వివేకా హత్యకేసులో కీలక మలుపు.. ఏ 8 నిందితుడిగా MP Avinash Reddy
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా చేర్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్‌లో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఏ8 అని సీబీఐ పేర్కొంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్నారు. కానీ సీబీఐ ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు. కానీ తాజాగా ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొనడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు వైఎస్ వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాశ్, భాస్కర్‌రెడ్డిల ప్రమేయం ఉందని సీబీఐ ఈ కౌంటర్‌లో ఆరోపించింది.
వివేకా హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డి బయట ఉంటే కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందని.. అంతేకాకుండా ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సైతం ప్రలోభపెట్టినట్టు ప్రయత్నాలు కూడా గతంలో జరిగాయని.. ఇప్పుడు మరింత జరిగే అవకాశం ఉందని సీబీఐ కౌంటర్‌లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను ఆమె సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా వాదనలు వినిపించనున్నారు.
ఇందుకు సంబంధించి కేసు డైరీ వివరాలను వెకేషన్ బెంచ్‌కు న్యాయవాది లూధ్రా అందజేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ పేర్కొన్నట్లుగా ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర కీలకమని సునీతారెడ్డి పిటిషన్‌లో ఆరోపించారు.అవినాశ్ రెడ్డిపై సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్లు, అఫిడవిట్లన్నీ తీవ్ర స్వభావాన్ని కలిగి ఉన్నాయని.. అయితే వాటిని తెలంగాణ కోర్టు పట్టించుకోలేదని ఆరోపించారు. వివేకా హత్య కేసు విచారణను జూన్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన నేపథ్యంలో విచారణ ప్రక్రియ సజావుగా సాగాలంటే ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని వైఎస్ సునీతారెడ్డి కోరిన సంగతి తెలిసిందే.
See More...