అవినీతి దవాఖానా.. సీఎం ఇలాకాలోనే ఇలా ఉంటే మరి రాష్ట్రం పరిస్థితేంటో..?

దిశ ప్రతినిధి, మెదక్: పేదలకు ప్రభుత్వ వైద్యం భారం కానుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలనే రాష్ట్ర సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రసూతి కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణీ స్త్రీలకు ఉచిత కాన్పు జరగడం లేదు. లంచం ఇవ్వనిదే ఆస్పత్రి నుండి డిశ్చార్జి కాని పరిస్థితి నెలకొంది. ఇంతకి ఇదెక్కడో అనుకుంటున్నారా.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోనే.. దీనికి సంబంధించిన […]

Update: 2021-08-31 23:49 GMT

దిశ ప్రతినిధి, మెదక్: పేదలకు ప్రభుత్వ వైద్యం భారం కానుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలనే రాష్ట్ర సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రసూతి కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణీ స్త్రీలకు ఉచిత కాన్పు జరగడం లేదు. లంచం ఇవ్వనిదే ఆస్పత్రి నుండి డిశ్చార్జి కాని పరిస్థితి నెలకొంది. ఇంతకి ఇదెక్కడో అనుకుంటున్నారా.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోనే.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సీఎం ఇలాకాలో అవినీతి దవాఖానా..

సీఎం ఇలాకాలో అవినీతికి అంతులేకుండా పోతుంది. ముఖ్యంగా పేదలకు ఉచితంగా అందిస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రిలలో లంచాలు ముట్టజెప్పనిదే వైద్యం అందడం లేదు. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పరిధిలో గల గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రిలో లంచాలు తారా స్థాయికి చేరాయి. పైసా ఖర్చులేకుండా బయటకు వెళ్లడం కష్టంగా మారింది. వార్డు క్లీనింగ్ చేసే వారు మొదలు వైద్యుల వరకు ప్రతి ఒక్కరికి డబ్బులు ముట్టజెప్పాలిందే. ప్రతి విభాగానికో రేటు నిర్ణయించుకున్నారు. డెలివరీ చేసినందుకు గాను రూ .2 వేలు, డిశ్చార్జి సమయంలో వార్డు క్లీనింగ్ వారికి రూ.వెయ్యి, కేసీఆర్ కిట్ వారికి రూ. 50, డిశ్చార్జి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టే వారికి రూ.100 ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

వీడియో వైరల్..

గతంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు డబ్బులు డిమాండ్ చేయడంపై ‘దిశ’ పలు కథనాలను ప్రచురించింది. తాజాగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇలాంటి భాగోతమే వెలుగు చూసింది. గజ్వేల్ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది డబ్బులు అడగ్గా, ఆసుపత్రి సిబ్బందికి ఓ వ్యక్తి లంచం ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సీఎం ఇలాకాలోనే ఇంత అవినీతి జరిగితే రాష్ట్రంలో ఇంకెంత అవినీతి పేరుకుపోయిందోనని ముచ్చటించుకుంటున్నారు. మరికొందరు సీఎం ఇలాకాలో అవినీతి బాగా పేరుకుపోయిందని, వీరికి లంచాలు ఇచ్చే డబ్బేదో ప్రైవేట్ హాస్పిటల్ లో పెడితే వైద్యం పూర్తవుతుందని ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎం స్పందించి తక్షణమే డబ్బులు అడిగేవారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై రాష్ట్ర సర్కారు, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News