పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్న విద్యుత్ లైన్‌మేన్
హెల్మెట్ లేదని పోలీసులు వేసిన చలానాకు ఓ విద్యుత్ లైన్ మేన్ హర్టయ్యాడు. దీంతో మొత్తం పోలీస్ స్టేషన్ కు కరెంట్ రాకుండా చేశాడు.
దిశ, వెబ్ డెస్క్: హెల్మెట్ లేదని పోలీసులు వేసిన చలానాకు ఓ విద్యుత్ లైన్ మేన్ కోపాన్ని పెంచుకున్నాడు. దీంతో మొత్తం పోలీస్ స్టేషన్ కు కరెంట్ రాకుండా చేశాడు. అయితే విషయం పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని ధీర్ఖెడా ప్రాంతానికి చెందిన ఖలీద్ విద్యుత్ శాఖలో లైన్ మేన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే హెల్మెట్ లేకుండా బైక్ మీద హాపూర్ కు వచ్చిన ఖలీద్ కు పోలీసులు రూ.1000 చలానా విధించారు. అయితే తాను ఎలక్ట్రిక్ డిపార్ట్ మెంట్ కు చెందినవాడినని, తనకు ట్రాఫిక్ చలానా ఏందని వారిపై అతడు ఎదురు తిరిగాడు. అయితే ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు అతడితో రూ.1000 జరిమానా కట్టించారు.
ఇది మనసులో పెట్టుకున్న ఆ లైన్ మేన్ పోలీసులపై కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లే విద్యుత్ లైన్ ను కట్ చేశాడు. ఇక కరెంట్ లేకపోవడంతో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందిపడ్డారు. అయితే సదరు లైన్ మేన్ కరెంట్ స్తంభం ఎక్కి పోలీస్ లైన్ ను కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆ లైన్ మేన్ ను అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.