వివాదాస్పదంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు.. సర్పంచ్‌లను టార్గెట్ చేస్తూ..

దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘సర్పంచా.. అయితే మాకేంటి.. మా మాట వినకపోతే ఎవరైనా ఒక్కటే. చెప్పినట్టు వినకపోతే పాతాళానికి తొక్కేస్తాం’.. అంటూ సర్పంచ్‌లకు తరచూ ఎదురవుతోన్న వేధింపుల పర్వం ఇది. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా ఐ డోంట్ కేర్ అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇటీవల కాలంలో సర్పంచ్‌లకు ఎదురవుతోన్న షాకింగ్ ఘటనలు ఇవి. ఎమ్మెల్యేల వేధింపులు ఎంతలా మారాయంటే.. సర్పంచ్‌లు ఏకంగా తమ పదవులకు రాజీనామా చేసేంత పరిస్థితి. […]

Update: 2021-10-11 07:50 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘సర్పంచా.. అయితే మాకేంటి.. మా మాట వినకపోతే ఎవరైనా ఒక్కటే. చెప్పినట్టు వినకపోతే పాతాళానికి తొక్కేస్తాం’.. అంటూ సర్పంచ్‌లకు తరచూ ఎదురవుతోన్న వేధింపుల పర్వం ఇది. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా ఐ డోంట్ కేర్ అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇటీవల కాలంలో సర్పంచ్‌లకు ఎదురవుతోన్న షాకింగ్ ఘటనలు ఇవి. ఎమ్మెల్యేల వేధింపులు ఎంతలా మారాయంటే.. సర్పంచ్‌లు ఏకంగా తమ పదవులకు రాజీనామా చేసేంత పరిస్థితి.

ఎంతో కష్టపడి ప్రజాక్షేత్రంలో గెలిచిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యేలు కనీస విలువ ఇవ్వకుండా నిత్యం ఏదో ఒక రూపంలో వేధింపులకు పాల్పడుతుండడం వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. అసలే ఓవైపు చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక అప్పుల పాలవ్వడం.. మరోవైపు చెప్పిన మాట వినలేదంటూ ఎమ్మెల్యేలు బిల్లులను ఆపించడం.. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండడం.. సర్పంచ్‌లను మానసిక క్షోభకు గురిచేస్తోంది. సాక్షాత్తూ తాము గెలిపించుకున్న ఎమ్మెల్యేలే తమల్ని వేధింపులకు గురిచేస్తుండడంతో వారి బాధలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.

ఇండిపెండెంట్‌గా గెలిచిన మహిళా సర్పంచ్‌పై..

నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్‌పై నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వేధింపుల పర్వం తాజాగా కలకలం రేపుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎల్లమ్మగూడెం సర్పంచ్ గాదె సంధ్యావిజయ్ రెడ్డి గెలుపొందారు. అయితే గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సర్పంచ్ దంపతులు నిరాకరించడంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వారిని వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో గ్రామంలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ విషయంలోనూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.. సర్పంచ్ దంపతులను తీవ్రంగా అవమానించారనే ఆరోపణలు లేకపోలేదు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వేధింపులు తాళలేక సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం తమ సర్పంచ్ పదవికి సంబంధించి రాజీనామా పత్రం అందించేందుకు ఎల్లమ్మగూడెం సర్పంచ్ దంపతులు నల్లగొండ కలెక్టరేట్‌కు వచ్చారు. కార్యాలయంలో కలెక్టర్ లేకపోవడంతో సర్పంచ్ గాదె సంధ్యావిజయ్ రెడ్డి తమ రాజీనామా పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ మోతీలాల్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గాదె సంధ్యావిజయ్ రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏండ్లుగా మేము చేసిన పనులకు కనీసం ఒక్క బిల్లు రాకుండా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఉప సర్పంచితో చెక్కులపై సంతకాలు చేయించకుండా ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని తెలిపారు. తిప్పర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఎల్లమ్మగూడెం సర్పంచికి ఏ అధికారి కూడా సహకరించొద్దని బహిరంగంగా అధికారులకు ఎమ్మెల్యే చెప్పారని ఆరోపించారు. గ్రామసభ సమావేశంలో మహిళా సర్పంచినని చూడకుండా పోలీసులతో గెంటించి అవమానించారని చెప్పారు. గ్రామ సభ తీర్మానం లేకుండా.. సర్పంచికి తెలియకుండా ఎస్డీఎఫ్ నిధులను సంఘబంధం సభ్యులతో తీర్మానం చేసి పంపారని పేర్కొన్నారు. ఇలా ఎన్నో విషయాలలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నందుకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గతంలో చిట్యాల మండలంలో…

గత మార్చి నెలలో చిట్యాల మండలం వెలిమినేడు మహిళ సర్పంచ్ మల్లమ్మ వెలిమినేడు గ్రామపంచాయతీ పరిధిలోని హరితహారం మొక్కలపై అశ్రద్ధ చూపుతున్నారనే కారణంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ సస్పెండ్ చేశారు. దీన్ని ఖండిస్తూ సదరు మహిళా సర్పంచ్ మల్లమ్మ.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కావాలనే తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయించారని అప్పట్లో ఆరోపిస్తూ ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీల్లో ఫొటోలు పెట్టే విషయంలోనూ, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం అని నన్ను ఏ పనీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే లింగయ్యపై ఆరోపణలు గుప్పించ్చింది. వెలిమినేడు గ్రామ ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని, అందుకు 13 మంది వార్డు సభ్యులు మద్దతిచ్చారని, సంబంధిత పత్రాలను ఆర్డీఓ చేతుల్లోంచి గుంజుకుని ఎమ్మెల్యే లింగయ్య చింపేశారని మల్లమ్మ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే.

అభివృద్ధి పనులు చేసి చెక్కుల మీద సంతకాలు పెట్టకుండా ఉపసర్పంచ్ ఎమ్మెల్యే సపోర్టుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించింది. అనంతరం ఇతర ప్రజాప్రతినిధుల జోక్యంతో ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్ వివాదం కాస్తంత సద్దుమణిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్పంచ్‌లపై ఎమ్మెల్యేల పెత్తనానికి స్వస్తి పలకాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.

Tags:    

Similar News