బీర్పూర్ లో దొంగల బీభత్సం
బీర్పూర్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున వ్యాపారి కాసం ఈశ్వరయ్య దంపతులను తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి గుర్తు తెలియని వ్యక్తులు పది తులాల బంగారు ఆభరణాలు, పదివేల రూపాయలు దోచుకున్నారు.
దిశ,బీర్ పూర్ : బీర్పూర్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున వ్యాపారి కాసం ఈశ్వరయ్య దంపతులను తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి గుర్తు తెలియని వ్యక్తులు పది తులాల బంగారు ఆభరణాలు, పదివేల రూపాయలు దోచుకున్నారు. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో గ్రామ నడిబొడ్డున ఉన్న వ్యాపారి ఇంటి ప్రహరీ గోడ లోపల గల బాత్రూంలో నలుగురు మాస్కులు ధరించిన వ్యక్తులు మాటు వేసి తెల్లవారుజామున 5 గంటలకు వ్యాపారి తన ఇంటి తలుపులు, గేటు తెరిచి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బాత్రూంకు వెళ్లగా అప్పటికే బాత్రూంలో ఉన్న నలుగురు వ్యాపారిపై దాడి చేసి కొట్టారు.
వ్యాపారి నోరు మూసి ఇంట్లోకి లాక్కెళ్లి అతనిపై స్టీల్ ఆయుధంతో (రివాల్వర్) తరహా ఉన్న దానితో తలపై బాదడంతో రక్తస్రావం జరిగింది. మెడలో ఉన్న గొలుసు, చేతి బ్రాస్లెట్, ఉంగరం లాక్కున్నారు. మరొ గదిలోకి వెళ్లి వ్యాపారి భార్య మెడలో పుస్తెలతాడు, కాలపట్టీలు, కాళ్ల మట్టలు సైతం లాగడానికి ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు చెబితే చావు తప్పదని హెచ్చరించారు. వ్యాపారి ఇంట్లో పని చేయడానికి వచ్చిన పనిమనిషి సేటును పిలవడంతో ఎలాంటి సమాధానం రాకపోవడంతో భయపడి అందరికీ సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న కొందరు ఇంట్లోకి వచ్చేలోగా నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై ధర్మపురి వైపు వెళ్లినట్టు తెలిసింది. వ్యాపారిని కాళ్లు చేతులు కట్టి బాత్రూంలో బంధించడంతో వారు ఆయన్ని విడిపించారు.
ఈ సొత్తు పేదలకు పంచుతాం
దొంగిలించిన సోత్తుతో పారిపోతూ దొంగలు వ్యాపారితో ఈ సొత్తు పేదలకు పంచుతాం నీవు పోలీసులకు చెప్పవద్దు అంటూ మరోసారి హెచ్చరిస్తూ వ్యాపారిని బెదిరించినట్టు సమాచారం. నలుగురు వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఉన్నట్టు సమాచారం. సమాచారం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి గుట్ట కింది గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.