ఇందూరులో కరోనా చుట్టూ ఇదేంది?

దిశ, నిజామాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా చుట్టూ ఇప్పుడు ఇందూర్ రాజకీయాలు తిరుగుతున్నాయి. 61 కరోనా పాజిటివ్ కేసులతో తెలంగాణలో రెండవ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కరోనా కట్టడికి అధికార యంత్రాంగానికి సహకరించకపోగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల కారణంగా అధికారులు, పోలీస్ శాఖ, ఇతర శాఖలు ఇబ్బందులకు గురవుతున్నారు. సేవా కార్యక్రమాలకు రాజకీయం ఆపాదిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల ప్రారంభం నుంచి ఒక […]

Update: 2020-04-21 02:52 GMT

దిశ, నిజామాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా చుట్టూ ఇప్పుడు ఇందూర్ రాజకీయాలు తిరుగుతున్నాయి. 61 కరోనా పాజిటివ్ కేసులతో తెలంగాణలో రెండవ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కరోనా కట్టడికి అధికార యంత్రాంగానికి సహకరించకపోగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల కారణంగా అధికారులు, పోలీస్ శాఖ, ఇతర శాఖలు ఇబ్బందులకు గురవుతున్నారు. సేవా కార్యక్రమాలకు రాజకీయం ఆపాదిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల ప్రారంభం నుంచి ఒక వర్గం కేంద్రంగా జరిగిన ప్రచారం అందుకు ఆజ్యం పోసింది. అది ఎంత వరకు వెళ్లిందంటే ప్రత్యక్ష ఎన్నికల కాలంలో ఎదుటి పార్టీల తప్పొప్పులను సొమ్ము చేసుకునే స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా జరుగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఎక్కడ, ఎవ్వరు ప్రత్యక్షంగా ఎదురెదురుగా వ్యాఖ్యలు చేసుకోకపోయినప్పటికీ సామాజిక మాధ్యమాలు వేదికగా జరుగుతున్న రాజకీయం ప్రత్యక్ష ఎన్నికలకు ఏమి తీసిపోవడం లేదు.

విమర్శల దుమారం..

నిజామాబాద్ జిల్లాలో సోషల్ మీడియా వేదికగా బీజేపీ – మజ్లిస్ పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మీ వల్లే కరోనా విస్తరించిందంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఓ వర్గం చేతిలో ఉన్న పలు పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో అధికార యంత్రాంగానికి సహకరించాల్సిన ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా, పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ – నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ ల మధ్య నడుస్తోంది. తాజాగా నిజామాబాద్ ఎంపీ అరవింద్.. అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ జిల్లా రాజకీయాలలో కాక పుట్టించింది. నిజామాబాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కరోనా నియంత్రణలో భాగంగా పేదల కోసం 247 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. ఆ బియ్యాన్ని పేదలకు అందజేయడంలో అధికార పార్టీ నేతలు పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని ఎంపీ మెసేజ్ సారాంశం. ఇప్పటి వరకూ అధికార పార్టీ నేతలు స్పందించకున్న ఆ పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది.

కరోనా కట్టడికి గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులతోపాటు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉండి ప్రజలతో మమేకం కావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను తమ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఆచరణలో పెట్టడం లేదన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. లాక్‌డౌన్ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా తమ ప్రజా ప్రతినిధులు స్థానికంగా అందుబాటులో ఉండడంలేదు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా నామమాత్రంగా అన్నదానం, సేవా కార్యక్రమాలను అనుచరులతో చేయించి కాలం గడుపుతున్నారనే వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కరోనా రాజకీయాలకు అధికారులు, పోలీస్ యంత్రాంగం బలవుతున్నారని చెప్పవచ్చు. ఇటీవల ఓ మహనీయుని జయంతి వేడుకలను ఇండ్ల వద్దే నిర్వహించుకోవాలని అధికార యంత్రాంగం ఎంతగా విన్నవించినా నేతలు పెడచెవిన పెట్టారు. దీంతో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారని పోలీసులు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలపై కేసులు నమోదు చేశారు.

అధికారులకు అవస్థలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ తన అనుచరులతో క్వారంటైన్ లో మృతి చెందిన వృద్ధురాలి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించకుండా, క్వారంటైన్ తరలించకుండా అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దానికి ప్రతిగా వారు.. సీఐ, ఎస్సై లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. లాక్‌డౌన్ కాలంలో దుకాణాలు, ఇతర అత్యవసరం కాని వాటి విషయంలో అధికార యంత్రాంగం కేసులు నమోదు చేశారని కొందరు రాజకీయ నాయకులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ లాక్‌డౌన్‌పై కఠినంగా వ్యవహరించడంతో ఉల్లంఘన కేసులు, వాహనాలు సీజ్ విషయంలో పలువురు అధికారులకు చోటామోట నేతల నుంచి ఒత్తిడులు వస్తున్నాయి. కేసుల విషయంలో ప్రజా ప్రతినిధుల నుంచి వస్తోన్న ఒత్తిళ్ల కారణంగా తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా కేసులు చేస్తారని ఒకరిద్దరు అధికారులు సంబంధిత శాఖల కింది స్థాయి అధికారులపై మండిపడుతున్నారు.

Tags: Nizamabad, social media, opposition, police and cases

Tags:    

Similar News