80 శాతం కోవిడ్ రికవరీ బాధితుల్లో.. హార్ట్ ప్రాబ్లెమ్స్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 16.7 మిలియన్ల ప్రజలు కరోనా బారినపడ్డారు. ఎంతోమంది ఈ మహమ్మారి నుంచి రికవరీ అవుతున్నా.. ఇతర అనారోగ్యాలున్న వారికి మాత్రం ప్రమాదకారిగా మారింది. నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలతో పాటు బ్రెయిన్‌ను కూడా ఎఫెక్ట్ చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైన విషయమే. అయితే తాజా అధ్యయనం ప్రకారం కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ.. ఆరోగ్యపరంగా చాలా దుష్పరిమాణాలు ఉంటాయని తెలిసింది. అంతేకాదు కొవిడ్ రికవరీ బాధితుల్లో 80శాతం మందికి గుండె సమస్యలు […]
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 16.7 మిలియన్ల ప్రజలు కరోనా బారినపడ్డారు. ఎంతోమంది ఈ మహమ్మారి నుంచి రికవరీ అవుతున్నా.. ఇతర అనారోగ్యాలున్న వారికి మాత్రం ప్రమాదకారిగా మారింది. నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలతో పాటు బ్రెయిన్‌ను కూడా ఎఫెక్ట్ చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైన విషయమే. అయితే తాజా అధ్యయనం ప్రకారం కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ.. ఆరోగ్యపరంగా చాలా దుష్పరిమాణాలు ఉంటాయని తెలిసింది. అంతేకాదు కొవిడ్ రికవరీ బాధితుల్లో 80శాతం మందికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో కొవిడ్ బారినపడ్డ 100 మంది బాధితుల ఎంఆర్ఐ ఫలితాలపై ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జామా)’ బృందం ఓ అధ్యయనం చేసింది. కొవిడ్‌కు ముందు ఎంతో ఆరోగ్యంగా ఉన్న 40-50 ఏళ్ల వయసుకు చెందినవారిపై ఈ అధ్యయనం చేపట్టింది. జర్మనీలోని ఫ్రంక్‌ఫర్ట్‌కు చెందిన వీరంతా కొవిడ్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు. అయితే ఈ 100 మందిలో 67 మంది రోగులకు మితమైన లక్షణాలు ఉండి ఇంట్లోనే కోలుకోగా, మిగిలిన 23 మంది తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు.
గుండెపై కొవిడ్ -19 ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి కరోనా బాధితుల నుంచి ఎంఆర్‌ఐ, బ్లడ్ టెస్ట్స్, హార్ట్ టిష్యూ బయాప్సీలను తీసుకున్నారు. కాగా కోలుకున్న 100 మంది రోగుల్లో 78 మందికి హార్ట్ డ్యామేజ్ ఉన్నట్లుగా గుర్తించారు. కొవిడ్ నుంచి రికవరీ అయినా.. చాలా మంది ప్రజలు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. అయితే కొవిడ్ వల్ల ఇతర అవయవాలు కూడా ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయో ఓ అంచనాకు రాలేకపోతున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుండె అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు తాత్కాలికంగా ఉన్నాయా లేదా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయా? అనే విషయాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.
యూకేకు సంబంధించిన మరో హెల్త్ ఇన్‌స్టిట్యూషన్ కూడా 6 ఖండాలకు సంబంధించిన 1216 మంది కొవిడ్ బాధితులపై అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలోనూ కొవిడ్ బాధితుల్లో హార్ట్ అబ్‌నార్మాలిటీస్ ఉన్నట్లు తేలింది. కార్డియాక్ కాంప్లికేషన్లు లేని 15 శాతం మందిలో కూడా సీవియర్ అబ్‌నార్మలిటీస్ ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే.