ఆర్మీ జవాన్ కు అశ్రునివాళి…శోకసంద్రమైన డోర్నకల్
గత 11 ఏండ్లుగా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ రక్షణలో నిమగ్నమైన కొదిరిపాక సతీష్ (34) గుండెపోటు గురై బుధవారం పశ్చిమ బెంగాల్ బాగ్ డోగ్రా ఆర్మీ ఆసుపత్రిలో మృతి చెందాడు.
దిశ, డోర్నకల్: గత 11 ఏండ్లుగా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ రక్షణలో నిమగ్నమైన కొదిరిపాక సతీష్ (34) గుండెపోటు గురై బుధవారం పశ్చిమ బెంగాల్ బాగ్ డోగ్రా ఆర్మీ ఆసుపత్రిలో మృతి చెందాడు. శనివారం డోర్నకల్ లో ఆయన స్వగృహానికి ఆర్మీ అధికారులు భౌతికకాయాన్ని మోసుకొచ్చి ఇంటి ముందు వేదికపై ఉంచగా తల్లి ఎల్లాబాయి, సోదరుడు వెంకటేష్, భార్య లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య ఇంటి నుంచి అంతిమయాత్రగా వెళ్లి స్మశాన వాటికలో ఆర్మీ అధికారి సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు జాతీయ జెండాలు చేతబుని పుష్ప వర్షం కురిపించి, కన్నీటి నివాళులర్పించారు. అమరుడా సతీష్ మళ్లీ పుడతావా అంటూ దుఃఖించారు. నేలరాలిన పువ్వా.. నువు మళ్లీ పుయలేవా.. ఏ దారిన వస్తావో సతీష్.. పాటలతో బరువెక్కిన హృదయాలతో చెమర్చిన కళ్ళతో వీడ్కోలు పలికారు. అశేష జనవాహిని నడుమ అంతిమయాత్ర ముగిసింది.