మామిడి రైతుకు కరోనా కాటు

దిశ, తెలంగాణ బ్యూరో : మామిడి రైతులు మళ్లీ నిండా మునుగుతున్నారు. కరోనా సాకుతో ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. స్థానికంగా ధర రాకపోవడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు మరింత నష్టాలు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు జగిత్యాల మామాడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీలో లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో మామిడి ధరలు పడిపోతున్నాయి. మన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి మామిడి అధిక భాగం ఢిల్లీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తారు. […]

Update: 2021-05-04 13:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మామిడి రైతులు మళ్లీ నిండా మునుగుతున్నారు. కరోనా సాకుతో ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. స్థానికంగా ధర రాకపోవడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు మరింత నష్టాలు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు జగిత్యాల మామాడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీలో లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో మామిడి ధరలు పడిపోతున్నాయి.

మన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి మామిడి అధిక భాగం ఢిల్లీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి డిమాండ్‌ను బట్టి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌, సౌదీ వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఢిల్లీలో లాక్‌ డౌన్‌ పరిస్థితులు చోటుచేసుకోవడంతో స్థానిక మార్కెట్​లపై ప్రభావం పడింది. గత యేడాది కరోనా వల్ల మార్కెట్‌ నిర్వహించక పోవడంతో ధరలు రాలేదు. ప్రస్తుత సీజన్‌లోనైనా ఆశించిన ధరలు వస్తాయనకున్న మామిడి రైతులకు నిరాశ ఎదురవుతోంది.

లాక్ డౌన్​… ఎఫెక్ట్​

లాక్​డౌన్​ ఎఫెక్ట్ కారణంగా గతేడాది మామిడి రైతుల నిండా మునిగారు. 2019లో క్వింటాల్​కు రూ. ఐదున్నర వేల నుంచి రూ. 8 వేల వరకు ధర రాగా.. గతేడాది సాధారణ ధర వచ్చింది. ఈసారి కూడా పక్క రాష్ట్రాల్లో లాక్​డౌన్​తో మళ్లీ నష్టాలే వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.07 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక ఈ ఏడాది సీజన్​ మొదట్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ తదితర జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. వచ్చిన కాస్త దిగుబడిని అమ్ముకుందామనుకునే టైంలో కరోనా దెబ్బ పడింది.

మొదటగా​ కూలీలు దొరక్కపోవడంతో ట్రాన్స్​పోర్ట్​ లేక ఇబ్బంది ఎదురైంది. తర్వాత ఆంక్షలు సడలించినా సరైన ధర రాక నష్టం వస్తోంది. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ లోనే 17 వేల హెక్టార్లలో వివిధ రకాల మామిడి సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్​లో తప్ప ఎక్కడా మామిడికి సరైన మార్కెటింగ్​ సౌకర్యం లేదు. అటు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులపై దెబ్బపడింది.

మరోవైపు పక్క రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు లాక్​డౌన్​తో అమ్మకాలు ఆగిపోతున్నాయి. కర్నూల్, బీదర్, గుల్బర్గా, నాగ్​పూర్ మార్కెట్లకు మామిడిని తరలించే పరిస్థితి లేదు. గతంలో ఆయా ప్రాంతాల వ్యాపారులు స్వయంగా తోటలకు వచ్చి క్వింటాల్ మామిడికి రూ.5,500 నుంచి రూ. 8 వేల వరకు చెల్లించి తీసుకెళ్లారు.

ఇంకా తోటల్లోనే..

రాష్ట్ర వ్యాప్తంగా 3.07 లక్షల ఎకరాల్లో సాగువుతున్న మామిడిలో మెజార్టీ పంట మొత్తం తోటల్లోనే ఉంది. ప్రస్తుతం కొనుగోళ్లు లేకపోవడంతో చాలా వరకు మామిడి కాయలు ఇంకా కోయలేదు. కనీసం సగం మామిడి విక్రయాలు జరపకముందే ధరలు తగ్గుతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఆరంభంలో ఒకే..!

రాష్ట్రంలో మామిడి ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో టన్నుకు రూ. 65వేలు ధర పలికింది. కానీ సీజన్‌ ప్రారంభమై ఇరవై రోజులైనా గడవక ముందే ధరలు సగానికి పైగా తగ్గాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారడం.. రైతులు ఎక్కడా అమ్ముకునే అవకాశం లేకపోవడంతో విధిలేక వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం టన్ను బంగినిపల్లి రకం మామిడి ధర రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు పలుకుతోంది. కేవలం నెల రోజుల్లో టన్ను మామిడికి రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు తగ్గడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు చెప్పిందే ధరగా కొనసాగుతోంది. ఢిల్లీలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల కొనుగోళ్లు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.

అటు రెండో ఏడాది కూడా కొల్లాపూర్‌ మామిడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. సురభి రాజుల కాలం నుంచి కొల్లాపూర్‌ మామిడికి అనేక ప్రత్యేకతలు ఉన్నా క్షేత్ర స్థాయిలో ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు మాత్రం కరువయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు.

ప్రధానంగా కొల్లాపూర్‌ ప్రాంతాల్లో పండించే బేనీసాన్‌, కాలమిర్చి, తోతాపరి రకాలకు దేశ విదేశాల్లో బ్రహ్మాండమైన డిమాండ్‌ ఉన్నది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ ప్రాంత రైతాంగానికి అవగాహన కల్పించి నాణ్యమైన మామిడి పండ్లను జర్మనీ, దుబాయి, కువైట్‌, సౌదీ అరేబియాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు ట్రేడర్లకు వారధిగా వ్యవహరించింది.

ఈ క్రమంలో కిలో మామిడికి కనీసం అరువై నుంచి డెబ్బై రూ పాయల ధరలు పలికేది. సరకు రవాణా బాధ్యతలు ట్రేడర్స్‌ చూసుకునే వారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా కొల్లాపూర్‌ మామిడికి బాగా డిమాండ్‌ ఉన్న అరబిక్‌ దేశాల్లో భారతదేశం నుంచి ప్రయాణికుల రాకపోకలు, సరుకులు రవాణాపై ఆంక్షలు విధించడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన విమానయాన సంస్థలు కూడా చార్జీలు సైతం 30 నుంచి 40 శాతం పెంచడంతో కొల్లాపూర్‌ మామిడికి కష్టాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి దళారులు కిలోకు రూ. 20 చెల్లిస్తూ మామిడి రైతులను నిండా ముంచుతున్నారు.

Tags:    

Similar News