ఉద్యోగులను వెంటాడుతున్న ‘ఎన్నికల కరోనా’
దిశ – ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లా ప్రతినిధులు: ఇప్పుడే ఎన్నికలు వద్దని ఎంతో మంది చెప్పారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎలక్షన్స్ ఏంటంటూ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించింది. ఓటర్లు సైతం మా ప్రాణాలు తీయడానికే ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. చివరికి విధుల్లో పాల్గొనేందుకు సిబ్బంది భయపడ్డారు కూడా. కొంత మంది డ్యూటీలకు హాజరు కాకుంటే నోటీసులు ఇచ్చి మరీ పని […]
దిశ – ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లా ప్రతినిధులు: ఇప్పుడే ఎన్నికలు వద్దని ఎంతో మంది చెప్పారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎలక్షన్స్ ఏంటంటూ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించింది. ఓటర్లు సైతం మా ప్రాణాలు తీయడానికే ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. చివరికి విధుల్లో పాల్గొనేందుకు సిబ్బంది భయపడ్డారు కూడా. కొంత మంది డ్యూటీలకు హాజరు కాకుంటే నోటీసులు ఇచ్చి మరీ పని చేయించుకున్నారు. రాజకీయ పంతం నెగ్గించుకున్నారు. ఫలితంగా ఎన్నికలు జరిగిన ఏరియాల్లో వైరస్ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే.
మరో పక్క ఎన్నికల్లో పాల్గొన్న ఎంతో మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇందులో పలువురు మృత్యువాత పడ్డారు. విధులకు వెళ్లి వచ్చినాక ఎన్నో కుటుంబాలు వైరస్ బాధితులయ్యాయి. ఇప్పుడేం లాభం? ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. రాష్ట్రంలో నిర్వహించిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల తర్వాత ఆయా ప్రాంతాలు సహా రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ఓ రేంజ్ లో విజృంభించింది. రోజుకు వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎన్నికల జరపడం వల్లే ఈ స్థాయిలో వైరప్ వ్యాప్తి జరిగిందంటూ ఎంతో మంది ప్రభుత్వాన్ని తప్పుపట్టారు కూడా. ఇదిలా ఉంటే ఎన్నికల విధులకు హాజరైన వారు, ప్రచారంలో పాల్గొన్నవారు వైరస్ బారిన పడి పదుల సంఖ్యలో మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధులకు హాజరైన వారు, ప్రచారంలో పాల్గొన్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులూ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే రూ.లక్షలు పెట్టి కొంతమంది ఖమ్మం, వరంగల్ తో పాటు, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తమ ఇంట్లో పెద్దవారు ఉన్నారని చెప్పినా ఎన్నికల విధులకు హాజరు కావాల్సిందేనని అప్పుడు షోకాజు నోటీసులు కూడా వచ్చాయి. విధులకు హాజరై వచ్చాక తనతో పాటు తన తండ్రికి కూడా వైరస్ సోకిందని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. ఇప్పుడు లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఎవరి పాపం? పురపాలక, మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కలిగే నష్టం వైరస్‌వ్యాప్తితో రోడ్డున పడుతున్న కుటుంబాల కంటే ఎక్కువేం కాదు. కానీ పాలకపక్షం మాత్రం గెలిచి తీరాలన్న లక్ష్యంతోనే ఎన్నికలను కచ్చితంగా నిర్వహించి తీరాలని పట్టుపట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కరోనా వ్యాప్తి, దాని తీవ్రత, ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల గురించి ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జంకుతున్నాయి. ఎక్కడ తమను ఏదో కారణంతో ఉద్యోగం నుంచి తొలగిస్తారోనని భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ లో పాల్గొన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎందరికి కరోనా పాజిటివ్వచ్చిందన్న అంశంపై సర్వే చేస్తే వాస్తవాలు బయటపడుతాయి.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో..
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం మైక్రో అబ్జర్వర్లు 258, 66 మంది రిటర్నింగ్ అధికారులు, 66 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కలిసి మొత్తం పోలింగ్ సిబ్బంది 2274 విధుల్లో పాల్గొన్నారు. ఫలితాల కౌంటింగ్ సందర్భంగా కూడా సుమారు 170 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో దాదాపు 600 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించిన తర్వాత కరోనా వైరస్ బారిన పడినట్లు సమాచారం. 20 రోజులుగా ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో కొందరు మృత్యువాత పడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల విధుల్లో సుమారు 1700 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో కూడా చాలా మంది ఎన్నికల విధుల తర్వాత కరోనా బారిన పడ్డారు. ఇప్పటికీ కొంత మంది వైరస్ బారినుంచి కోలుకోలేదు. అంతేకాదు వీరి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఉద్యోగులకు శాపం
ఎన్నికల పాపం ఉద్యోగ, ఉపాధ్యాయ, జీడబ్ల్యూఎసీ సిబ్బంది కుటుంబాలకు శాపంగా మారింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న వందలాది మంది ఉద్యోగులు, సిబ్బందికి కోవిడ్ బారిన పడ్డారు. పది రోజుల పాటు గ్రేటర్ వరంగల్‌లోని డివిజన్లల్లో వేలాది సంఖ్యలో కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వందలాది మంది పనిచేశారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో దాదాపు 6 వేల మంది సిబ్బంది పనిచేశారు. ఫలితాలు ముగిసిన మరునాడే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో కమిషనర్ పమేల సత్పతి సహా 8 మంది కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. పార్టీల కార్యకర్తలకైతే లెక్కేలేదు. అనేక మంది దయనీయ స్థితిలో ఉన్నారు. కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు.
జీడబ్ల్యూఎంసీలో పని చేస్తున్న అనేక విభాగాల్లో నేటికీ సగం హాజరు కూడా ఉండటం లేదు. ఒక్క శానిటేషన్ విభాగంలోనే 160 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇందులో అత్యధికులు మహిళలు కావడం గమనార్హం. కరోనా బారిన పడి ముగ్గురు కార్మికులు ఇప్పటి వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఒక్క పోలీస్ శాఖలోనే దాదాపు 150 మందికి పైగా కరోనా పడినట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఉపాధ్యయుల్లోనూ 300 మందికి పైగా కరోనా పడ్డారు. వీరి ద్వారా ఆయా కుటుంబాల్లోని సభ్యులకు, చిన్నారులకు కూడా వ్యాప్తి చెందడంతో లక్షలాది రూపాయాలను ఆస్పత్రుల పాలయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్చర్లలో జర్నలిస్టులు సైతం..
జడ్చర్ల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార సమయంలో పలువురు ముఖ్య నాయకులు, అభ్యర్థులు సైతం వైరస్ బారిన పడ్డారు. 10 మంది జర్నలిస్టులు సైతం వైరస్ బారిన పడ్డారు. ఎన్నికల సందర్భంగా దాదాపుగా 300 మందికి పైగా వైరస్ బారిన పడ్డట్లు సమాచారం. కొందరు హోం క్వారంటైన్లో ఉండగా ఒక ఛానల్ జర్నలిస్టు మాత్రం జిల్లా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నట్లు సమాచారం.
అచ్చంపేటలో 200 మంది..
అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత 200 మంది వైరస్ బారినపడినట్లు సమాచారం. విధులు నిర్వహించిన ఐదుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ముగ్గురు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురై వివిధ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్నారు. కౌంటింగ్ సమయంలో తెలిసిన టెస్టులలో ఒక ఎస్.ఐ తో పాటు పలువురు ఏజెంట్లు, మున్సిపల్ శాఖ సిబ్బంది వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పలువురు అభ్యర్థులు సైతం వైరస్ బారిన పడ్డారు. కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నలుగురు కరోనా వైరస్ సోకి ఇంట్లోనే ఉండి జూమ్ యాప్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా పలువురు ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు కరోనా బారినపడి చావు అంచుల దాకా వెళ్లి వచ్చినంత పని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నకిరేకల్‌లో అధికారులు, కార్యకర్తలు..
నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 8 మంది రిటర్నింగ్ అధికారులు, 53 మంది పీఓలు, 55 మంది ఏపీఓలు, 196 మంది ఓపీఓలను నియమించారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 1000 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. వీరిలోనూ చాలా మంది కరోనా బారిన పడ్డట్లు తెలిసింది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తల సంగతైతే మరీ దారుణంగా ఉంది.
జాగ్రత్తలు లేకుండానే..
కరోనా విజృంభిస్తున్న వేళ ఎన్నికలు నిర్వహించొద్దని ఎన్ని సార్లు మొత్తుకున్నా ప్రభుత్వం వినలేదు. ఉపాధ్యాయులు కొంతమంది ఎన్నికల విధులకు హాజరు కాకపోతే షోకాజ్ నోటీసులు సైతం ఇచ్చి విధులు చేయించుకున్నారు. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోయారు. కొందరు ఇప్పటికీ మృత్యువుతో పోరాడుతున్నారు. కొందరు లక్షలు పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఐతే గొంతెత్తి అరవాలని ఉన్నా ఉన్నతాధికారులు, పాలకుల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.