విషాదం..వాగులో కొట్టుకుపోయి యువకుడి మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-01 13:37 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. వరదల పై అప్రమత్తమైన అధికారులు పలు చోట్ల రాకపోకలు బంద్ చేశారు. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించడంతో వరదల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందిన ఘటనలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే..మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, భీమవరం గ్రామ పంచాయతీ భవానిపురంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. యువకుడి వయసు 18 ఏళ్లు. గ్రామానికి చెందిన రాఘవరావు కుమారుడు, సాంబశివరావు వాగు ఉధృతికి కొట్టుకుపోయి చనిపోవడంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొట్టుకుపోయిన యువకుడి మృతదేహాన్ని వాగు సమీపంలో స్థానికులు గుర్తించారు. కొడుకు మృతితో  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Similar News