పేషెంట్ వద్దు.. డబ్బే ముద్దు

దిశ, న్యూస్ బ్యూరో: ‘‘కొడుకా..ఎక్కడున్నవ్…. ఏమైంది నాయినా? చస్తున్నర బిడ్డా.. డైపర్ కూడా మారుస్త లేరు. ఇబ్బందిగా ఉందిరా. కాపాడురా నాయినా..’’ అంటూ ఓ తండ్రి కొడుక్కి ఫోన్ చేశాడు. కొడుకేమో తల్లి అంత్యక్రియల్లో ఉన్నాడు. ఏడుపు దిగమింగుకుంటూనే మాట్లాడాడు. అప్పటికే పెద్దనాన్న, చిన్నమ్మ చనిపోయారు. వారి చికిత్సకు రూ.50 లక్షలకు పైగా బిల్లులు చెల్లించారు. తండ్రికి కూడా రూ.18 లక్షల దాకా వేశారు. డైపర్ మార్చేందుకు కూడా ఆసుపత్రి సిబ్బందికి, యాజమాన్యానికి మనసు రాలేదు. తల్లి […]

Update: 2020-07-29 21:55 GMT

దిశ, న్యూస్ బ్యూరో:

‘‘కొడుకా..ఎక్కడున్నవ్….

ఏమైంది నాయినా? చస్తున్నర బిడ్డా.. డైపర్ కూడా మారుస్త లేరు. ఇబ్బందిగా ఉందిరా. కాపాడురా నాయినా..’’ అంటూ ఓ తండ్రి కొడుక్కి ఫోన్ చేశాడు. కొడుకేమో తల్లి అంత్యక్రియల్లో ఉన్నాడు. ఏడుపు దిగమింగుకుంటూనే మాట్లాడాడు. అప్పటికే పెద్దనాన్న, చిన్నమ్మ చనిపోయారు. వారి చికిత్సకు రూ.50 లక్షలకు పైగా బిల్లులు చెల్లించారు. తండ్రికి కూడా రూ.18 లక్షల దాకా వేశారు. డైపర్ మార్చేందుకు కూడా ఆసుపత్రి సిబ్బందికి, యాజమాన్యానికి మనసు రాలేదు. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యేలోపే ఫోన్ రావడంతో ఏమైందోమోనని కొడుకు బంధువులతో కలిసి బయలుదేరాడు. సోమాజిగూడ నుంచి రాజ్ భవన్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాకమిది. ఈ కుటుంబం నుంచి ఓ న్యాయవాది మృత్యువాత పడ్డాడు. వృత్తి ధక్మంలో భాగంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లినపుడు ఆయనకు కరోనా సోకింది. ఆయన ద్వారా కుటుంబ సభ్యులకు వ్యాపించింది. చికిత్స పొందిన బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రూ.15 లక్షలు చెల్లిస్తే గానీ శవం శ్మశానికి చేరలేదు. అదే కుటుంబంలో ఓ మహిళ కూడా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. బిల్లు రూ.10 లక్షలు దాటింది. ప్రాణాలు దక్కలేదు. ఓ కొడుక్కి కూడా పాజిటివ్.. ఆయనకు కూడా బిల్లు రూ.8 లక్షలు దాటింది. తల్లి అంత్యక్రియలు చేసేందుకు బయటకొచ్చాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం విషాద గాథ ఇది. రూ. లక్షలు పోస్తున్నా కరోనా నుంచి ప్రాణాలు మాత్రం దక్కడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి కంకణం కట్టుకొని కూర్చున్నాయి. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగైన సేవలేం ఇస్తున్నట్లన్న సందేహం కలుగుతోంది.

రోజూ రూ.లక్షల్లో బిల్లు

ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంతేసి బిల్లులు వసూలు చేయాలో ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులిపేసుకున్నది. పీపీఈ కిట్లు, శానిటైజేషన్ పేరిటనే రూ.వేలల్లో రాసేస్తున్నారు. మహేశ్వరానికి చెందిన కుటుండం నాలుగు రోజుల్లోనే ముగ్గురిని కోల్పోయింది, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు బిల్లు చెల్లించే వరకు శవాన్ని కూడా ఇవ్వడం లేదు. డిశ్చార్జీ సమ్మరీ ఇవ్వమంటే ‘ఆఫ్టర్ 10 వర్కింగ్ డేస్’ అంటూ ఇంగ్లీషులో సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు. రోజుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. అంత పెద్ద మొత్తం ఎట్లా అయ్యిందో చెప్పమంటే చెప్పడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల చర్యలపై విచారణ జరపాలని మహేశ్వరం మండలం టీఆర్ ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్క ఇంటి నుంచే రూ.50 లక్షలు వరకు గుంజారని మండిపడ్డారు.

ఖాళీలు ఉన్నా..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు 80 శాతానికి పైగానే ఖాళీగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 23 ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబరేటరీల్లో పరీక్షలు చేస్తున్నారు. అవన్నీ కార్పొరేట్ శక్తులే. 55 ప్రైవేటు హాస్పిటల్స్ లో కరోనాకు చికిత్స ఇస్తున్నాయి. ఇందులోనూ రెగ్యులర్ బెడ్స్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్(వెంటిలేటర్) వంటివి ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లడం శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు. ప్రైవేటు దోపిడికి గురైన తర్వాత ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమే. అందుకే ముందస్తు జాగ్రత్తలతోనే నష్టనివారణ చర్యలు చేపట్టొచ్చు. అన్నింటికి మించి కరోనా వైరస్ రాకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం మంచిది. అందరికీ అన్నింటికీ లాభం.

Tags:    

Similar News