పెళ్లి విషయంలో అక్కాచెల్లెళ్ల కఠిన నిర్ణయం.. ఒకరి ప్రాణం బలి..
ఎదిగి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయాలని చూస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎదిగి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయాలని చూస్తారు. ఆ క్రమంలోనే ఆడపిల్లకు పెళ్లి చేయాలని సంబంధాలు చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే తమకు ఇష్టం లేని వివాహం చేస్తారేమో అని భయపడిన అక్కాచెల్లెళ్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. డ్రింక్‌లో గుళికలు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నంలోని ఓజిలి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముమ్మడి సుబ్బయ్య, కస్తూరమ్మకు ఇద్దరు కూతుర్లు. వారిలో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి పంపగా.. చిన్న కూతురు రజిత నాయుడు పేటలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ వలంటరీగా పని చేస్తుంది. కాగా.. అదే గ్రామంలో నివాసం ఉంటున్న బుట్టా సురేష్, వీరమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు నీరజ బీటెక్ చదివి ఇంటి వద్ద ఉంటుంది. అయితే.. రజిత, నీరజ ఇద్దరు చిన్నమ్మ, పెద్దమ్మ బిడ్డలు. ఇక, వీరికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబసభ్యులు వారికి పెళ్లిసంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అక్కాచెల్లెళ్లు ఇద్దరు వారికి ఇష్టం లేని పెళ్లి చేస్తారేమో అని భయపడి కఠిన నిర్ణయం తీసుకున్నారు.
స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటామని చెప్పి ఇంటి నుంచి స్వర్ణముఖి నది కాజ్ వే వద్దకు వెళ్లారు. వారితో పాటు కూల్ డ్రింక్ అలాగే గుళికలు తీసుకెళ్లారు. అనంతరం ఆ విషపు గుళికలు తాగి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆందోళన చెందిన ఇరుకుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఆసుపత్రికి తరలించారు. వీరిలో రజిత మృతి చెందగా.. నీరజ చికిత్స పొందుతుంది. రజిని మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. పెళ్లి ఇష్టం లేదని మాకు చెప్పుంటే ఇంత దూరం వచ్చేదా అంటూ ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.