పాఠశాల భవనంపై నుండి కింద పడి విద్యార్థికి గాయాలు
సికింద్రాబాద్ బోయినపల్లి ఏరియాలోని స్థానిక పల్లవి మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న తనీష్ రెడ్డి అనే విద్యార్థి పాఠశాల భవనం 2వ అంతస్తుపై నుండి గురువారం ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ బోయినపల్లి ఏరియాలోని స్థానిక పల్లవి మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న తనీష్ రెడ్డి అనే విద్యార్థి పాఠశాల భవనం 2వ అంతస్తుపై నుండి గురువారం ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వెంటనే పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థిని వైద్యచికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ విద్యార్థి పాఠశాల భవనం పై నుండి కింద పడిన విషయం తల్లిదండ్రులకు సమాచారం అందడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లారు.
అయితే విద్యార్థి మాత్రం పాఠశాల భవనంపై నుండి తన ఆకతాయితనంతోనే ప్రమాదవశాత్తు కింద పడినట్లు పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయం అంతా పూర్తిగా సీసీ కెమెరాలలో నిక్షిప్తమై ఉంది. అయితే గతంలోనూ పదో తరగతి విద్యార్థిని ఈ పాఠశాల భవనం పై నుండి పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థి భవనంపై నుండి కింద పడడం ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరే ఇతర కారణాలా అనే కోణంలో బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
పాఠశాల డైరెక్టర్ యశస్విన్ వివరణ
గురువారం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన విద్యార్థి పాఠశాల ముగియగానే తొందరలో తాళం వేసిన గేటుపై నుండి వెళ్లి చిన్న సందు ద్వారా భవనంపై నుండి దూకి ఓ ఉపాధ్యాయురాలిపై పడ్డాడు. విద్యార్థి పాఠశాల భవనంపై నుండి దూకడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ సమయంలో ఉపాధ్యాయురాలికి సైతం చేయి విరిగింది. వెంటనే ఆ విద్యార్థిని, ఉపాధ్యాయురాలిని ఆసుపత్రికి తీసుకువెళ్లాము. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాము. భవనంపై నుండి దూకిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడు.