కరోనాకే చికిత్స.. ఇంకేదున్నా అవస్థే !
– ఇబ్బందుల్లో గర్బిణులు, వ్యాధిగ్రస్తులు – ప్రజల ఆరోగ్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి – ఆంధ్రలో డీఎంఏ పరిధిలో వైద్యసేవలు దిశ, న్యూస్ బ్యూరో: ఓ వైపు మందులేని కరోనా వెంటాడుతూ.. సాధారణ ప్రజల ప్రాణాలకు హానితెస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేసుకునే అవకాశం లేకపోగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. కరోనాను నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం అమలు చేయడంలో వైద్యుల అవగాహన లోపం, […]
– ఇబ్బందుల్లో గర్బిణులు, వ్యాధిగ్రస్తులు
– ప్రజల ఆరోగ్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
– ఆంధ్రలో డీఎంఏ పరిధిలో వైద్యసేవలు
దిశ, న్యూస్ బ్యూరో: ఓ వైపు మందులేని కరోనా వెంటాడుతూ.. సాధారణ ప్రజల ప్రాణాలకు హానితెస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేసుకునే అవకాశం లేకపోగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. కరోనాను నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం అమలు చేయడంలో వైద్యుల అవగాహన లోపం, నిర్లక్ష్య వైఖరి పేదల ప్రాణాలను బలిగొంటున్నాయి. బీపీ, క్యాన్సర్, డయాబెటిస్, ఎముకలు, నరాల వ్యాధి, ప్రమాద చికిత్సలకు సంబంధించి మెడికల్ టెస్టులు, మందులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక గర్భిణి మృతిచెందిన ఘటనను ఎస్‌హెచ్ఆర్‌సీ సుమోటోగా స్వీకరించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ప్రైవేటు ఆస్పత్రులను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(డీఎంఏ)పరిధిలోకి తెచ్చి అవసరమైనవారికి వైద్యం అందించాలని వివిధ పార్టీలు, సామాజిక సంఘాలు కోరుతున్నాయి.
సిద్దిపేట జిల్లాకు చెందిన రమాదేవి (40)కి డయాబెటిస్ ఇన్సులిన్ స్టేజిలో ఉంది. డయాబెటిస్‌తో సమస్య తీవ్రమవడంతో కండ్లపై ప్రభావం పడి చూపుపోయింది. ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రిలో మార్చి 28న సర్జరీ చేయాల్సి ఉంది. కాగా, లాక్‌డౌన్ విధింపుతో సర్జరీ వాయిదా పడింది. ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జీ చేయడంతో రమాదేవిని తెలిసిన వారింట్లో ఉంచుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రమాదేవి భర్త, ఇద్దరు పిల్లలు వండుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బయట నుంచి తెచ్చుకుని తిందామన్నా హోటళ్లు మూతపడటంతో సుమారు రెండు నెలల పాటు ఇక్కడ రమాదేవి, అక్కడ ఆమె కుటుంబం ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన ఓ వివాహిత (28) ఎనిమిది నెలల గర్భిణి. అనుకోకుండా గత బుధవారం నొప్పులు రావడంతో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, వారు ఆమెను జాయిన్ చేసుకోలేదు. దీంతో ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఈ సమయంలో అలా నొప్పులు రావడం సహజమేనంటూ తిప్పి పంపించారు. ఇంటికి వెళ్లిన కొద్ది సమయానికే ఆమెకు రక్తస్రావం కావడంతో తిరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడా వారు జాయిన్ చేసుకోలేదు. ఆమె అవస్థను చూడలేక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రహస్యంగా సిజేరియన్ చేసి బాబును బయటకు తీశారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నల్గొండ జిల్లాలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణకంటూ చేపడుతున్న చర్యలతో సాధారణ ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీపీ, డయాబెటిస్, నరాల వ్యాధులు, ప్రెగ్నెన్నీ వంటి వాటిలో రెగ్యులర్ చెకప్‌లు చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు జంకుతున్నాయి. కోర్సుల వారీగా మందులు వాడాల్సిన పేషంట్లకు అవి అందడం లేదు. లాక్‌డౌన్ రోజుల్లో వైద్యం చేయొద్దంటూ ప్రభుత్వం హుకూం జారీచేయడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వ్యాపించడం సంగతి అటుంచి, వ్యాధితో ఏ సంబంధం లేకపోయినా కండ్లు, శ్వాసకోస, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్ననాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందన్నట్టుగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి నెలకొంది.
ఆంధ్రలో అలా.. ఇక్కడ ఇలా..
తెలంగాణలో అత్యాధునిక పరికరాలున్న కార్పొరేట్ ఆస్పత్రులతో సహా ఆర్ఎంపీ వైద్యులు కూడా చిన్నచిన్న ట్రీట్‌మెంట్ కూడా చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకరకంగా ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట పడినా ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగత వ్యాధులున్నవారికి చికిత్స అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా బాధితులకంటే.. ఇతర రుగ్మతలకు చికిత్స అందకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్‌డౌన్ రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ పరిధిలోకి తెస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం పరిధిలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారిని తిప్పి పంపేందుకు ఆస్పత్రులకు అవకాశం లేదు. కరోనా మినహా అత్యవసర చికిత్స అవసరమైనవారు వైద్య సేవలు పొందేందుకు అవకాశం కలుగుతోంది. తెలంగాణలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఇతర ప్రాధాన్యత గల శస్త్రచికిత్సలను ప్రజలకు అందించాలని పలువురు కోరుతున్నారు.
జాగ్రత్తలతో చికిత్స అందించాలి – శ్రీనివాస్, సీపీఎం నాయకులు, హైదరాబాద్
కరోనా వచ్చిందని చెప్పి ఇతర ట్రీట్‌మెంట్లు ఆపడం సరికాదు. కరోనా ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మంచిదే కానీ.. ఇందుకోసం ఇతర ప్రమాదకర వ్యాధులతో బాధపడేవారి ప్రాణాలను బలిపెట్టడం సరికాదు. ప్రజారోగ్యం హెల్ప్ లైన్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తే 30-40 వేల కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్‌ను చూస్తేనే ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. కేరళ మోడల్‌ను ప్రపంచం గుర్తిస్తోంది. కరోనా అంతటా ఉంది. కేరళలో ప్రభుత్వమే ప్రైవేటు ఆస్పత్రులను నడుపుతోంది. వారిని అనుసరించడం ఎందుకు నచ్చడం లేదు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలకు వైద్య చికిత్సలను అందజేయాలి. కరోనా జాగ్రతలు తీసుకొని ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందించాలి.
Tags: Telangana, Health, KCR, Govt, Lockdown, Corona