రాత్రి కలిసి పడుకున్న దంపతులు.. తెల్లారేసరికి భర్త దారుణ హత్య!
కట్టుకున్న భర్తను గొడ్డలితో హతమార్చిందో భార్య. అర్థరాత్రి ఇంట్లోనే కలిసి పడుతున్న భార్యభర్తలు.. తెల్లారేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
దిశ, నాగర్ కర్నూల్/తెల్కపల్లి : కట్టుకున్న భర్తను గొడ్డలితో హతమార్చిందో భార్య. అర్థరాత్రి ఇంట్లోనే కలిసి పడుతున్న భార్యభర్తలు.. తెల్లారేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. భర్త హత్యకు గురికావడం, భార్య ఇంట్లో లేకపోవడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గ్రామస్తుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(50) ఎల్లమ్మ భార్యభర్తలు. ఊర్లోనే కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దంపతుల ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రోజు మాదిరిగానే భోజనం చేసి పడుకున్నాడు ఈశ్వరయ్య. అయితే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఇంటి తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూశారు. రక్తపు మడుగులో పడున్న ఈశ్వరయ్యను చూసి అక్కడ ఉన్నవాళ్లు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే అర్ధరాత్రి రెండు, మూడు గంటల సమయంలో తన భర్త ఈశ్వరయ్యను గొడ్డలితో నరికి హత్య చేసినట్టు గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారీ అయినట్టు భావిస్తున్నారు. గ్రామస్తుల ద్వారా వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు హత్యకు పాల్పడింది భార్యయేనా..? మరి ఎవరైనా చంపి ఉంటారా..? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.