మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో మాయాజాలం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపులో మాయాజాలం చోటు చేసుకుంది.
దిశ, కొమురవెల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపులో మాయాజాలం చోటు చేసుకుంది. హుండీ ఆదాయం రూ. కోటి 5 లక్షల 25 వేల 903 వచ్చింది. మంగళవారం కొమురవెల్లిలోని ఆలయ ముఖమండపంలో ఈఓ బాలాజీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. కాగా హుండీ లెక్కింపులో బంగారు గొలుసు, ఉంగరం కానరాకుండా పోవడంతో బంగారు గొలుసు చెత్త కుప్పలో లభించింది. అలాగే బంగారు ఉంగరం మాయం అయింది. మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపును అధికారులు ఉదయం ప్రారంభించగా మధ్యాహ్నం భోజనం సమయంలో సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు, బంగారు ఉంగరం హుండీ లెక్కింపులో లభించిగా అక్కడే ఉన్న
ఈఓ సమక్షంలో వాటిని టేబుల్ పై పెట్టి భోజనం సమయంలో అధికారులు కొందరు భోజనానికి వెళ్లారు. అనంతరం బంగారు గొలుసు, ఉంగరం టేబుల్ పై కనిపించ లేదు. దీనితో అధికారులు వెంటనే అప్రమత్తమై వాటిని వెతకగా చెత్తకుప్పలో బంగారు గొలుసు ప్రత్యక్షమైంది. బంగారు ఉంగరం మాత్రం కనిపించకపోవడంతో అధికారులు సిబ్బంది అవాక్ య్యారు. ఈ విషయమై ఈఓ బాలాజీని వివరణ కోరగా ఉండి లెక్కింపులో బంగారు గొలుసు కనిపించకుండా పోగా పక్కనే ఉన్న చెత్త కుప్పలో దొరికిందని, బంగారు ఉంగరం పోయిన మాటలో వాస్తవం లేదని, హుండీ లెక్కింపు అయిపోయాక సీసీ కెమెరాలను పరిశీలించి సిబ్బంది ఎవరైనా కావాలని చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాల రూముకు తాళం వేసినట్లు తెలిపారు.