18 నెలల కింద అంత్యక్రియలు.. ప్రాణాలతో తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కంగుతిన్న తల్లిదండ్రులు

కనిపించకుండపోయిన తమ కూతురు శవమై మర్చరీలో కనిపించడంతో ఆమెకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Update: 2025-03-22 08:11 GMT
18 నెలల కింద అంత్యక్రియలు.. ప్రాణాలతో తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కంగుతిన్న తల్లిదండ్రులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కనిపించకుండపోయిన తమ కూతురు శవమై మర్చరీలో కనిపించడంతో ఆమెకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ 18 నెలల కింద చనిపోయిన యువతి ప్రాణాలతో తిరిగొచ్చి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని మండ్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లలితా బాయి అనే యువతి 18 నెలల కింద కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు.

అయితే కొద్ది రోజులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం ఉండటంతో పోలీసులు లలితా బాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొని ఆస్పత్రిలో ఉన్న యువతి చేతికి ఉన్న పచ్చబొట్టు తన కూతురు చెతి మీద ఉన్న పచ్చబొట్టు లాగా ఉండటంతో.. ఆ మృత దేహా తమ కూతురిదే అని భావించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి.. యువతి హత్యకి గురైందని నిర్ధారించి.. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. కాగా నిందితులుగా ఉన్న వారు.. 18 నెలలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం.. లలితా బాయి సడెన్ గా తన ఇంటికి వచ్చింది. ఆమెను ప్రాణాలతో చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ కూతురు ప్రణాలతోనే ఉందని ఆనందంలో మునిగి పోయారు. కాగా చనిపోయిందనుకున్న యువతి ప్రాణాలతో తిరిగి వచ్చిందని సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని లలితా బాయిని ప్రశ్నించారు. అయితే తనకు తెలిసిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి.. మోసం చేసి రూ.5 లక్షలకు అమ్మేశాడని, ఇన్ని రోజులు అక్కడే తాను బందీగా ఉన్నానని, అవకాశం దొరకడంతో వారి చెర నుంచి పారిపోయి వచ్చానని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనతో జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. అమాయక యువకులు హత్య కేసులో అరెస్టు చేయడమే కాకుండా.. 18 నెలలుగా శిక్ష అనుభవించెలా చేశారని పోలీసులు తీరుపై మండిపడుతున్నారు.


Similar News