ధోనీ సేన భారీ విజయం

దిశ, స్పోర్ట్స్: ‘వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై తలపడిందా లేదా రవీంద్ర జడేజా తలపడ్డాడా?’ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ సోషల్ మీడియాలో జడ్డూ గురించే చర్చ. చివరి ఓవర్లో 36 పరుగులు కొట్టడం దగ్గర మొదలైన జడేజా మ్యాజిక్.. బెంగళూరు ఇన్నింగ్స్ ఆసాంతం కనిపించింది. వికెట్లు తీస్తూ. రనౌట్లు చేస్తూ మైదానం మొత్త జడేజానే కనపడ్డాడు. భారీ టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు చెన్నై బౌలర్ల ధాటికి 122 పరుగులకే పరిమితం అయ్యింది. టెయిలెండర్లు […]

Update: 2021-04-25 08:15 GMT

దిశ, స్పోర్ట్స్: ‘వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై తలపడిందా లేదా రవీంద్ర జడేజా తలపడ్డాడా?’ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ సోషల్ మీడియాలో జడ్డూ గురించే చర్చ. చివరి ఓవర్లో 36 పరుగులు కొట్టడం దగ్గర మొదలైన జడేజా మ్యాజిక్.. బెంగళూరు ఇన్నింగ్స్ ఆసాంతం కనిపించింది. వికెట్లు తీస్తూ. రనౌట్లు చేస్తూ మైదానం మొత్త జడేజానే కనపడ్డాడు. భారీ టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు చెన్నై బౌలర్ల ధాటికి 122 పరుగులకే పరిమితం అయ్యింది. టెయిలెండర్లు సిరాజ్, చాహల్ నిలబడక పోయి ఉంటే ఆలౌట్ అయిన అవమానం కూడా మూట గట్టుకునేది. మొత్తానికి బెంగళూరు జైత్రయాత్రకు చెన్నై అడ్డుకట్ట వేసింది.

ఐపీఎల్ 2021లో భాగంగా ముంబైలోని వాంఖడేలో ఆదివారం మధ్యాహ్నం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. పడిక్కల్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదుతూ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం క్రీజులో కాస్త అసౌకర్యంగా కనిపించాడు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (8) సామ్ కర్రన్ బౌలింగ్‌లో ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి బెంగళూరు వికెట్ల పతనం ప్రారంభమైంది. దూకుడు మీద ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ (34) శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రమోషన్ అందుకొని ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (7) జడేజా బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దూకుడు మీద కనిపించిన మ్యాక్స్‌వెల్ (22)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చురుకైన ఫీల్డింగ్‌తో డైరెక్ట్ త్రో వేసి డాన్ క్రిస్టియన్ (1)ను జడేజా రనౌట్ చేశాడు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ (4) కూడా జడేజా బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 83 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా నిలబడ లేదు. క్రమం తప్పకుండా చెన్నై బౌలర్లు వికెట్లు తీయడంతో 103 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఇక బెంగళూరు ఆలౌట్ అవడం ఖాయమని అందరూ భావించారు. క్ానీ యజువేంద్ర చాహల్ (8), మహ్మద్ సిరాజ్ (12) క్రీజులో పాతుకొని పోయారు. సిరాజ్ ఒకసారి రివ్యూ తీసుకొని బతికి పోయాడు. ఆ తర్వాత వారిద్దరినీ అవుట్ చేయలేక చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 69 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జడేజా 3, ఇమ్రాన్ తాహీర్ 2 వికెట్లు తీయగా.. సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీశారు. రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

రాణించిన ఓపెనర్లు.. ఉతికారేసిన జడేజా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్ తమ సూపర్ ఫామ్‌ను కొనసాగించారు. మొదటి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రుతురాజ్ గైక్వాడ్ మరింత వేగంగా ఆడాడు. అతడికి తోడు డు ప్లెసిస్ కూడా అతడికి చక్కటి సహకారం అందించాడు. దీంతో వీరిద్దరూ కలసి పవర్ ప్లేలోనే 50 పరుగులు సాధించారు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడి పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. మంచి దూకుడు మీద ఉన్న రుతురాజ్ (33) యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో కైల్ జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా కూడా పరుగుల వేగం తగ్గకుండా బ్యాటును ఝులిపించాడు. డు ప్లెసిస్, రైనా కలసి రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డు ప్లెసిస్ (50) అర్దసెంచరీ సాధించాడు. అయితే హర్షల్ పటేల్ వరుస బంతుల్లో వీరిద్దరినీ అవుట్ చేశాడు. సురేష్ రైనా (24) పటేల్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డు ప్లెసిస్ (50) ఆ తర్వాతి బంతికే డాన్ క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. అంబటి రాయుడు (14) జడేజా కలసి నాలుగో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. అయితే వేగంగా పరుగులు చేసే క్రమంలో అంబటి రాయుడు (14) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కైల్ జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి ఇన్నింగ్స్‌లో 2.3 ఓవర్లు మిగిలి ఉండగా.. జట్టు స్కోర్ 142 పరుగుల వద్ద ఉన్నది. చెన్నై 160 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (62) చివరి ఓవర్లో బీభత్స సృష్టించాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. 5 సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్, నోబాల్ కలసి సీఎస్కేకు 37 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, యజువేంద్ర చాహల్‌కు ఒక వికెట్ లభించింది.

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్

రుతురాజ్ గైక్వాడ్ (సి) కైల్ జేమిసన్ (బి) యజువేంద్ర చాహల్ 33, ఫాఫ్ డు ప్లెసిస్ (సి) డాన్ క్రిస్టియన్ (బి) హర్షల్ పటేల్ 50, సురేష్ రైనా (సి) దేవ్‌దత్ పడిక్కల్ (బి) హర్షల్ పటేల్ 24, అంబటి రాయుడు (సి) కైల్ జేమిసన్ (బి) హర్షల్ పటేల్ 14, రవీంద్ర జడేజా 62 నాటౌట్, ఎంఎస్ ధోనీ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లు) 191/4

వికెట్ల పతనం : 1-74, 2-111, 3-111, 4-142

బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ (4-0-32-0), కైల్ జేమిసన్ (3-0-31-0), యజువేంద్ర చాహల్ (3-0-24-1), నవదీప్ సైనీ (2-0-27-0), హర్షల్ పటేల్ (4-0-51-3), డాన్ క్రిస్టియన్ (2-0-12-0), వాషింగ్టన్ సుందర్ (2-0-13-0)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్

విరాట్ కోహ్లీ (సి) ఎంఎస్ ధోనీ (బి) సామ్ కర్రన్ 8, దేవ్‌దత్ పడిక్కల్ (సి) సురేష్ రైనా (బి) శార్దుల్ ఠాకూర్ 34, వాషింగ్టన్ సుందర్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) రవీంద్ర జడేజా 7, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (బి) రవీంద్ర జడేజా 22, ఏబీ డివిలియర్స్ (బి) రవీంద్ర జడేజా 4, డాన్ క్రిస్టియన్ (రనౌట్) 1, కైల్ జేమిసన్ (రనౌట్) 16, హర్షల్ పటేల్ (బి) ఇమ్రాన్ తాహిర్ 0, నవదీప్ సైనీ (సి) సురేష్ రైనా (బి) ఇమ్రాన్ తాహిర్ 2, యజువేంద్ర చాహల్ 8 నాటౌట్, మహ్మద్ సిరాజ్ 12 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లు ఓవర్లు) 122/9

వికెట్ల పతనం : 1-44, 2-54, 3-65, 4-79, 5-81, 6-86, 7-89, 8-94, 9-103

బౌలింగ్ : దీపక్ చాహర్ (2-0-25-0), సామ్ కర్రన్ (4-0-35-1), శార్దుల్ ఠాకుర్ (4-0-11-1), రవీంద్ర జడేజా (4-1-13-3), ఇమ్రాన్ తాహిర్ (4-0-16-2), డ్వేన్ బ్రావో (2-0-19-0)


Similar News