సీపీ వీడ్కోలు వేడుకపై భారీగా చర్చ.. కారణం…?

దిశ ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరగడానికి సీపీ ఫేర్ వెల్ పార్టీయే కారణమా..? అంటే వాస్తవమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనలు పాటించకుండా రిటైర్ మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వందలాది మంది అధికారులు, సిబ్బంది వేడుకకు హాజరై పోలీస్ బాస్‌కు వీడ్కోలు పలికారు. అంతా సాఫీగా జరిగిందనుకునే క్రమంలో పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ఫంక్షన్ కారణంగానే వైరస్ వ్యాప్తి […]

Update: 2020-07-09 21:20 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరగడానికి సీపీ ఫేర్ వెల్ పార్టీయే కారణమా..? అంటే వాస్తవమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనలు పాటించకుండా రిటైర్ మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వందలాది మంది అధికారులు, సిబ్బంది వేడుకకు హాజరై పోలీస్ బాస్‌కు వీడ్కోలు పలికారు. అంతా సాఫీగా జరిగిందనుకునే క్రమంలో పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ఫంక్షన్ కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇప్పటికే సుమారు 50 మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇందులో పది మందికి పైగా సీఐ, ఎస్సై స్థాయి అధికారులున్నట్లు సమాచారం. మిగతా పోలీసులకు కూడా టెస్టులు చేస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలో వీడ్కోలు సమావేశం హాట్ టాపిక్‌గా మారింది.

రూల్స్ ప్రకారమే వేడుకలు జరిగాయా?

జూన్ 30న వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ పదవీ విరమణ పొందారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలని మిగతా సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఇంకేముందీ..? కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని పోలీస్ శాఖకు చెందిన శుభం గార్డెన్స్‌లో వేదిక ఏర్పాటు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్లో ఎలాంటి వేడుకలకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఒకవేళ పెళ్లిలాంటి శుభకార్యాలకు 50 మంది, అశుభ కార్యాలకు 20 మంది మాత్రమే హాజరు కావాలి. కానీ వీడ్కోలు సమావేశంలో సుమారు 200 మంది అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరైనట్లు సమాచారం. ఆ వేడుకకు కరోనా సోకిన వారు సైతం హాజరైనట్లు ప్రచారంలో ఉంది. అంతేగాకుండా కమిషనర్ రిటైర్ కాక ముందు కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ, సీఐలతో క్రైం మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు సైతం వంద మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందుతున్నకమిషనర్ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో క్రైం మీటింగ్ నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఓ పక్క అధికారులే ప్రజలంతా బయటకు వచ్చినప్పడు సామాజిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయాలు ఫైన్ విధిస్తున్నారు. ప్రజల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులే నిబంధనలు పక్కన బెట్టారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసుల్లో కరోనా టెన్షన్

పోలీస్ శాఖను కరోనా కలవర వైరస్ కలవర పెడుతోంది. ఇప్పటికే సుమారు 50 మందికి పైగా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో మరి కొంతమందికి కరోనా సోకే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీస్ శాఖలో అందరికీ ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఉన్నతాధికారులు అవేమీ పట్టనట్లు కేవలం లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేసుకోవాలని, మిగతా వారు విధులకు హాజరు కావాలని నిబంధనలు పెట్టినట్లు సమాచారం. దీంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకిన అధికారులు హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్, హోం క్వారంటైన్లో పెట్టిన తమను పట్టించుకోవడం లేదని బాధితులు తమ సన్నిహితులు, తోటి సిబ్బందితో వాపోతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించి నాణ్యమైన చికిత్స అందించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News