ఆన్లైన్ బెట్టింగ్ కేసులో నాలుగుకు చేరిన మృతులు
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు మృతి చెందారు.
దిశ, తాండూర్ : ఆన్లైన్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. దాంతో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులకు కుమారుడు శివకుమార్, దివ్యంగురాలైన కూతురు చైతన్య ఉన్నారు. కుమారుడు శివప్రసాద్ లక్షల్లో అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై ఆర్థికంగా చితికిపోయాడు.
అప్పు ఇచ్చినవాళ్లు డబ్బులు అడగడంతో అప్పులు తీర్చలేక మనస్థాపంతో మొండయ్య, శ్రీదేవి, శివకుమార్, చైతన్య శీతల పానియంలో మంగళవారం తెల్లవారుజామున గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మొండయ్య, చైతన్య మంగళవారం రాత్రి, శ్రీదేవి, శివకుమార్ బుధవారం మృతి చెందారు. కుటుంబంలోని మొత్తం నలుగురు మృతి చెందడంతో సమీప బంధువులు వారి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడు సముద్రాల మొండయ్య బావమరిది కోలేటి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.