అమానవీయం.. కెనాల్‌లో పసికందు..!

పాపం... పసికందు.. ఇష్టం లేకనో లేదా అక్రమ సంతానమో

Update: 2024-09-12 11:11 GMT

దిశ,హుజురాబాద్ రూరల్: పాపం... పసికందు.. ఇష్టం లేకనో లేదా అక్రమ సంతానమో తెలియదు గానీ అభం శుభం తెలియని నవజాత శిశువును కాకతీయ కాలువలో పడేశారు. ఈ అమానవీయ ఘటన హుజురాబాద్ మండలం తుమ్మనపెల్లి హనుమాన్ టెంపుల్ సమీపంలోని కాకతీయ కాలువలో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... తుమ్మనపల్లి గ్రామానికి చెందిన గుండేటి బక్కారెడ్డి అనే రైతు తన ట్రాక్టర్ శుభ్రం చేసుకోవడానికి తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ ర్యాంపులోకి దిగాడు. ట్రాక్టర్ కడుగుతున్న సమయంలో కాలువ పక్కన కాశ గడ్డిలో పసిపాప ఏడుపు వినిపించింది.వెంటనే గమనించిన ఆయన కట్ట పై ఉన్న కాశగడ్డి పోదల వద్దకు వెళ్లి చూడగా సంచిలో మూట కట్టిన శిశువు కనిపించింది.

ఆందోళన చెందిన ఆయన గ్రామంలోకి వెళ్లి మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి తో పాటు గ్రామ పెద్దలకు తెలియజేశారు. వారు హుటాహుటిన కాకతీయ కాలువ వద్దకు వచ్చి శిశువును సంచి తో సహా బయటకు తీసి చూశారు. అప్పటికి మగ శిశువు ఏడుస్తుంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ తిరుమల గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పాపను తన కారులో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు శిశువు ఆరోగ్యంగానే ఉందని దూరం నుంచి విసిరివేయడం వల్ల కొన్ని గాయాలు అయ్యాయని తెలిపారు. గడ్డి పై పడటం, బట్ట సంచిలో ఉండడం వల్లే శిశువు బతికిందని పేర్కొన్నారు.

శిశువు పుట్టి నాలుగు నుంచి ఐదు రోజులు అవుతుంది అని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం శిశువును ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏసీపీ శ్రీనివాస్ జి సైతం ఆసుపత్రిని సందర్శించి శిశువు యోగక్షేమాలను కనుక్కున్నారు. ఐసీడీఎస్ అధికారులు శిశువును తీసుకొని కరీంనగర్ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిధిలోని శిశు విహార్ కి చేర్చనున్నట్లు సిడిపిఓ సుగుణ తెలిపారు. శిశువులు అవసరం లేని వాళ్ళు శిశువులను చెత్తకుప్పల్లో, రహదారుల పక్కన, కెనాల్ లో వదిలేసి మాతృత్వానికి మచ్చ తీసుకురావడం దారుణమని అక్కడికి వచ్చిన పలువురు చర్చించుకున్నారు.


Similar News