కరోనా కొత్త రకం జన్యు వైరస్ ‘D614G’

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ శాస్త్రవేత్తలకు సవాలు విసురుతూనే ఉంది. వ్యాక్సిన్లు వస్తున్నప్పటకీ వాటి ప్రభావం.. ఎంతవరకు ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. గతంలో వచ్చిన చాలా వైరస్‌లు.. కొన్ని నెలల తర్వాత వాటంతటవే ఈ ప్రపంచాన్ని వీడిపోయాయి. మరికొన్ని వైరస్‌లు మాత్రం వ్యాక్సిన్ వచ్చాక వాటి ప్రభావాన్ని కోల్పోయాయి. కానీ కరోనా విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. ఎందుకంటే.. కరోనా ఎప్పటికప్పుడు తన జన్యువును మార్చుకుంటూ.. తీవ్రతను చూపిస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలకు […]

Update: 2020-08-17 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ శాస్త్రవేత్తలకు సవాలు విసురుతూనే ఉంది. వ్యాక్సిన్లు వస్తున్నప్పటకీ వాటి ప్రభావం.. ఎంతవరకు ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. గతంలో వచ్చిన చాలా వైరస్‌లు.. కొన్ని నెలల తర్వాత వాటంతటవే ఈ ప్రపంచాన్ని వీడిపోయాయి. మరికొన్ని వైరస్‌లు మాత్రం వ్యాక్సిన్ వచ్చాక వాటి ప్రభావాన్ని కోల్పోయాయి. కానీ కరోనా విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. ఎందుకంటే.. కరోనా ఎప్పటికప్పుడు తన జన్యువును మార్చుకుంటూ.. తీవ్రతను చూపిస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ కరోనా వైరస్‌పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. తాజాగా కరోనా వైరస్‌కు చెందిన కొత్తరకం జన్యువును మలేషియా సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్ర‌జంట్ వైర‌స్ కన్నా పది రెట్లు వేగంగా వ్యాపించ‌గ‌ల‌ద‌ని చెబుతుండటం గమనార్హం.

ఈ కొత్తరకం జన్యు వైరస్‌‌ను D614Gగా పిలుస్తున్నారు. ఒక క్లస్టర్‌లోని 45 కేసులను తీసుకుంటే కనీసం మూడు కేసుల్లో D614G క‌రోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనాన్ని గుర్తించారు. అయితే, తొలిగా.. భారతదేశం నుంచి మలేషియాకు తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ ఓనర్‌లో దీన్ని గుర్తించారు. అతను 14 రోజుల హోమ్ క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించడంతో ఆ వైరస్ ఇతరులకు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా, కొవిడ్ రూల్స్ ఉల్లఘించినందుకు గాను అతడికి ఐదు నెలల జైలు శిక్ష విధించ‌డంతో పాటు ఫైన్ వేశారు. అయితే ఈ కొత్త జన్యు వైరస్‌ను చాలా దేశాల్లో గ‌తంలోనే ఐడెంటిఫై చేసిన‌ట్టు చెప్పారు.

కొత్త మ్యుటేషన్ కరోనా వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుందని టాప్ ఇమ్యునోలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు. ఇప్పటికే వ్యాక్సిన్లపై కొనసాగుతున్న ప్ర‌యోగాలు ఈ మ్యుటేషన్‌ను ఎదుర్కొనేందుకు అనుగుణంగా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని మలేషియా ఆరోగ్య విభాగం డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా తెలిపారు. ‘మలేషియా ప్రజల్లో ఈ కొత్తరకం జన్యువును గుర్తించాం. అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించాలి. ఈ వైరస్‌ను బ్రేక్ చేసేందుకు ప్రజల నుంచి పూర్తి మద్దతు కావాలి’ అని హిషామ్ అన్నారు. అయితే, ఈ మ్యుటేషన్.. అమెరికా, ఐరోపాలో విభిన్నంగా‌ ఉందని, ఈ జాతి మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గనైజేష‌న్ పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల సామర్థ్యంపై మ్యుటేషన్ పెద్దగా ఎఫెక్ట్‌ చూపే అవకాశం లేదని సెల్ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనా ఫలితాల ద్వారా తెలుస్తోంది.

కరోనా వైరస్ ఊసరవెల్లిలా.. జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్ని అతలాకుతలాం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా రెండో వేవ్ వస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఎప్పుడూ చెబుతూనే ఉంది. ఇప్పుడు మలేషియా పరిశోధకులు.. కొత్త రకం జన్యువు పది రెట్లు వేగంగా వ్యాపించగలదని వెల్లడిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ప్రజలు మరికొన్ని నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News