కరోనా వలసలు..
– 33 కొత్త కేసుల్లో 7 వలస కార్మికుల నుంచి దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అనుమానించినట్లుగానే ఇతర ప్రాంతాల నుంచి కరోనా దిగుమతి అవుతోంది. తొలుత విదేశాల నుంచి వచ్చిన కరోనా వైరస్.. ఆ తర్వాత మర్కజ్ యాత్రికుల ద్వారా వచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రే పలు సందర్భాల్లో ఈ వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత మన రాష్ట్రంలోనే ఒకరి నుంచి మరొకరికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ద్వారా వ్యాపిస్తూ ఉంది. ఇది ఇంకా పూర్తిస్థాయిలో […]
– 33 కొత్త కేసుల్లో 7 వలస కార్మికుల నుంచి
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అనుమానించినట్లుగానే ఇతర ప్రాంతాల నుంచి కరోనా దిగుమతి అవుతోంది. తొలుత విదేశాల నుంచి వచ్చిన కరోనా వైరస్.. ఆ తర్వాత మర్కజ్ యాత్రికుల ద్వారా వచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రే పలు సందర్భాల్లో ఈ వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత మన రాష్ట్రంలోనే ఒకరి నుంచి మరొకరికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ద్వారా వ్యాపిస్తూ ఉంది. ఇది ఇంకా పూర్తిస్థాయిలో కట్టడి కాకముందే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే యాత్రికుల ద్వారా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి కార్మికుల వలసల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం ముందుగానే అనుమానించింది. ఇదే సమయంలో ‘వందే భారత్’ ద్వారా విదేశాల నుంచి వస్తున్నవారి ద్వారా కూడా వ్యాపించే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ రెండింటి ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నాలుగు రోజుల క్రితమే సంబంధిత అధికారులను, జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అయినా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఆదివారం కొత్తగా వెలుగులోకి వచ్చిన 33 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 26 ఉండగా, మిగిలిన ఏడు కేసులు వలస వచ్చినవారికి చెందినవని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చినవారిని పరీక్షించగా నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 11 మంది వలస కార్మికులకు పాజిటివ్ ఉన్నట్లయింది. ఇప్పటికే నలుగురు వలస కార్మికులకు పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గుర్తించింది. కువైట్ నుంచి శనివారం అర్ధరాత్రి 163 మంది ప్రయాణీకులు ప్రత్యేక విమానంలో రాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యారోగ్య శాఖ.. కొద్దిమందిని క్వారంటైన్‌కు తరలించగా మరికొంతమందిని ఆంధ్రప్రదేశ్‌కు పంపించింది. రాష్ట్రంలో క్వారంటైన్‌లో ఉన్నవారిని నాలుగు హోటళ్ళలో ఉంచారు అధికారులు.
పద్నాలుగు రోజుల క్వారంటైన్‌లో భాగంగా హోటళ్లలో ఉండే వీరు.. అందుకు అయిన ఖర్చులను భరించాల్సి ఉంటుంది. త్రీ స్టార్ హోటల్ ఖర్చును రూ. 30 వేలుగా, 2 స్టార్ హోటల్‌కు రూ. 15 వేలు, సాధారణ హోటల్‌కు రూ. 5 వేల చొప్పున ధర నిర్ణయమైంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కాచిగూడ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో వీరిని క్వారంటైన్‌లో ఉంచింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది వీరిని పరీక్షించి ఆరోగ్య స్థితిని తెలుసుకుని, రిపోర్టులో వచ్చిన ఫలితాన్ని బట్టి ఆస్పత్రికి తరలిస్తుంది.
మొత్తం కేసులు : 1196
మృతులు : 30
డిశ్చార్జి : 751
యాక్టివ్ కేసులు : 415