ఫోన్ మాట్లాడి నర్స్ ఆత్మహత్య ... ఆసుపత్రిలో వేధింపులే కారణమా...?
నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల మనోరమ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే గౌతమి(21) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
సిబ్బంది వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ
దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల మనోరమ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే గౌతమి(21) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం విధులకు హాజరైన గౌతమి మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామంలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో ఫోన్ మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చింది.
దీంతో ఆసుపత్రి వైద్యుడు గౌతమి తల్లికి ఫోన్ చేసి మీ కూతురు ఇంట్లో ఉరేసుకుంటుందని కాపాడాలని తెలిపారు. వారు వెళ్లే సరికి గౌతమి అప్పటికే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గౌతమి మనోరమ ఆసుపత్రిలో పని చేస్తూ ఇంటి అవసరాల నిమిత్తం రూ.80 వేల అప్పు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి నెలా గౌతమి వేతనం నుంచి రూ.5 వేలు కట్ చేసి మిగిలిన వేతనం ఇస్తున్నారని తెలిపారు. గౌతమిని ఆసుపత్రిలో నిర్వాహకులు, వైద్యులు వేధింపులకు గురి చేశారని తల్లి లక్ష్మీ ఆరోపించింది.
గౌతమి ఆత్మహత్య కారకులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శనివారం ఉదయం ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. తీసుకున్న అప్పు విషయంలో వేధింపులకు గురి చేశారని ప్రైవేట్ వ్యక్తులను ఇంటికి పంపిస్తామని భయబ్రాంతులకు గురిచేశారంటూ బాధితురాలి తల్లి ఆరోపించారు. గత కొన్ని రోజులుగా గౌతమికి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. తాము, శుక్రవారం గౌతమి విధుల్లోకి వెళ్లొద్దని చెప్పినా.. వెళ్లిందని అక్కడ ఏం జరిగిందో తెలియదని.. ఇంటికి రాగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.
గౌతమి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమండ్ చేశారు. మోపాల్ పోలీసులకు కేసు విషయమై వివరణ కోరగా.. గౌతమి ఆత్మహత్య విషయం తెలిసిందని అక్కడికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎప్సై మహేష్ తెలిపారు. ఆసుపత్రి వైద్యుడు డా.చంద్రశేఖర్ వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తల్లి లక్ష్మి తెలిపారు.