పండుగ పూట విషాదం...రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది.
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. గంగారాంనగర్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్య, భర్త, కుమారుడిలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. బెల్లంపల్లి టూన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైద్రాబాద్ లో మెకానిక్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అక్కు రాజు, భార్య రేణుక, కుమారుడితో కలిసి కారులో హైదరాబాద్ నుండి కాగజ్ నగర్ కు వస్తున్నారు.
బెల్లంపల్లి చేరుకున్నాక గంగారం నగర్ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న లారీని అతి వేగంతో కారు ఢీకొంది. కారు దూసుకెళ్లి లారీ కింద ఇరుక్కుపోయింది. కారులో ముందు సీట్లో కూర్చున్న భార్య రేణుక (28) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాజు తీవ్రoగా గాయపడ్డారు. ఈ సంఘటనలో కారు వెనక సీట్లో కూర్చున్న వారి కుమారుడికి ప్రమాదం తప్పింది. గాయపడిన రాజును మంచిర్యాలకు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.