సైబర్ మోసానికి విఫలయత్నం
డ్రగ్ డీలింగ్ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నావని భయభ్రాంతులకు గురి చేసి ఓ వ్యక్తి నుంచి నగదు కాజేసేందుకు కేటుగాళ్లు విఫలయత్నం చేశారు.
దిశ, అశ్వారావుపేట : డ్రగ్ డీలింగ్ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నావని భయభ్రాంతులకు గురి చేసి ఓ వ్యక్తి నుంచి నగదు కాజేసేందుకు కేటుగాళ్లు విఫలయత్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నల్లబాడు గ్రామానికి చెందిన ఈపుగంటి వీరబాబుకి శుక్రవారం గుర్తుతెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. నీ ఆధార్, పాన్ కార్డుల నెంబర్ల ద్వారా రూ. 25 లక్షల నగదు లావాదేవీలు జరిగాయని, అవి డ్రగ్ డీలింగ్ మనీలాండరింగ్ పరిధిలోకి రావడంతో ముంబైలో కేసు నమోదైందని, అందుకు అరెస్టు వారెంట్ కూడా వచ్చిందని చెప్పారు. ముంబై హైకోర్టు నుండి జారీ అయిన అరెస్టు వారెంట్ కాపీని పంపారు. ఇది చూసిన ఈపుగంటి వీరబాబు ఖంగు తిన్నాడు.
రూ. 6 వేల 2 వందలు ఫోన్ పే ద్వారా చెల్లిస్తే కేసు మాఫీ చేస్తామని నమ్మ బలికారు. తన అకౌంట్ లో నగదు లేకపోవడంతో కొంత సమయం కావాలని అడిగాడు. అనుమానం వచ్చిన ఈపుగంటి వీరబాబు తనకు తెలిసిన వారిద్వారా ఫోన్ మాట్లాడించాడు. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పి ఫోన్ పెట్టేశారు. తిరిగి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా తప్పించుకున్నారు. అయితే మూడు రోజుల ముందు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముద్ర లోన్ ఇస్తామని చెప్పడంతో.. ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు చెప్పానని, అందువల్లే తన ఆధార్ పాన్ వివరాలను చెప్తూ ఈ విధంగా మోసానికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లుగా బాధితుడు గుర్తించాడు.