TSPSC పేపర్ లీక్ కేసు: అఫిడవిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ బోర్డు
TSPSC పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ బోర్డు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కాంగ్రెస్దాఖలు చేసిన పిటీషన్‌పై బోర్డు అదనపు కార్యదర్శి, నోడల్ ఆఫీసర్ (లీగల్) ఆర్.సుమతి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బోర్డు పరీక్షలకు సంబంధించిన పరీక్షల ప్రశ్నాపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి ప్రశాంత్, రాజశేఖర్‌రెడ్డి కలిసి తస్కరించినట్టు ఇప్పటికే సిట్విచారణలో వెల్లడైందని అందులో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కొందరు బోర్డు ఉద్యోగులతో పాటు మరికొందరు ప్రైవేట్ వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని తెలిసిన వెంటనే పలు పరీక్షలను రద్దు చేసినట్టు తెలియచేశారు. మొదట బేగంబజార్ పోలీసులు కేసు నమెదు చేసి నిందితులను అరెస్టు చేశారని, ఆ తరువాత కేసును సిట్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు సంతృప్తికరంగా కొనసాగుతున్నందున సీబీఐకి అప్పగించాలంటూ కాంగ్రెస్‌పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటీషన్‌ను డిస్మిస్ చేయాలని అఫిడవిట్లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ సోమవారం జరుగనుంది.