కరోనా ఎఫెక్ట్.. మెడికల్ షాపుల్లో నో స్టాక్..
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో దేశమంతా ‘లాక్‌డౌన్’ కొనసాగుతోంది. అత్యవసరమైన మందులు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బందేమీ లేదని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఆచరణలో మాత్రం మెడికల్ షాపులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అత్యవసర మందులు ఏ షాపులోనూ దొరకడం లేదు. స్టాకు అయిపోయిందని చెబుతున్నారు. మందుల కంపెనీలు మొదలు డిస్ట్రిబ్యూటర్ల వరకు పలు చోట్ల తగినంత స్టాకు ఉంది. కానీ రిటైల్ మెడికల్ షాపుల వరకు రవాణా జరగడం లేదు. ఎలెక్టివ్ సర్జరీలు ఎలాగూ నిలిచిపోయాయి […]
దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా నేపథ్యంలో దేశమంతా ‘లాక్‌డౌన్’ కొనసాగుతోంది. అత్యవసరమైన మందులు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బందేమీ లేదని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఆచరణలో మాత్రం మెడికల్ షాపులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అత్యవసర మందులు ఏ షాపులోనూ దొరకడం లేదు. స్టాకు అయిపోయిందని చెబుతున్నారు. మందుల కంపెనీలు మొదలు డిస్ట్రిబ్యూటర్ల వరకు పలు చోట్ల తగినంత స్టాకు ఉంది. కానీ రిటైల్ మెడికల్ షాపుల వరకు రవాణా జరగడం లేదు. ఎలెక్టివ్ సర్జరీలు ఎలాగూ నిలిచిపోయాయి కాబట్టి ప్రస్తుతం అత్యవసర సర్జరీలకు మరో నెల రోజులకు మాత్రమే సరిపోయే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. పేషెంట్ల అవసరాలకు అనుగుణంగా మందుల ఉత్పత్తికి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేస్తే తప్ప రానున్న మూడు నాలుగు నెలల్లో ఉత్పత్తి, సరఫరా సాధ్యం కాదని సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ స్థాయిలోనే రవాణా ఆంక్షల్లో మెడికల్ అవసరాలకు వెసులుబాటు కల్పిస్తే తప్ప ప్రజల ఆరోగ్య అవసరాలు తీరవని ఆ అధికారి వ్యాఖ్యానించారు.
కరోనా నివారణ దృష్ట్యా ప్రధాని మోడీ ఈ నెల 22న జనతా కర్ఫ్యూ పెట్టినప్పుడే రిటైల్ మెడికల్ షాపుల్లో చాలా రకాల మందులు విస్తృతంగా అమ్ముడుపోయాయి. ఒకటి రెండు నెలలకు సరిపడే మందులను దుకాణాలు ఉంచుకుంటున్నప్పటికీ ఒకేసారి మధ్యతరగతి ప్రజలు ఇంట్లో నిల్వ ఉంచుకునే ఉద్దేశంతో కొనుక్కోవడంతో ఊహించని విధంగా కొరత ఏర్పడింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ‘లాక్‌డౌన్’ అమల్లోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. మందుల సరఫరాలో ఈ సంక్షోభం రావడానికి ప్రత్యేక పరిస్థితులు దారితీసినప్పటికీ తిరిగి యధాతథ స్థితి రావాలంటే దాదాపు నాలుగైదు నెలలు పడుతుందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న లాక్‌డౌన్ మరికొన్ని రోజులు కొనసాగి, రవాణా వ్యవస్థలో మెడికల్ అవసరాలకు వెసులుబాటు ఇవ్వకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలకు మెడికల్ షాపుల్లో మందులే దొరకవని, పరిస్థితి చేయిదాటిపోయే అవకాశాలు ఉన్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అన్నింటికంటే పెద్ద సవాలుగా ఉన్న కరోనాపై ప్రభుత్వం దృష్టి పెట్టడం అనివార్యం. మెడికల్ ఎమర్జెన్సీ సేవలపై ప్రభుత్వ ప్లానింగ్ సరిగ్గానే ఉన్నా అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్ అత్యవసర సేవల్లో ఉండేవారికి ఆన్‌లైన్ విధానం ద్వారా వాహనాలకు పాస్‌లు ఇస్తామని చెప్పినా చాలా మెడికల్ షాపుల యజమానులు మాత్రం అందలేదని, ఇస్తామంటున్నారే తప్ప వారం రోజులైనా మంజూరు కాలేదని, ఫలితంగా దుకాణంలో ఉన్న స్టాకును మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుంది తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోడానికి మార్గం లేకుండా పోయిందంటున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇదే తరహా సమాధానాలు వినిపిస్తున్నాయి. వివిధ కంపెనీల నుంచి మందులను సీ అండ్ ఎఫ్ (క్యారీ అండ్ ఫార్వార్డ్) ఏజెన్సీల దగ్గరి నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుందని, కానీ ఆ ఏజెన్సీలు నగర శివారు ప్రాంతంలో ఉండడంతో తరలించడానికి ఇబ్బందులు వస్తున్నాయని వాపోయారు. స్వంతంగా వెహికల్ పెట్టుకుని తీసుకెళ్ళేటట్లయితే ఇవ్వడానికి ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నా లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఆ ప్రయత్నాలు ఫలించడంలేదు. పెద్దపెద్ద ఆసుపత్రులు కలిగిన దుకాణాల్లో పరిస్థితి ఒకే మేరకు అదుపులోనే ఉన్నా రిటైల్ దుకాణాల్లో మాత్రం దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి.
వచ్చే నెలలో కష్టాలు పెరుగుతాయి : డ్రగ్గిస్ట్ అసోసియేషన్
”నగరంలో సుమారు పన్నెండు వేల మెడికల్ షాపులు ఉన్నాయి. వీటన్నింటిలో సగటున 70% మందులు అయిపోయాయి. ఇన్సులిన్ మందులు దాదాపుగా స్టాక్ మొత్తం అయిపోయాయి. బీపీ మాత్రలు కొన్ని దుకాణాల్లో మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్ నెల చివరి వరకూ ఎలాగోలా సర్దుకోవచ్చు. కానీ వచ్చే నెల నుంచి పరిస్థితి చాలా దిగజారుతుంది. ఊహించడం కూడా కష్టమే. మందుల తయారీ కంపెనీలు వాటి పరిధిలో ఉండే సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలకు స్టాక్ పంపిస్తాయి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లకు చేరతాయి. వారి నుంచి మెడికల్ షాపులకు వస్తాయి. అయితే ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఈ అన్ని స్థాయిల్లో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. మెడికల్ షాపులకు ఆంక్షలు ఉండవని చెప్పినా అది అమలుకావడంలేదు. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నగర అవసరాలను బట్టి ఒక నెల రోజులకు సరిపోయే స్టాక్ ఉంది. కానీ రిటైల్ దుకాణాలే వచ్చి తీసుకెళ్ళాలన్న నిబంధన విధించాయి. కానీ పాస్‌లు లేకపోవడంతో సాధ్యం కాలేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా సీ అండ్ ఎఫ్ దగ్గర తగినంత స్టాకు ఉందని చెప్తున్నారు. కానీ శంషాబాద్, కొంపల్లి లాంటి శివారు ప్రాంతాల్లో ఆ ఏజెన్సీ గోడౌన్లు ఉన్నందున తీసుకురావడం ఇబ్బందికరమంటూ డిస్ట్రిబ్యూటర్లు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. చివరి సామాన్యుడికి ఇబ్బందులు వస్తున్నాయి” అని జీహెచ్ఎంసి కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
సప్లయ్-డిస్ట్రిబ్యూషన్ చెయిన్ దెబ్బతిన్నది : జాయింట్ డైరెక్టర్, స్టేట్ డ్రగ్ అథారిటీ
”కంపెనీల దగ్గరా, సీ అండ్ ఎఫ్ దగ్గరా, డిస్ట్రిబ్యూటర్ల దగ్గరా మందుల స్టాక్ పుష్కలంగా ఉంది. అవసరాలు తీరతాయి. కానీ అక్కడి నుంచి రిటైల్ దుకాణానికి చేరడంలో ఇబ్బందులు ఉన్నాయి. రిటైల్ దుకాణాల్లో స్టాక్ బాగా తగ్గిపోయింది. ఎప్పటికప్పుడు స్టాక్ తెచ్చుకోడానికి వీలుగా రిటైల్ దుకాణాలకు పాస్‌లు ఇవ్వాలని పోలీసుల్ని కోరాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా సకాలంలో రవాణా చేసేందుకు వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ వారం రోజులైంది. ఇంకా పాసులు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇస్తామంటున్నారు. సమస్యలు ఉన్నాయిగానీ ఇవి తాత్కాలికం మాత్రమే అనుకుంటున్నాం. త్వరలోనే సమసిపోయి మందులు అందుబాటులోకి వస్తాయి. అయితే సర్జరీలకు అవసరమైన గ్లవుజులు, మాస్కులు, ఇతర ఉపకరణాలు మాత్రం తగినంత సంఖ్యలో లేవు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడుపైన ఆధారపడుతున్నాం. రవాణా వ్యవస్థ గాడిలో పడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకతప్పదు” అని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంతో సమన్వయిస్తున్నాం : కేంద్ర డ్రగ్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్
”రాష్ట్రంలో మందుల స్టాకు పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వస్తున్నాయి. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సమన్వయ బాధ్యతలు అప్పజెప్పాం. కానీ కేంద్రం నుంచి సహకారం ఏ మేరకు అందుతుందో, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి కావాల్సిన మందుల సరఫరాకు అవసరమయ్యే రవాణా వ్యవస్థ సమస్యలపై నేను మాట్లాడలేను. సారీ… నో కామెంట్. ఏ సమాచారం కావాలన్నా రాష్ట్ర అథారిటీ జాయింట్ డైరెక్టర్ లేదా ఢిల్లీలోని సెంట్రల్ అథారిటీ అధికారులను లేదా పిఐబీ అధికారులను అడిగి తెలుసుకోండి. నేను చెప్పలేను” అని కేంద్ర డ్రగ్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ విశాల వ్యాఖ్యానించారు.
ముడిపదార్ధాలకూ ఇబ్బంది ఉంది : ఓ అధికారి
”నిజానికి రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు అనేక రకాల మందుల్ని తయారుచేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసేంత సామర్థ్యంలో ఉన్నాయి. కొన్ని కంపెనీల దగ్గర ముడి పదార్ధాలూ ఉన్నాయి. కానీ తయారుచేసిన తర్వాత వాటిని తరలించడానికి స్వంత రవాణా వ్యవస్థ లేదు. ఎస్ఆర్‌ఎంటీ, క్రాంతి, నవత లాంటి ట్రాన్స్‌పోర్టు కంపెనీల మీద ఆధారపడుతున్నాయి. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌తో అవి నిలిచిపోయాయి. ఈ కారణంగా అవి తయారుచేయడానికి ఉత్సాహం చూపడంలేదు. దీనికి తోడు ఫ్యాక్టరీలు బంద్ కావడంతో దాదాపు 80% సిబ్బందికి సెలవు ఇచ్చేశాయి. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్స్‌గా వాడే ముడిపదార్ధాల్లో ఎక్కువగా చైనా నుంచే వస్తుంది. కానీ నవంబరు నుంచి ఫిబ్రవరి మొదటివారం వరకు చైనాలో ఎక్కువగా ఈ ఎగుమతి వ్యాపారం యాంగ్‌చు అనే నగరం నుంచే జరుగుతుంది. కానీ వాతావరణ పరిస్థితుల్లో మూడు నెలల పాటు అక్కడ సెలవు కావడంతో ఆ మూడు నెలల స్టాక్ కూడా ఇక్కడి కంపెనీలు సమకూర్చుకున్నాయి. ఇప్పుడు అదే మిగిలింది. కానీ మరో నెల రోజులు ఈ స్టాక్ సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ కార్గో ద్వారా తెప్పించుకోవాల్సిందే. లేదంటే మన స్వంత వనరుల నుంచి సమకూర్చుకోవాలి. కానీ ఖర్చు దాదాపు ఐదారు రెట్లు ఎక్కువగా ఉంటుంది. భారత ప్రభుత్వం దీన్ని భరించడానికి సిద్ధపడితే ఫార్మా కంపెనీలు తయారుచేయగలుగుతాయి. విధాన నిర్ణయం ద్వారా మాత్రమే స్పష్టత వస్తుంది.
నిజానికి లాక్‌డౌన్ పీరియడ్‌లో ప్రజల కదలికలు చాలా పరిమితంగానే ఉండాలి. అయితే ఆ జాగ్రత్తలు మందుల కొరతకు దారితీసేలా ఉండకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు సమన్వయంతో మందుల రవాణాకు అనువుగా మన రాష్ట్ర అవసరాలు, వాటిని తయారుచేసే ఫార్మా కంపెనీల జాబితా, అవి తయారుచేయడానికి చూపే సంసిద్ధత, అక్కడి నుంచి సీ అండ్ ఎఫ్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ నుంచి రీటైల్ దుకాణాల వరకు చేరే మొత్తం రవాణా మెకానిజాన్ని అధ్యయనం చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఆ విధంగా కొరతను నివారించవచ్చు. అవసరమైతే రవాణా చేసే వాహనాల్లో పరిమిత సిబ్బందిని అన్ని పరీక్షలూ చేసి అనుమతి ఇవ్వవచ్చు. ఇప్పుడే పరిస్థితిని చేయిదాటిపోకుండా వ్యవహరిస్తే మే, జూన్ నుంచి ఈ సమస్య తీవ్రతను నివారించడానికి వీలవుతుంది. లేదంటే కరోనాను మించిన సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు ఇప్పుడు ఇన్సులిన్, బీపీ మాత్రల లాంటివి సమకూర్చుకున్నారు. కానీ అల్పాదాయ వర్గాలు ఏ వారానికి ఆ వారం కొనుక్కుంటారు. వారికి ఇబ్బంది వస్తుంది.
ఇక క్రిటికల్ కేర్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌తో పాటు క్యాన్సర్, కీమో థెరఫీ, హెచ్ఐవి తదితర మందుల్ని ముంబాయి, అహ్మదాబాద్, నోయిడా లాంటి ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సిందే. మన ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్నా సరఫరా మాత్రం ఎక్కువగా అక్కడి నుంచే. వీటిని నగరంలో విక్రయించే రిటైల్ దుకాణాలు కూడా ఇరవైకు మించవు. ఈ మందుల ధరలు ఎక్కువ కావడంతో పెద్దపెద్ద దుకాణాలు మాత్రమే సరిపోయినంత స్టాక్ పెట్టుకుంటాయి. కానీ రెండు సైకిల్స్‌కి మించి స్టాక్ పెట్టుకునే దుకాణాలు చాలా తక్కువ. ఒక్కో సైకిల్ రెండు వారాల నుంచి నెల రోజులు పడుతుంది కాబట్టి ఈ నెలాఖరు వరకు ఫర్వాలేదు. కానీ ఇప్పుడు తగిన స్టాక్ చేరకపోతే రానున్న రెండు నెలల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఇవి మన దగ్గరకు చేరడానికి ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వాలు ఆలోచించడం తప్పనిసరి” అని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.