పాలమూరులో వేల ఎకరాల్లో పంట నష్టం
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో 5 రోజులుగా కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక ఇండ్లు ధ్వంసమవడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని అనేక చెరువులు నిండి అలుగు పారుతుండగా, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా చాలా నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పంట […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో 5 రోజులుగా కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక ఇండ్లు ధ్వంసమవడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని అనేక చెరువులు నిండి అలుగు పారుతుండగా, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా చాలా నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పంట కండ్ల ముందే నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 66,614 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. కానీ అనధికారికంగా నష్టం మరింత తీవ్రంగా ఉన్నట్టు సమాచారం.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 13,760 ఎకరాలు, నారాయణపేటలో 42,735, వనపర్తిలో 5,249, నాగర్‌కర్నూల్‌లో 4,870 ఎకరాల వరకు పంట నష్టం ఏర్పడింది. వీటిలో 27,300 ఎకరాల్లో పత్తి, 19,200 ఎకరాల్లో కంది, 2280 ఎకరాల్లో వరి దెబ్బతినగా, పలు చోట్ల జొన్న తదితర పంటలు నీటమునిగాయి.
వందల సంఖ్యలో కూలిన ఇండ్లు:
జిల్లాలో విస్తృతంగా కురిసిన వర్షాల కారణంగా పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1383 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలో 142 ఇండ్లు పూర్తిగా నేలమట్టం కాగా, నారాయణపేటలో 48, వనపర్తిలో 32, నాగర్‌కర్నూల్‌లో 46 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మిగితా ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాత్రి సమయంలో ఇండ్లు కూలడంతో పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రెవల్లిలో తల్లి, కూతురు మృతి చెందగా, వంగురు మండలంలో ఒకరు, మహబూబ్‌నగర్ జిల్లా కోటకదిరలో ఇద్దరు, మహ్మదాబాద్ మండలంలోని పగిడాల గ్రామంలో తల్లి, ఇద్దరు కూతుర్లు ప్రాణాలు వదిలారు.
నిండుకుండల్లా చెరువులు, ప్రాజెక్టులు:
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే జూరాల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, రెండు రోజులుగా కోయిల్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో1058 చెరువులకు గానూ ఇప్పటికే 793 చెరువులు నిండాయి. నారాయణపేట జిల్లాలో 986 చెరువులకు గానూ 322 చెరువులు నిండగా, వనపర్తిలో 1083కు గానూ 749 చెరువులు నిండాయి. వీటితో పాటు సంగంబండ రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. సరళాసాగర్ సైఫన్ గేట్లు తెరుచుకోగా, రామన్‌పాడు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కింది ప్రాంతాలకు వదులుతున్నారు.
నది ప్రమాదాల్లో ఐదుగురు గల్లంతు:
ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నదిలో వేరువేరు ఘటనల్లో ఐదుగురు గల్లంతయ్యారు. నారాయణపేట జిల్లా పస్ఫుల్ వద్ద కర్నాటకకు చెందిన 15మంది పుట్టిలో వస్తుండగా అది మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మందిని అక్కడే ఉన్న జాలర్లు కాపాడి ఒడ్డుకు చేర్చారు. మిగతా నలుగురు గల్లంతయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అటు గద్వాల జిల్లాలో రాజోలికి చెందిన ముగ్గురు యువకులు పుట్టిలో చేపల వేటకు వెళ్లగా అది మునిగిపోయింది. ఈ ప్రమాదంలో రవి అనే యువకుడు గల్లంతు కాగా.. మరుసటి రోజు చేపల వలలో అతడి మృతదేహం చిక్కింది.