డాక్టర్లలో ‘కరోనా’ గుబులు

దిశ, న్యూస్ బ్యూరో కరోనా ఎల్లలు దాటి ఎల్లెడలా కల్లోలం సృష్టిస్తోంది. అల్లకల్లోలం చేస్తోంది. దానికి సామాన్యులు, అసామాన్యులనే తేడాలేదు. రోగులు, డాక్టర్లనే అంతరంలేదు. వారూ, వీరు అనే వరుసలేదు. అది అంటుకుందంటే అలజడే. గుండెల్లో గుబులే. వైరస్‌పై అందరి కంటే ఎక్కువ అవగాహన కలిగిన డాక్టర్లు కూడా దాని బారిన పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది పంజా విసురుతూనే ఉంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా అది వణికిస్తోంది. తాజాగా […]

Update: 2020-03-29 07:00 GMT

దిశ, న్యూస్ బ్యూరో

కరోనా ఎల్లలు దాటి ఎల్లెడలా కల్లోలం సృష్టిస్తోంది. అల్లకల్లోలం చేస్తోంది. దానికి సామాన్యులు, అసామాన్యులనే తేడాలేదు. రోగులు, డాక్టర్లనే అంతరంలేదు. వారూ, వీరు అనే వరుసలేదు. అది అంటుకుందంటే అలజడే. గుండెల్లో గుబులే. వైరస్‌పై అందరి కంటే ఎక్కువ అవగాహన కలిగిన డాక్టర్లు కూడా దాని బారిన పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది పంజా విసురుతూనే ఉంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా అది వణికిస్తోంది. తాజాగా తెలంగాణలో నలుగురు వైద్య సిబ్బంది శంషాబాద్ విమానాశ్రయంలో పాజిటివ్‌కు గురయ్యారు. ఏ విదేశీ ప్రయాణం చేయకున్నా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోని ఓ డాక్టర్‌కు పాజిటివ్ వచ్చింది. ఆయన ద్వారా భార్యకు, మరొకరికి వైరస్ అంటుంది. ఆ ఆసుపత్రిలోనే ఈ ముగ్గురికీ చికిత్స అందుతోంది. ఇక కేరళ మొదలు ఢిల్లీ వరకు అనేక రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లకు వైద్య చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాజిటివ్ బారిన పడడమో లేక ఇన్‌ఫెక్షన్‌కు గురికావడమో చూస్తున్నాం. గత వారం రోజులుగా అన్ని ఆసుపత్రుల్లో ఓపీ (ఔట్ పేషెంట్ సేవలు) రద్దయ్యాయి. ఎమర్జెన్సీ కేసులు తప్ప మామూలు ఆపరేషన్లు, చికిత్సలు నిలిచిపోయాయి. అయినా సోమాజిగూడ యశోద ఆసుపత్రి డాక్టర్‌కు కరోనా ఎలా సోకిందనేది మిస్టరీగా మారింది.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా డాక్టర్లకు కరోనా వైరస్ సోకుతోంది. గ్లోబల్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సమస్యతో చేరిన ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందితే మరణానంతరం చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అత్యవసర సేవలను మాత్రమే చేస్తున్న ఈ ఆసుపత్రిలోని రోగికి పాజిటివ్ ఎలా వచ్చిందో అంతుచిక్కలేదు. ఆ డాక్టర్‌కు ఇంతకాలం వైద్య చికిత్స చేసిన డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ టీమ్‌ ఇప్పుడు వారివారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకాలం ఒక పాజిటివ్ పేషెంట్‌కు చికిత్స చేశామా అని ఆందోళన పడుతున్నారు. ఆయన పక్కనే పేషెంట్లుగా ఉన్నవారిలోనూ ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వైద్యారోగ్య విభాగంలో మరో నలుగురికి కరోనా లక్షణాలు కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా ప్రభుత్వం నుంచి లేదు. వైద్య సిబ్బందికే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటే ప్రజల్లో మరింత భయాందోళన పెరిగిపోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంలో డాక్టర్లు కాస్త దూరంగానే ఉంటూ జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. వారికి దగ్గరి నుంచి సేవలు చేయాల్సింది నర్సులు, ఆయాలే. దూరంగా ఉంటూ తగిన సూచనలు చేసే డాక్టర్లకే ఇలాంటి లక్షణాలు అంటుకుంటూ ఉంటే పేషెంట్‌కు దగ్గరగా ఉంటూ సేవలందించే తమకు అంటుకునే ప్రమాదం మరింత ఎక్కువేనని నర్సుల్లో ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. అందుకే తగిన వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) లేకుండా చికిత్స చేయలేమంటూ జాతీయ నర్సుల సంఘం నేరుగా ప్రధానికే లేఖ రాసింది. గాంధీ ఆసుపత్రిలోని నర్సులు సైతం సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. ఏ క్షణమైనా కోవిడ్-19 వ్యాధి తమకు సోకే ప్రమాదం ఉందని వారు అనుక్షణం ఆందోళనతోనే పేషెంట్లకు సేవలందిస్తున్నారు. అసలు కరోనా కేసులే లేని ప్రైవేటు ఆసుపత్రిల్లోని నర్సులు ఏకంగా డ్యూటీ మానేస్తున్నారు. మరోవైపు, నర్సులకు ఇంతకాలం అద్దెకు ఇచ్చిన ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎవరికి కరోనా లక్షణాలున్నాయో, ఎవరికి లేవో తెలియని గందరగోళంలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది తమను తాము రక్షించుకోవడంపైనే దృష్టి పెట్టారు.

విదేశీ విమాన సర్వీసులు ఆగిపోయాయి. క్వారంటైన్ కాలం కూడా పూర్తికావస్తోంది. ఇప్పటికే ఎనిమిది వేల మంది క్షేమంగా ఇళ్ళకు వెళ్ళిపోయారు. మరో 11 వేల మంది కూడా వారానికి కొంతమంది చొప్పున ఇళ్ళకు వెళ్ళిపోయే అవకాశముంది. ఇకపై విదేశాల నుంచి ఈ జబ్బు దిగుమతి అయ్యే అవకాశమే లేదు. అయినా ఇప్పుడు రోజుకు తొమ్మిది, పది చొప్పున బైటపడుతున్న పాజిటివ్ కేసుల్లో చాలామందికి విదేశీ ప్రయాణంతోగానీ, ఆ ప్రయాణంచేసి వచ్చినవారితోగానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని వైద్యులే చెప్తున్నారు. దీంతో ఆసుపత్రికి వివిధ అనారోగ్య లక్షణాలతో వచ్చే పేషెంట్లలో కరోనా లక్షణాలేమైనా ఉన్నాయోమోననే సందేహాలు ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లాంటి వైద్య సైన్యం మొత్తం ఇప్పుడు చాలా సేవ చేస్తున్నారని, వారు పనిభారంతో, ఒత్తిడితో ఉంటున్నారని, వారిని పదిలంగా కాపాడుకోవడం మన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారి మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడడం ఇప్పుడు మన తక్షణ కర్తవ్యంగా ఉండాలని అన్నారు. వారే నీరసపడితే, డీలా పడితే ఇంకెవ్వరూ ఏమీ చేయలేరని, ప్రభుత్వం కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదని, అందువల్ల వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. కానీ, ఇప్పుడు ఆ డాక్టర్లు, నర్సులే ఒకింత మానసికాందోళనకు గురవుతున్నారు. వివిధ కారణాలతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లలో ఎంతమంది కరోనా లక్షణాలను వెంట తీసుకుని వస్తున్నారో అనే ఆందోళన డాక్టర్లలో గ్లోబల్ ఆసుపత్రిలో పేషెంట్ మృతి, సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డాక్టర్‌కు పాజిటివ్ అని తేలిన తర్వాత మరింత పెరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడి నుంచి సోకుతుందోననే చర్చ వైద్య వర్గాల్లో మొదలైంది. వీలైనంత వరకు దూరంగా ఉంటూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags: Telangana, doctors, Corona, Positive, Hospitals, Medical Team, nurses

Tags:    

Similar News