నాగర్ కర్నూల్ జిల్లాలో డిఆర్ఐ అధికారుల దాడులు.. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో బుధవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్/బిజినపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో బుధవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ కోళ్ల ఫారంలో భారీ ఎత్తున ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులకు గాని, అధికారులకు గాని సమాచారం లేకుండా నేరుగా డిఆర్ఐ అధికారులు రహస్యంగా దాడులు నిర్వహించారు. ఓ కోళ్ల ఫారంలో ప్రమాదకరమైన ఆల్పాజోలంను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. బావాజీ పల్లి గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆల్ఫాజోలంను, అలాగే దానిని తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మెడిసిన్, కల్తీ కల్లు తయారీ కోసం ఈ మాదకద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. గత కొంతకాలం కోళ్ల ఫారం కేంద్రంగా ఎవరికి అనుమానం రాకుండా ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నట్లు అందిన సమాచారంతోనే అధికారులు నేరుగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మాదకద్రవ్యాన్ని కల్తీకల్లు కోసం తయారు చేస్తున్నారా లేక ఫార్మా కంపెనీలలో మెడిసిన్ కోసం తయారు చేస్తున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. హనుమంత్ రెడ్డి మాదకద్రవ్యాల తయారీ విషయంలో గతంలో ఒకసారి అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది.