నష్టాల ఊబిలోకి ఆర్టీసీ

దిశ, నల్లగొండ: ఆర్టీసీపై కరోనా వైరస్ కోలుకోలేని పంజా విసిరింది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 45 కోట్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అసలే 55 రోజుల సిబ్బంది సమ్మెతో భారీ నష్టాలను మూట్టకట్టుకున్న ఆర్టీసీ.. తాజాగా కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు బస్సు డిపోల పరిధిలో కరోనా వైరస్ కారణంగా ఒక్క బస్సుల మీదనే అక్షరాల రూ.45 కోట్ల ఆదాయం కోల్పోయింది. బస్టాండుల్లోని […]

Update: 2020-05-07 03:07 GMT

దిశ, నల్లగొండ: ఆర్టీసీపై కరోనా వైరస్ కోలుకోలేని పంజా విసిరింది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 45 కోట్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అసలే 55 రోజుల సిబ్బంది సమ్మెతో భారీ నష్టాలను మూట్టకట్టుకున్న ఆర్టీసీ.. తాజాగా కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు బస్సు డిపోల పరిధిలో కరోనా వైరస్ కారణంగా ఒక్క బస్సుల మీదనే అక్షరాల రూ.45 కోట్ల ఆదాయం కోల్పోయింది. బస్టాండుల్లోని దుకాణాలు, స్థలాల ద్వారా మరికొంత ఆదాయానికి గండి పడింది. దీనికితోడు నెలన్నర రోజులుగా మూలకుపడినట్టు అయిన బస్సుల మరమ్మత్తులు డిపోలకు అదనపు భారం కానుంది. దీనికితోడు బస్టాండ్లలోని దుకాణాలు, స్థలాల అద్దె ద్వారా నెలకు మరో రూ. కోటిపైగానే నష్టం వాటిల్లనుంది.

సమ్మె ప్రభావం నుంచి కోలుకోక ముందే..

వాస్తవానికి సంక్రాంతి సమయంలో సిబ్బంది 55 రోజుల పాటు చేసిన సమ్మెతో ఆర్టీసీ భారీగా నష్టాల్ని మూటగట్టుకుంది. ఒకానొక దశలో ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ అనేది ముగిసిపోయిన శకమంటూ ప్రకటనలు చేశారు. కానీ, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి. అయితే ఆర్టీసీని లాభాల బాటలో పెట్టేందుకు ఇటు ప్రభుత్వం.. అటు అధికార యంత్రాంగం బస్సులను భారీగా తగ్గించి పలు రూట్లను ప్రైవేటీకరణ చేయడంతోపాటు ఛార్జీలను భారీగా పెంచడంతో కాస్తంత గాడిన పడినట్టయ్యింది. అప్పుడప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మరోసారి కరోనా రూపంలో కష్టాలు కమ్మేశాయి. ఇప్పటికే 44 రోజులుగా బస్సులు డిపోకే పరిమితం కాగా, అసలు బస్సులు రోడ్డెప్పుడు ఎక్కుతాయనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదీ పరిస్థితి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు బస్సు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 750 బస్సులు నిత్యం రోడ్లపై ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఇక సిబ్బంది విషయానికొస్తే.. ఈ ఏడు డిపోల పరిధిలో 2950 మంది రెగ్యులర్ సిబ్బంది, 350 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇక ఆదాయం విషయానికొస్తే.. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డిపోల ద్వారా రోజుకు రూ.33 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న ఏకైక ఆర్టీసీ డిపో యాదగిరిగుట్ట. ఈ డిపో ద్వారా ప్రభుత్వానికి నిత్యం రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి, దేవరకొండ డిపోల పరిధిలో రోజుకు రూ.60 నుంచి రూ.65 లక్షల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఈ కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల రూ.45 కోట్లకు పైగానే ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది.

భారంగా మారింది..

లాక్‌డౌన్ వల్ల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో వాటి నిర్వాహణ భారంగా మారింది. రోజుల తరబడి బస్సులు నడవకపోవడం వల్ల కండీషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో డిపోల్లోని బస్సులను నిత్యం సిబ్బందితో సర్వీసింగ్ చేయిస్తున్నారు. బస్సు బ్యాటరీలు చెక్ చేయడం.. ఇంజిన్‌ను కొద్దిసేపు రన్నింగ్‌లో ఉంచడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క డిపోలో 10 మంది సిబ్బంది చొప్పున విధులకు వచ్చి.. బస్సులను కండీషన్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులకు ఉన్న మైనర్ రిపేర్లను మెకానిక్‌లు చేస్తున్నారు. దీనికితోడు ఉద్యోగుల జీతభత్యాలు డిపోలకు పెద్ద తలనొప్పిగా మారాయి. సూర్యాపేట జిల్లాలో కోదాడ, సూర్యాపేట డిపోల్లోని 755 మంది సిబ్బందికి నెలకు జీతభత్యాల కింద రూ.2 కోట్లకు పైగానే ఖర్చవుతాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట డిపోలో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులకు రూ.2.5 కోట్లు వేతనాలుగా ఇవ్వాల్సి వస్తోన్నది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సుల వివరాలు..

డిపో పేరు బస్సులు
సూర్యాపేట 102
కోదాడ 98
నల్లగొండ 110
మిర్యాలగూడ 80
నార్కట్‌పల్లి 60
దేవరకొండ 90
యాదగిరిగుట్ట 110

Tags: Nalgonda, RTC buses, severe damage, corona effect

Tags:    

Similar News