ఇంక్రిమెంట్ తక్కువ ఇచ్చారనే మనస్తాపంతో పరిశ్రమ ఉద్యోగి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి
దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలో షేక్ సయ్యద్ (50) అనే వలస కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...షేక్ సయ్యద్ పొట్ట చేత పట్టుకొని గత ఇరవై సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పసునూర్ నుంచి చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామానికి వలస వచ్చారు. అదే గ్రామంలో ఒక గదిని అద్దెకు తీసుకుని భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం లోని వర్ష బయోటిక్ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనికి కుదిరాడు. గత మార్చిలో కంపెనీ యాజమాన్యం కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఇంక్రిమెంటు మంజూరు చేశారు. సయ్యద్ కు ఇతర గత 20 ఏళ్లుగా ఇదే పరిశ్రమలో నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ తోటి కార్మికుల కంటే తక్కువ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో సయ్యద్ ఇదేంటని పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే...'
మేము మీకు ఇచ్చేది ఇంతే..మీకు ఇష్టం ఉంటే పని చేయండి లేదంటే వెళ్లిపోండి'. అంటూ సమాధానం చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన సయ్యద్.. ఈ విషయాన్ని తన భార్య షేక్ జాన్ భీ తో చెప్పుకొని బాధపడ్డాడు. రోజూ లాగే సయ్యద్ ఈ నెల 4న ఉదయం డ్యూటీ కి వెళ్లి అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి మన సొంతూరుకు వెళ్ళిపోదామని చెప్పి ఇంట్లోని వస్తువులన్నీ సర్ధాలంటూ భార్యను పురమాయించాడు. ఇంట్లోని వస్తువులన్నీ మూటకట్టిన తర్వాత పొద్దున్నే లేచి సొంతూరుకు వెళ్ళిపోదామని చెప్పి రాత్రి 10 గంటల సమయంలో అందరూ నిద్రకు ఉపక్రమించారు.
కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలోకి జారుకోగానే సయ్యద్ అదే రాత్రి సుమారు 11 గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం సయ్యద్ తన గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో భార్య, పిల్లలకు అనుమానం వచ్చి అతను నిద్రిస్తున్న గదికి వెళ్లి తలుపు తట్టారు. గదిలోంచి సయ్యద్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గది తలుపులు తెరిచి చూడగా సయ్యద్ సీలింగ్ ఫ్యానుకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. వర్ష బయోటిక్ యాజమాన్యం..కంపెనీ ఉద్యోగి శేఖర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటూ మృతుని భార్య షేక్ జాన్ భీ చౌటుప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.