
నర్సింగ్ రావుకు ఓ గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘హలో.. నర్సింగ్ రావు.. గుర్తు పట్టారా? నేను మీ బంధువు సత్యనారాయణ ఫ్రెండ్‌ని..’ అన్నాడు. ‘నేను గుర్తు పట్టలేదు. ఇంతకు మీరెవరు?’ అని నర్సింగ్ రావు ప్రశ్నించాడు. ‘మీరు లైన్‌లో ఉండండి మీకు సత్యనారాయణ నుంచి ఫోన్ వస్తుంది దానిని మెర్జ్ చేయండి. ముగ్గురం కలిసి మాట్లాడుకోవచ్చు’ అని చెప్పాడు గుర్తు తెలియని వ్యక్తి. ఇంతలో ఓ నంబరు నుంచి నిజంగానే ఫోన్ కాల్ వచ్చింది.. నర్సింగ్ రావు దానిని మెర్జ్ చేశాడు. వెంటనే ఓటీపీ నంబరు చెబుతున్న వాయిస్ వినిపించింది. ఇదేదో కాల్ మిస్ కనెక్ట్ అయ్యి ఉంటుందని నర్సింగ్ రావు భావించి.. హలో హలో అనేసరికి ఫోన్ కట్ అయ్యింది. ఆ తర్వాత తన ఫోన్‌కు క్రెడిట్ కార్డుకు సంబంధించిన లావాదేవిల మెసేజ్‌లు వరుసగా వచ్చాయి. ఓటీపీ చెప్పకుండానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు ఎలా కట్ అయ్యాయని నర్సింగ్ రావు అయోమయ్యానికి గురైయ్యాడు. బ్యాంక్ అధికారులు, సైబర్ నిపుణులు, పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాడు. - దిశ, సిటీక్రైం
సైబర్ నేరగాళ్లు సరికొత్త నేర ప్రక్రియను తెరపైకి తెచ్చారు. దీనిని కాల్ మెర్జ్ స్కామ్ అంటున్నారు. ఒక్క నిమిషం మాటల్లో పెట్టి దోచుకుంటున్న ఈ కాల్ మెర్జ్ స్కాంలో ఓటీపీలు మనం చెప్పకుండానే వారు వినేసి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారని వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు వివిధ బ్యాంక్ ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలను సేకరించుకుంటారు. ఫోన్ నంబర్ ల డాటాను కూడా కొనుగొలు చేస్తారు. ఆ ఫోన్ నంబర్లతో లింక్ ఉన్న సోషల్ మీడియా ఖాతాలను వెతుక్కుంటారు. సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్టును పూర్తిగా జల్లెడపట్టి ఒక ఫోన్ నంబర్ గురిపెడతారు. ఆ ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి హాయ్.. ఈ నంబర్‌ను మీ ఫ్రెండ్ లేదా, బంధువు ఇచ్చాడని మాటలు కలుపుతారు. మీరు ఎవరో తెలియదని సమాధానం రాగానే.. ఇదిగో మీ ఫ్రెండ్ ని కాన్ఫరెన్స్ కాల్ తీసుకుందామని ఫోన్ చేయించి.. దానిని మెర్జ్ చేయండి అని చెబుతాడు.
అంతకు ముందుగా ఆన్ లైన్ షాపింగ్ సైట్‌లో మన కార్డు వివరాలతో అన్ని ఎంట్రీ చేసి లాగిన్ అవుతాడు. అప్పుడు కార్డుకు సంబంధించిన బ్యాంక్ ఐవీఆర్ సిస్టమ్ గాని, ఇతర క్రమంలో ఓటీపీ పంపిస్తుంది. అయితే ఓటీపీ ఫోన్‌కు వస్తుంది కాబట్టీ దానిని చూడకుండా ఫోన్ కాల్ లో మాట్లాడిస్తుంటాడు. నిమిషం తర్వాత ఓటీపీ ని ఫోన్ కాల్ ద్వారా తెలిపే ఆప్షన్ ను ఎంచుకుంటాడు. అప్పుడు లైన్ లో ఉండి ఇదిగో మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. దానిని మెర్జ్ చేయండని చెప్పుతాడు. అలా మెర్జ్ చేయగానే బ్యాంక్ నుంచి వచ్చే ఫోన్ కాల్ నేరుగా మీ నాలుగు అంకెల ఓటీపీ నంబరును చెప్పుతుంది. దానిని విని సైబర్ మాయగాడు ఓటీపీని ఎంట్రీ చేసి మీ కార్డుతోనే షాపింగ్ చేసి మీ కార్డును లేదా ఖాతాను ఖాళీ చేస్తాడు. వెంటనే కాల్ డిస్ కనెక్ట్ చేస్తాడు. సైబర్ మోసగాళ్లు ఈ ఫోన్ కాల్స్ అన్నింటిని వర్చూవల్ ఫోన్ నంబర్లతో చేయడం వల్ల వాటిని కనుగొనడం అంత సులభం కాదు. ఇలాంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే లోపే లక్షలాది మందిని కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారని సైబర్ నేరాల నియంత్రణ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కాల్స్ ను మెర్జ్ చేయొద్దు
గుర్తు తెలియని వారి నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తే వాటిని కట్ చేయండి. మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఆ కాల్ కాన్ఫరెన్స్ కాల్ లో తీసుకోండి అంటే అది సైబర్ చీటర్ కాల్ గా గుర్తించాలి. ఒక వేళ కాన్ఫరెన్స్ కాల్ లోకి తీసుకోవాలనుకుంటే ముందుగా గుర్తుతెలియన వ్యక్తి కాల్ ను హోల్డ్ లో పెట్టాలి. అప్పుడు మీరు మెర్జ్ చేసినా అవతలి వ్యక్తికి మీ ఫోన్ సంభాషణలు వినపడవు. కాన్షరెన్స్ కాల్ లో మెర్జ్ చేయమంటే దానిని కట్ చేసి వచ్చిన కాల్ ను మాట్లాడండి.
- విశ్వనాథ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు
READ MORE ...
వారానికోసారైనా స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్! ఎన్ని లాభాలో తెలుసా..?