ఐదు దశల్లో వ్యాక్సి'నేషన్'
న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ కోసం సామూహిక వ్యాక్సినేషన్‌కు చర్యలు ఊపందుకున్నాయి. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇవ్వడమే తరువాయి. వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొత్తం ఐదు దశల్లో టీకాల కార్యక్రమం చేపట్టనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికను రూపొందించాయి. తొలుత ఎవరికి […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ కోసం సామూహిక వ్యాక్సినేషన్‌కు చర్యలు ఊపందుకున్నాయి. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇవ్వడమే తరువాయి. వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొత్తం ఐదు దశల్లో టీకాల కార్యక్రమం చేపట్టనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికను రూపొందించాయి.
తొలుత ఎవరికి ఇస్తారు?
1. ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కార్యకర్తలు
నేషనల్ ఎక్సపర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19 సిఫారసుల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోని కోటి మంది హెల్త్ వర్కర్లకు మొదట వ్యాక్సిన్ ఇస్తారు. ఈ హెల్త్ కేర్ వర్కర్లను ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్) కార్యకర్తలు, నర్సులు, సూపర్‌వైజర్లు, మెడికల్ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది, సహాయక సిబ్బంది, వైద్య విద్యార్థులు అనే సబ్ కేటగిరీలుగా విభజిస్తారు. వీరి సమాచారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల ద్వారా సేకరించి వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు.
2. ఫ్రంట్‌లైన్, మున్సిపల్ కార్మికులు
ఆరోగ్య కార్యకర్తల తర్వాత 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్, మున్సిపల్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, భద్రతా దళాలు, హోంగార్డులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, జైలు సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, కొవిడ్-19 నియంత్రణ కోసం పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందికి టీకాలు ఇస్తారు. రెండో దశలోనే రాష్ట్ర ప్రభుత్వ, రక్షణ, హోం, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సిబ్బందికి కూడా టీకాలు ఇవ్వనున్నారు.
3. 50ఏండ్ల పైబడిన వారికి
మూడో దశలో వయోవృద్ధులకు టీకాలు ఇస్తారు. వీరిని 60ఏండ్ల పైబడిన, 50నుంచి 60ఏండ్ల మధ్య వయస్సుగల వారీగా రెండు క్యాటగిరీలుగా విభజిస్తారు. ఇటీవల జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా వీరిని గుర్తించనున్నారు.
4. కొవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న ప్రాంతాలు
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉన్న భౌగోళిక ప్రాంతాల(ఎన్‌ఈజీవీఏసీ నిర్ణయిస్తుంది)ను గుర్తించి టీకాలు ఇస్తారు.
5. మిగతా ప్రజలకు
పైన నాలుగు దశల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగతా ప్రజలకు ఇస్తారు. అయితే, అప్పటికి కరోనా మహమ్మారి తీవ్రత, వ్యాక్సిన్ డోసుల అందుబాటుపై ఆధారపడి ఉంటుంది. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రద్దీని నియంత్రంచడం కోసం దశలవారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నారు.
నమోదు?
వ్యాక్సినేషన్ చివరి దశలో టీకా కోసం స్వీయ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
– మొదట కొవిన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
– ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్, ఓటీపీ ద్వారా నమోదును ధ్రువీకరిస్తారు.
– రిజిస్ట్రేషన్ పూర్తికాగానే వ్యాక్సిన్ ఇచ్చే ప్రాంతం, తేదీలను కేటాయిస్తారు.
– ఎట్టిపరిస్థితుల్లో టీకా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌కు అనుమతించారు. ముందస్తుగా నమోదు చేసుకున్న వారినే టీకా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
– టీకాలు వేసే కేంద్రం, సమయం కేటాయింపు ఇలా కొవిన్‌కు సంబంధించి అన్ని పర్యవేక్షణలు జిల్లా యంత్రాగం చేయాల్సి ఉంటుంది.
ఎక్కడ? ఎలా?
భౌగోళిక పరిస్థితులను అనుసరించి టీకా కేంద్రాలను మూడు రకాలుగా విభజించారు.
1. శాశ్వత కేంద్రాలు
వైద్యాధికారి లేదా వైద్యుడు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తారు. వీటిని శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాలుగా పిలుస్తారు.
2. ఇతర కేంద్రాలు
వైద్య సౌకర్యాలు ఏర్పాటుకు అవకాశం ఉన్న పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రాంతాలు
3. ప్రత్యేక మొబైల్ బృందాలు
రిమోట్ ప్రాంతాలు, వైద్య సిబ్బంది చేరుకోవడానికి అవకాశం లేని ప్రాంతాలు, వలస ప్రజలు నివసించే ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ వ్యాక్సినేషన్‌ను చేపడుతాయి. ఆయా ప్రాంతాలు గుర్తింపు, మొబైల్ టీమ్స్ ఏర్పాటును జిల్లా యంత్రాంగాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియకు అనుసరించే వ్యూహం?
వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం మూడు వేర్వేరు గదులు లేదా స్థలాలు అవసరం.
1. వెయిటింగ్ రూమ్: టీకా ఇచ్చే ముందు ఒక వ్యక్తి వేచి ఉండటం కోసం ఏర్పాటు చేస్తారు.
2. వ్యాక్సినేషన్ గది: ఇందులో టీకాలు ఇస్తారు.
3. అబ్జర్వేషన్ గది: ఈ గదిలో టీకా తీసుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి 30 నిమిషాలు పర్యవేక్షిస్తారు.
వ్యాక్సిన్ ఎవరు ఇస్తారు?
వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఐదుగురు సభ్యుల వ్యాక్సినేషన్ బృందం అందుబాటులో ఉంటుంది.
1. వ్యాక్సినేషన్ ఆఫీసర్ -1: రిజిస్ట్రేషన్ ప్రక్రియ
2. వ్యాక్సినేషన్ ఆఫీసర్ -2: ధ్రవీకరణ
3. వ్యాక్సినేషన్ ఆఫీసర్ -3: వ్యాక్సిన్ ఇన్‌చార్జ్. టీకా ఇంకా ప్రయోగ దశల్లో ఉన్నందను నిపుణులైన వైద్య సిబ్బంది ఇస్తారు.
4. వ్యాక్సినేషన్ ఆఫీసర్ -4: వ్యాక్సిన్ కోసం వచ్చే వారిని నియంత్రించే ఇన్‌చార్జ్.
5. వ్యాక్సినేషన్ ఆఫీసర్ -5: టీకా ఇచ్చిన తర్వాత 30 నిమిషాల పర్యవేక్షుడు