నిర్వాకాన్ని ఇంటి యజమాని గూడ మునింద్ర రెడ్డి ప్రశ్నిస్తే, దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై బల్దియా కమిషనర్ కు ఫిర్యాదు చేయగా పరిశీలించేందుకు వచ్చిన సిబ్బంది సైతం గుత్తేదారుకే వంతపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో బాధితుడు బల్దియా ఎదుట ఆందోళనకు దిగేందుకు సిద్ధమమవుతున్నాడు. ప్రహరీ గోడ కూలిపోవటంతో లక్షకు పైగా నష్టం కలిగినట్లు బాధితుడు పేర్కొంటున్నాడు. వాస్తవానికి ఇళ్ల యజమానులకు నష్టం కలుగకుండా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ జరిగినా పరిహారం చెల్లించటం లేదా ఆప్రాంతంలో పునర్నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, నగరంలో చేపడుతున్న అనేక పనులతో ఇళ్ల యజమానులకు కలుగుతున్న నష్టంపై నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి బాధితుడి న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News