విదేశీ కరెన్సీ నోట్లతో బురిడీ కొట్టించిన బంగ్లాదేశ్ రోహింగ్యాల రిమాండ్..
ఈ నెల 5వ తేదీన జడ్చర్ల పట్టణంలో మహబూబ్ నగర్ కు చెందిన యస్మిన్ సిరాజుద్దీన్ లకు తమ వద్ద దుబాయ్ కరెన్సీ నోట్లు ఉన్నాయని నమ్మించి, వారిని జడ్చర్లకు రప్పించి వారికి దుబాయ్ నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చి ఐదు లక్షల ఇండియన్ కరెన్సీ ని తీసుకొని బురిడి కొట్టించి పరారైన బంగ్లాదేశ్ కు చెందిన రోహింగ్యా రషీద్ ఖాన్, మహమ్మద్ సోహెల్ ఇద్దరు రోహింగ్యాలను హర్యానాకు చెందిన రహీం ఖాన్ లను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు జడ్చర్ల టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు.
దిశ, జడ్చర్ల: ఈ నెల 5వ తేదీన జడ్చర్ల పట్టణంలో మహబూబ్ నగర్ కు చెందిన యస్మిన్ సిరాజుద్దీన్ లకు తమ వద్ద దుబాయ్ కరెన్సీ నోట్లు ఉన్నాయని నమ్మించి, వారిని జడ్చర్లకు రప్పించి వారికి దుబాయ్ నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చి ఐదు లక్షల ఇండియన్ కరెన్సీ ని తీసుకొని బురిడి కొట్టించి పరారైన బంగ్లాదేశ్ కు చెందిన రోహింగ్యా రషీద్ ఖాన్, మహమ్మద్ సోహెల్ ఇద్దరు రోహింగ్యాలను హర్యానాకు చెందిన రహీం ఖాన్ లను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు జడ్చర్ల టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు ఖాదర్ లెనిన్ వెంకటేశ్వర్లు తో కలిసి సీఐ రమేష్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మహబూబ్ నగర్ కు చెందిన యాస్మిన్ ఆమె భర్త సిరాజుద్దీన్ లకు మహబూబ్ నగర్ లోని వీరన్నపేటలో కంటి అద్దాల షాపు ఉందని, వారి వద్దకు నిందితులు తమ కంటి అద్దాల చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినట్లు వెళ్లి వారితో మాట కలిపి, తమ వద్ద దుబాయ్ కు చెందిన కరెన్సీ ధీరమ్ ఉన్నాయని మీ వద్ద నడుస్తుందా అని అడగడంతో వీరన్న పేటకు చెందిన బాధితులు ఇదివరకే దుబాయ్ లో ఉండి వచ్చిన వారు కావడంతో నడుస్తుంది అని తెలిపారు. నిందితులు తమ వద్ద పదివేల నోట్లు దుబాయ్ కరెన్సీ ఉన్నాయని దీని విలువ ఇండియన్ కరెన్సీలో 25 లక్షల విలువ ఉంటుందని దాన్ని మార్పిడి చేసి ఇవ్వాలన్నారు.
ఇద్దరి మధ్యలో రూ. 10 లక్షల బేరం కుదుర్చుకొని ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో జడ్చర్ల పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వీరన్నపేటకు చెందిన యాస్మిన్ సిరాజుద్దీన్ ముందస్తుగా తమ వద్ద తెచ్చుకున్న ఐదు లక్షల ఇండియన్ కరెన్సీని నిందితులకు ఇచ్చారు. వారు దుబాయ్ కరెన్సీ రూపంలో తెచ్చిన పేపర్ బెండలను ఓ బ్యాగులో పెట్టి వారికి అప్పగించి నిమిషాల వ్యవధిలో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు బ్యాగు తెరిచి చూసేవరకు బ్యాగులో కాగితాల బెండలు ఉండడంతో తాము మోసపోయామని గమనించి జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. శనివారం జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న రషీద్ ఖాన్, సోహెల్, ఇమ్రాన్ ఖాన్ లను చెక్ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగులో పేపర్ చుట్టి ఉన్న దుబాయ్ కరెన్సీ 2,100 దొరికాయని దాని విలువ ఇండియన్ కరెన్సీలో 48 వేల రూపాయలు ఉంటుందన్నారు.
ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మంది గ్యాంగ్ ఉందని అందులో మహిళా కూడా ఉందని, ఆమె పరారీలో ఉందని నిందితులు రిపున్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్, ముస్తఫా, షోహగ్, మౌల అస్మ పరారీలో ఉన్నారని, ఈ కేసు పది రోజుల ముందు నారాయణపేట లో కూడా చేశారని హన్వాడ లో ఉంటూ నారాయణపేట లో ఒకరి వద్ద మూడు లక్షల రూపాయలు తీసుకొని ఉడాయించారని అన్నారు. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేశామని వీరంతా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబడ్డ రోహింగ్యాలని పశ్చిమబెంగాల్ కోల్ కత్తా ఢిల్లీలో నివాసం ఉంటారన్నారు. త్వరలోనే మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్పనంగా వచ్చే డబ్బులకు ఆశపడి మోసపోకూడదని సీఐ సూచించారు.