నిందితురాలిని పట్టిచ్చిన ఆర్టీసీ జీరో టికెట్టు

ఆర్టీసీ జీరో టికెట్టు ఓ నిందితురాలిని పట్టిచ్చింది.

Update: 2024-11-23 13:34 GMT

దిశ, దుండిగల్ : ఆర్టీసీ జీరో టికెట్టు ఓ నిందితురాలిని పట్టిచ్చింది. ఆభరణాల కోసం మహిళను పథకం ప్రకారం మరో మహిళ హతమార్చింది. కల్లు తాపించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతి దారుణంగా కర్రతో కొట్టి హత్య చేసింది. ఈ కేసును ఛేదించిన దుండిగల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

     గత నెల 14వ తేదీన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లి కాకతీయ లేఔట్ లోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని మహిళ శవం పడి ఉందని స్థానికులు డయల్ 100 ద్వారా దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేపట్టగా మృతురాలు ఆర్టీసీ బస్సు దిగి ఘటనా స్థలానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

జీరో టికెట్టు లేకపోతే కేసు కష్టమయ్యేది...

చనిపోయిన మహిళ గండి మైసమ్మ వద్ద ఆర్టీసీ బస్సు దిగినట్లు గుర్తించిన దుండిగల్ పోలీసులు బస్సు నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. బస్సులో మహిళ తీసుకున్న జీరో టికెట్టు ఆధారంగా ఆమె ఆధార్ కార్డు సహాయంతో ఆమె ఎక్కడ బస్సు ఎక్కింది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిజామాబాద్​లో బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు అక్కడ బస్సు ఎక్కే టైంలో సీసీ కెమెరాలు పరిశీలించగా మృతురాలితోపాటు మరో మహిళ బస్సు ఎక్కుతున్నట్లు, దిగిన చోట కూడా ఇద్దరూ కలిసి వెళ్లినట్లు గుర్తించారు.

     మృతురాలు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన అంజమ్మ(45) గా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమె రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, తిరిగి రాలేదని తెలిపారు. ఆమెతో ప్రయాణించిన మరో మహిళ పేరు అదే ప్రాంతానికి చెందిన బూసిబోయిన గంగామణిగా(40) పోలీసు దర్యాప్తులో తేలింది.

ఆభరణాల కోసమే హత్య

మృతురాలు అంజమ్మ మెడలో ఉన్న ఆభరణాలను చూసి ఆశపడిన గంగామణి ఎలాగైనా అవి కాజేయాలని పథకం రచించింది. మా బంధువుల ఇంటికి వెళ్లొద్దామంటూ అంజమ్మతో నమ్మ బలికి నిజామాబాద్ నుండి వెంటబెట్టుకుని తీసుకువచ్చిన గంగామణి గండిమైసమ్మ లోని బస్టాండ్ వద్ద కల్లు తాగించి బహదూర్ పల్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లింది. అనంతరం వెంట తెచ్చుకున్న కర్రతో కొట్టి చంపిందని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.

     నిందితురాలు గంగామణిపై నిజాంబాద్ లో గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. మృతురాలిని చంపి కాజేసిన రూ.2 లక్షల విలువచేసే వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గంగామణిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, దుండిగల్ సీఐ సతీష్, డీఐ బుడిగం సతీష్, ఎస్సైలు శంకర్, రామ్మోహన్ రెడ్డిని డీసీపీ అభినందించారు. 


Similar News