ఏపీ రాజకీయాల్లో మళ్లీ 'తారక్' మంత్రం.. కాబోయే సీఎం అంటూ రచ్చ రచ్చ

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ‘తారక్’ మంత్రం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసినప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ బతికిబట్టకట్టాలంటే అది కేవలం తారక్‌తోనే సాధ్యమంటూ అటు టీడీపీలోని కీలక నేతలతోపాటు ఇతర పార్టీ నేతలు సైతం బాహాటంగా ప్రకటిస్తున్నారు. అటు తారక్ అభిమానులు సైతం రాజకీయాల్లోకి రావాలంటూ హల్ చల్ చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు మరో అడుగు […]

Update: 2021-12-14 22:06 GMT
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ‘తారక్’ మంత్రం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసినప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ బతికిబట్టకట్టాలంటే అది కేవలం తారక్‌తోనే సాధ్యమంటూ అటు టీడీపీలోని కీలక నేతలతోపాటు ఇతర పార్టీ నేతలు సైతం బాహాటంగా ప్రకటిస్తున్నారు. అటు తారక్ అభిమానులు సైతం రాజకీయాల్లోకి రావాలంటూ హల్ చల్ చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు మరో అడుగు ముందుకేసి కాబోయే సీఎం తారక్ అంటూ ఫ్లెక్సీలు సైతం పెడుతున్నారు. ఈ ఎఫెక్ట్ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం తగిలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూ.ఎన్టీఆర్ పుట్టినరోజునో లేకపోతే సినిమా విడుదల రోజునో కాదు నిత్యం ఏపీ రాజకీయాల్లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంది. ఏపీలో వైసీపీ వేవ్ ముందు టీడీపీ నిలబడాలంటే అది ఒక్క జూ.ఎన్టీఆర్‌తోనే సాధ్యమంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా తారక్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేశారు. కాబోయే సీఎం అంటూ ఫ్లెక్సీ పెట్టడమే కాదు క్షీరాభిషేకం చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన మరోసారి వచ్చింది.

తారకమంత్రం సెగ

నందమూరి తారక రామారావు ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని స్థాపించి కాంగ్రెస్‌ విజయాలకు బ్రేక్‌లు వేశారు. అంతేకాదు ఢిల్లీ రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు. అందుకే ఎన్టీఆర్ పేరు వింటేనే చాలు తెలుగు ప్రజల్లో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. అలాంటి ఉత్సాహం నేడు జూ.ఎన్టీఆర్‌ను తలుచుకున్నా… కనబడినా అనిపిస్తుందని ఎంతోమంది ప్రకటించారు. జూ.ఎన్టీఆర్ అంటేనే తెలుగు జాతికి ఎంతో గౌరవం అంటూ తెలుగు ప్రజలు ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో తారక్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వైబ్రేషన్ ఏపీ వ్యాప్తంగా పాకింది. ఎక్కడ చూసినా తారక్ అభిమానులు ఆయన మంత్రజపం చేస్తున్నారు. తారక్ సీఎం అంటూ నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో తారక్ అభిమానులు జై తారక్.. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో మెుదలైన ఈ కాబోయే సీఎం నినాదం నేడు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతుంది.

2009 ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపిన తారక్

జూ.ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అంటేనే విపరీతమైన అభిమానం. కట్టెకాలేవరకు… నా గొంతులో ప్రాణం ఉండేవరకు టీడీపీలో ఉంటానని గతంలోనే తారక్ స్పష్టం చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తన అవసరం వస్తుందో అప్పుడు సేవలు అందించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించారు కూడా. అంతేకాదు అది నిజమని నిరూపించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తారక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇలా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. అయినప్పటికీ తానేమీ తక్కువ కాదంటూ జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందినప్పటికీ తారక్ ప్రసంగం తెలుగు రాష్ట్రాల ప్రజలను కట్టిపడేశాయి. అంతేకాదు అన్న ఎన్టీఆర్‌ను తలపించారంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు ఎంతగానో అభిమానించే నందమూరి తారకరామారావు హవా భావాలతో… డైలాగులు చెప్తూ తెలుగు ప్రజలను టీడీపీకి మరింత దగ్గర చేశారు. జూ.ఎన్టీఆర్ డైలాగులు.. ప్రజాకర్షక వ్యాఖ్యలు అతడిలోని రాజకీయ పరిపక్వతను ప్రజలు పట్టేశారు. ఒక్క ఎన్నికల ప్రచారంలోనే తన స్టార్‌డమ్‌తోపాటు పొలిటికల్ ఇమేజ్‌ను కూడా తారక్ సొంతం చేసుకున్నారు. అయితే 2009 ఎన్నికల ప్రచారంలో తారక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అంతకుముందు 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లా పడింది. ఏపీలో 23 స్థానాల్లో గెలుపొంది చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి అయ్యింది. 2019 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ పూర్తిగా కోలుకోలేదు. పార్టీ మైలేజ్ కోసం ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం కావడం లేదు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా అందులో కొంతమంది వైసీపీకి సానుభూతిపరులుగా మారిపోయారు. రాజ్యసభ సభ్యులు అయితే ఏకంగా రాజ్యసభ పక్షాన్ని బీజేపీలోనే విలీనం చేసేశారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఆశించినంత విజయాలను సొంతం చేసుకోలేదు. అంతేకాదు కనీసం అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను సైతం క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తానం అంశం తెరపైకి వచ్చింది. తారక్ వస్తేనే టీడీపీ బతుకుతుందంటూ అటు టీడీపీ కార్యకర్తలతోపాటు ఇటు ఇతర పార్టీల నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.

తారక్‌కు కలిసొచ్చే అంశాలివే!

జూ.ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రజాదరణ ఉంది. యూత్‌లో అయితే మంచి క్రేజ్ ఉంది. అందుకే తారక్ సినిమా విడుదలైన సందర్భంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనడమే అందుకు నిదర్శనం. అలాగే 2009 ఎన్నికల ప్రచారంలో తారక్ ప్రజాకర్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో తారక్ చాలా పరిపక్వత చెందారు. తారక్ మాట్లాడే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. సినీ రంగంలోనే కాదు ఇటు రాజకీయ రంగంలో కూడా తారక్‌కు చాలా మంది సుపరిచితులు ఉన్నారు. వైసీపీలో ఇప్పుడు కీలక నేతలుగా ఉన్న వల్లభనేని వంశీమోహన్, మంత్రి కొడాలి నానిలు తారక్‌కు అత్యంత సన్నిహితులు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వారిలో దాదాపు చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇవి తారక్‌కు కలిసొచ్చే ప్రధాన అంశాలుగా చెప్పుకొవచ్చు. అలాగే సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే తారక్‌ అటు మెగా కాంపౌండ్‌తోపాటు ఇటు సూపర్ స్టార్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో నందమూరి అభిమానులతోపాటు మెగా, సూపర్ స్టార్ అభిమానులు సైతం తారక్‌ను అభిమానిస్తారు. ఇది కూడా కలిసొచ్చే అంశాల్లో ప్రధానమైనది. ఇకపోతే టీడీపీకి పూర్వవైభవం రావాలంటే అది తారక్ తోనే సాధ్యమని సొంత పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీ నేతలు సైతం కోరుతున్నారంటే అతడి క్రేజ్ ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు వల్లే టీడీపీకి దూరమయ్యారా?

తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన అభిమానం చూపించే తారక్ 2009 తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం తన సోదరి నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. దీనికంతటికి చంద్రబాబు వ్యవహారశైలియే కారణమని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. నారా లోకేశ్ కోసం తారక్‌ను రాజకీయాల్లోకి రానియ్యడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తారక్ ముందు లోకేశ్ ఏపాటికి సరిపోడంటూ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే టీడీపీని ఎన్టీఆర్ కు లేదా నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

లోకేశ్ నాయకత్వంపై భిన్నాభిప్రాయాలు

తెలుగుదేశం పార్టీలో చినబాబుగా నారా లోకేశ్‌కు గుర్తింపు ఉంది. నారా లోకేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడుగా పార్టీలో క్రియాశీలకంగామారారే తప్ప పార్టీలో కీలకంగా మారలేదనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబులా దూకుడుగా ఉండే స్వభావం లోకేశ్‌ది కాదని సొంత పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓటమిపాలవ్వడంతో అప్పటి నుంచి లోకేశ్ నాయకత్వంపై టీడీపీలో ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. లోకేశ్ పార్టీ బాధ్యతలు నిర్వహించలేరని… అతడి నిర్ణయాల వల్లే 2019 ఎన్నిల్లో ఓటమిపాలయ్యామంటూ పలువురు టీడీపీ నేతలు ఏకంగా తండ్రి చంద్రబాబు వద్దే పంచాయతీ పెట్టిన సంగతి తెలిసిందే. అందువల్లే పార్టీలో లోకేశ్ నాయకత్వంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్‌కు పగ్గాలు అప్పగిస్తే ఇక పార్టీ మూసుకోవాల్సిందేనని.. కాబట్టి తారక్‌ను టీడీపీలో కీలకం చేయాలంటూ కార్యకర్తలు ఒత్తిడి పెంచుతున్న సంగతి తెలిసిందే.

తారక్ ఎంట్రీని స్వాగతిస్తారా..?

ఇకపోతే నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విలపించిన తీరు అందరికీ తెలిసిందే. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యానించారంటూ చంద్రబాబు గొల్లుమన్నారు. ఈ అంశంపై తెలుగు తమ్ముళ్లతోపాటు నందమూరి అభిమానులు సైతం తీవ్రంగా స్పందించారు. నందమూరి ఫ్యామిలీలు అన్నీ ఒకే చోటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తారక్‌ సైతం స్పందించారు. అయితే తారక్ స్పందనపై నారా లోకేశ్‌కు సన్నిహితంగా ఉండే వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు మాత్రం ఘాటుగా స్పందించారు. తారక్ స్పందించిన తీరు సరిగ్గా లేదన్నారు. మీ మేనత్తపై ఇలా స్పందిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింహాద్రిలా వస్తాడనుకుంటే ప్రవచనాలు చెప్పాడంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుత తరుణంలో టీడీపీకి ఎన్టీఆర్ సేవలపై బాలకృష్ణ, లోకేశ్, భరత్‌లు ఇష్టంగా లేరని తెలుస్తోంది. అందువల్లే తారక్ మౌనంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

సమంత ఐటమ్ సాంగ్.. హీట్ ఎక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ అరియాన

దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య

Tags:    

Similar News