ఆయన ఉద్యోగం టీం లీడర్​...ప్రవృత్తి దొంగతనం

ఆయన ఉద్యోగం ఓ కంపెనీలో టీం లీడర్.

Update: 2024-09-13 12:54 GMT

దిశ, తలకొండపల్లి : ఆయన ఉద్యోగం ఓ కంపెనీలో టీం లీడర్. కానీ సమయం దొరికినప్పుడల్లా చోరీలు చేస్తుంటాడు. కారులో వచ్చి బ్యాటరీలు కాజేస్తుంటాడు. అలాంటి నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్ గ్రామపంచాయతీలో గత నెల 25 న అర్ధరాత్రి నెంబర్ ప్లేట్ లేని కార్లో వచ్చి సుమారు 8 మంది రైతులకు చెందిన ట్రాక్టర్లు, ఒక టిప్పర్ కు చెందిన బ్యాటరీలను ఎత్తుకెళ్లిన సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. బ్యాటరీ దొంగలను పట్టుకోవడానికి సీసీఎస్ పోలీసుల సహకారంతో ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్, వారి బృందం మూడు గ్రూపులుగా విడిపోయి 17 రోజులుగా 8 మండలాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. దాంతో చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను వారి ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా గుర్తించినట్టు తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

    చోరీకి పాల్పడ్డ ఘటనలో ముగ్గురు నిందితులకు గాను ఇద్దరు పరారీలో ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్​లోని చంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. పట్టుబడ్డ నిందితుడు సయ్యద్ ఇర్ఫాన్ హుస్సేన్ అమీన్ కాలనీ, ఫలక్నామా రైల్వే స్టేషన్ వద్ద నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. నిందితుడు ఇన్​టెక్​ అనే కంపెనీలో టీం లీడర్ గా పనిచేస్తూ సమయం దొరికినప్పుడల్లా చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులు మహమ్మద్ అర్సలాం అహ్మద్ (21), మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ గా గుర్తించారు. గతంలో కూడా వీరు చేవెళ్ల, మోహినాబాద్ లో బ్యాటరీల చోరీలకు పాల్పడ్డారని, అదేవిధంగా కల్వకుర్తి, భువనగిరి ప్రాంతాలలో గొర్రెలను కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ బి. జాషువా, కడ్తాల్ పీఎస్ కానిస్టేబుల్ వి.రఘులను ఆమనగల్ సీఐ ప్రమోద్ కుమార్ , తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. 

Tags:    

Similar News