ఆర్మూర్ మున్సిపాలిటీలో దారుణం.. ఆస్తి కోసం అన్నను కడతేర్చిన తమ్ముడు
ఆస్తి కోసం తమ్ముడు సొంత అన్ననే కడతేర్చిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ ఆర్మూర్: ఆస్తి కోసం తమ్ముడు సొంత అన్ననే కడతేర్చిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన నరసయ్య, గంగాధర్ వరుసకు అన్నదమ్ములు. అయితే, కొన్నాళ్ల నుంచి వారిద్దరి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలు క్షణికావేశానికి గురైన తమ్ముడు గంగాధర్ కోపంతో అన్న నరసయ్యపై కట్టెతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన నరసయ్యను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, అక్కడ పరిస్థతి విషమించడంతో చికిత్స పొందుతున్న నరసయ్య మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్మూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. హత్యకు సంబంధించి ఆర్మూర్ పోలీసులు లోకల్ జర్నలిస్టులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వివాదస్పదమైంది. ఇంత పెద్ద ఘటన జరిగినా పోలీసుల ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల ఆర్మూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.