హాస్పిటల్ టవర్స్ @ గచ్చిబౌలి స్టేడియం

రాజధాని పశ్చిమాన గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉన్న స్పోర్ట్స్ విలేజ్ టవర్ లో తెలంగాణలోనే అతిపెద్ద దవాఖానా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్రానికే మణిహారంగా టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్న ఈ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో 1500 బెడ్లు ఉండబోతున్నాయి. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణపనులను మంత్రులు కేటీఆర్, ఈటల స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. ఈ నెల 20న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాజిటివ్ కేసుల చికిత్స, ఐసొలేషన్, క్వారంటైన్ అవసరాల కోసమంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, […]

Update: 2020-04-16 12:47 GMT

రాజధాని పశ్చిమాన గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉన్న స్పోర్ట్స్ విలేజ్ టవర్ లో తెలంగాణలోనే అతిపెద్ద దవాఖానా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్రానికే మణిహారంగా టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్న ఈ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో 1500 బెడ్లు ఉండబోతున్నాయి. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణపనులను మంత్రులు కేటీఆర్, ఈటల స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. ఈ నెల 20న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాజిటివ్ కేసుల చికిత్స, ఐసొలేషన్, క్వారంటైన్ అవసరాల కోసమంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఈ నిర్మాణం ప్రజలకు శాశ్వతంగా వైద్యసేవలందించనుందని అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా ఉండగా వాటి సరసన ఈ హాస్పిటల్ చేరబోతోంది.

దిశ, న్యూస్ బ్యూరో:నగరంలో పెరుగుతున్న జనాభా, వారి ఆరోగ్య అవసరాల కోసం ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా, ఛెస్ట్, నీలోఫర్, ఫీవర్, ఇఎన్‌టి, మెటర్నిటీ లాంటివి ప్రత్యేక అవసరాల ఆసుపత్రులుగా ఉన్నాయి. అయితే ఇవన్నీ నగరానికి ఒకవైపే ఉన్నాయి. పశ్చిమ దిశగా ఒక పెద్ద ఆసుపత్రి ఉండడం ఎప్పటికైనా అవసరమని ప్రభుత్వ ఆలోచన. దీని ద్వారా హైటెక్ సిటీ మొదలు కూకట్‌పల్లి, రాయదుర్గం ప్రాంతాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్ లాంటి జిల్లా ప్రజల అవసరాలు కూడా తీరుతాయన్నది మరో ఆలోచన. కరోనా కోసం ఎలాగూ కేంద్రం నుంచి నిధులు వచ్చినందున వాటిని శాశ్వత స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి వెసులుబాటు లభించింది. ఈ భవనం మొత్తం 13 అంతస్తులతో (గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా) ఉన్నా క్రింది ఆరు అంతస్తులను మాత్రమే ఆసుపత్రి అవసరాలకు వాడుకోవాలన్న ఆలోచనను అధికారులు వ్యక్తం చేశారు. కానీ కరోనా కేసులు పెరుగుతుండడం, క్వారంటైన్‌లో ఎక్కువ మందిని పెట్టాల్సిన అవసరం ఏర్పడడంతో అన్ని అంతస్తుల్లోనూ వార్డులను ఏర్పాటు చేయడం ఉత్తమమని అధికారులు సూచించారు.

దానికి అనుగుణంగా మొత్తం 13 అంతస్తుల్లోని గదులూ ఇప్పుడు ఆసుపత్రి వార్డులుగా మారుతున్నాయి. క్రింది అంతస్తును పూర్తిగా ఐసీయూ అవసరాల కోసం యాభై బెడ్‌లతో తీర్చిదిద్దుతున్నారు. 13వ అంతస్తును ప్రస్తుతం పూర్తిగా కరోనా పాజిటివ్ పేషెంట్ల వార్డు కోసం వినియోగించాలన్న ప్లాన్ ఉంది. ఒక్కో అంతస్తులో సగటున 36 రూమ్‌లు ఉంటాయి. ప్రతీ రూమ్‌లో రెండు బెడ్‌ల చొప్పున ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని గదుల విస్తీర్ణాన్ని బట్టి అదనపు బెడ్‌లు కూడా వస్తున్నాయి. దీంతో సగటున ఒక్కో అంతస్తులో 150 చొప్పున బెడ్‌లు ఉంటాయని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి వివరించారు. ప్రభుత్వం మాత్రం ఈ భవనంలో సుమారు 1500 సాధారణ బెడ్‌లు, యాభై వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన ఐసీయూ బెడ్స్ ఉంటాయని చెప్తోంది. ఇక ఇవి కాక ప్రతీ అంతస్తులో నర్సింగ్ రూమ్, మెడికల్ రూమ్, స్టాఫ్ రూమ్‌లు, డాక్టర్ క్యాబిన్‌లు.. ఇలా ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చికిత్స అవసరాల్లో భాగమే అయినా పేషెంట్లకు వివిధ రకాల పరీక్షలు చేయడానికి ఎక్స్‌రే, లేబొరేటరీ, ఆపరేషన్ థియేటర్లు… ఇలాంటివన్నీ రావాల్సి ఉంటుంది.

రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులన్నీ ఆశించినంత వేగంగానే జరుగుతున్నట్లు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 200 మంది డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, నర్సులను ఈ ఆసుపత్రికి బదిలీ చేయాలన్న నిర్ణయం కూడా జరిగిపోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎలాగూ ప్రస్తుతం పనిచేస్తున్న నర్సులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్య సరిపోదు కాబట్టి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. తాత్కాలిక అవసరాల కోసం ఏర్పడినప్పటికీ ఈ భవనాన్ని ఇక శాశ్వత ఆసుపత్రిగానే కొనసాగించాలన్నది ప్రభుత్వ భావన. అధికారికంగా ప్రకటన వెలువడడమే తరువాయి. ఆసుపత్రిగా పనిచేయడానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయని, ఉస్మానియా ఆసుపత్రికి ఇది అనుసంధానంగా ఉంటుందని, ప్రస్తుతానికి కేవలం కరోనా పాజిటివ్, అబ్జర్వేషన్ పేషెంట్ల అవసరాల కోసమే అన్ని వసతులూ కలిగిన ఐసొలేషన్ ఆసుపత్రిగా ఉంటుందని నోడల్ ఏజెన్సీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మొత్తం 13 అంతస్తుల భవనాన్ని ఆసుపత్రిగా తీర్చిదిద్దే బాధ్యతను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థకే ప్రభుత్వం అప్పగించింది. గజ్వేల్‌లో సమీకృత విద్యా సంస్థల సముదాయాన్ని నిర్మించిన ఈ సంస్థ పనితీరుతో సంతృప్తి చెందిన ప్రభుత్వం ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంను ఆసుపత్రిగా మార్చే బాధ్యతను కూడా అప్పజెప్పింది. తొలుత క్వారంటైన్, ఆ తర్వాత ఐసొలేషన్ అవసరాల కోసం దీన్ని తీర్చిదిద్దిన ప్రభుత్వం ఇక ఎప్పటికీ దీన్ని ఆసుపత్రిగానే కొనసాగించాలనుకుంటోంది. నగరానికి పశ్చిమాన ఉన్న ప్రాంతాల వారికి ఇకపైన వైద్యసేవలందించే ఆసుపత్రిగా రూపుదిద్దుకోనుంది.

Tags:    

Similar News