జూబ్లీహిల్స్ ఘటనకు రాజకీయ రంగు.. TRS ఎమ్మెల్యే పీఏ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మహిళ గొంతుపై బీరు సీసాతో దాడి ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

Update: 2022-09-19 10:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మహిళ గొంతుపై బీరు సీసాతో దాడి ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ సింహా స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన విజయ్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నది బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యే వద్ద నుండి బయటకు వచ్చానని టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. ఇలాంటి సమయంలో తనపై బాబా ఫసియుద్దీన్ తప్పుడు ఆరోపణలు చేయిస్తుండడం దారుణం అన్నారు. ఈ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఒకవేళ తన తప్పు తేలితే జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమని అదే తన తప్పులేదని తేలితే ఫసియుద్దీన్ రాజీనామాకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరును బద్నాం చేయడం సరికాదన్నారు. దర్యాప్తుకు సహకరిస్తానన్నారు. ఫసీయుద్దీన్ వద్ద తాను గతంలో ఉన్నానని ఆయన మోసాలు తెలిసినప్పటి నుండి అతనికి దూరంగా ఉంటున్నానన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న తనను ఇరికించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిజాలేంటో విచారణ ద్వారా నిగ్గు తేల్చాలని అన్నారు.

ఈ ఆరోపణల వెనుక టీఆర్ఎస్ వర్గ పోరు?:

ఈ కేసులో ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే గోపీనాథ్‌కు సన్నిహితుడు కావడం చేత ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడం వెనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వర్గపోరే కారణమా అనే చర్చ తెరపైకి వస్తోంది. గత కొంత కాలంగా ఎమ్మెల్యే మాగంటికి కార్పొరేటర్ ఫసియుద్దీన్ వర్గాలకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో మొదటి నుండి ఉన్న తమను ఇతర పార్టీ నుండి వచ్చిన మాగంటి వర్గం అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఫసియుద్దీన్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన ఫసియుద్దీన్ గత ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవిని ఆశించారని అయితే తన నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి పదవులు వద్దని ఫసియుద్దీన్‌కు మాగంటి చెక్ పెట్టారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ కారణంగా ఇరు వర్గాల మధ్య గ్యాప్ నానాటికి పెరిగిపోతోందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మాగంటి గోపీనాథ్ దగ్గరి వ్యక్తిగా చెప్పబడుతున్న విజయ్ సింహా మహిళ గొంతును కోశాడని ఆరోపణలు రాగా ఇదంతా తప్పుడు ప్రచారమేనని దీనివెనుక ఫసియుద్దీన్ ఉన్నాడని విజయ్ ఖండించడం చూస్తుంటే టీఆర్ఎస్ వర్గ పోరే ఈ కేసులో కీలకంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News