జీతాలివ్వరు.. సీవరేజీ కార్మికులతో అధికారుల ఆటలు

దిశ, సిటీ బ్యూరో: సీవరేజీ కార్మికుల (జీహెచ్ఎంసీ, జలమండలి) జీవితాలు పొయ్యిలో నుంచి పెన మీదకు, పెన మీద నుంచి పొయ్యిలోకేసినట్టయ్యింది. ఏ బతుకు దెరువు లేక డ్రైనేజీల్లో మెడ వరకు దిగి పూడికను, మానవ వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఎవరూ చేసేందుకు కనీసం ఇష్టపడని ఈ పని చేసుకుంటున్నా వారికిచ్చేది అరకొర జీతం. అదీ సమయానికివ్వరూ, ఒక వేళ ఇచ్చినా అందులో కాంట్రాక్టర్లు తమ వాటా కట్ చేసుకుని మరీ ఇస్తారు. వీరితో సక్రమంగా పని చేయించుకుని […]

Update: 2021-08-18 19:00 GMT

దిశ, సిటీ బ్యూరో: సీవరేజీ కార్మికుల (జీహెచ్ఎంసీ, జలమండలి) జీవితాలు పొయ్యిలో నుంచి పెన మీదకు, పెన మీద నుంచి పొయ్యిలోకేసినట్టయ్యింది. ఏ బతుకు దెరువు లేక డ్రైనేజీల్లో మెడ వరకు దిగి పూడికను, మానవ వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఎవరూ చేసేందుకు కనీసం ఇష్టపడని ఈ పని చేసుకుంటున్నా వారికిచ్చేది అరకొర జీతం. అదీ సమయానికివ్వరూ, ఒక వేళ ఇచ్చినా అందులో కాంట్రాక్టర్లు తమ వాటా కట్ చేసుకుని మరీ ఇస్తారు. వీరితో సక్రమంగా పని చేయించుకుని సకాలంలో జీతాలు చెల్లించే విషయంలో జలమండలి, బల్దియా అధికారులు వీరి జీవితాలతో ఆడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం బల్దియా పరిధిలోనున్న ఈ సీవరేజీ కార్మికులు వచ్చే నెల1వ తేదీ నుంచి మళ్లీ జలమండలి పరిధిలోకి మారనున్నారు. తొలుత జలమండలిలోనే ఉన్న ఈ కార్మికులను రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇపుడు తాజాగా మళ్లీ జలమండలికి బదలాయించాలని ఇటీవలే మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నా, గడిచిన నాలుగైదు నెలల నుంచి ఈ కార్మికులకు జీతాలు చెల్లించటం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోనున్న ఈ కార్మికులకు కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించాల్సి ఉండేది.

గతంలో వీరంతా జలమండలి పరిధిలో ఉన్నపుడు కాంట్రాక్టర్లు వీరికి నెలకు రూ. 17వేల వరకు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య జీతాలను తమ ఇష్టారాజ్యంగా చెల్లించే వారని పలువురు కార్మికులు వాపోయారు. జలమండలి పరిధిలో ఉన్నపుడు తమకు ఈఎస్ఐ, పీఎఫ్ మాట దేవుడెరుగు కనీసం ఇచ్చే జీతం కూడా సక్రమంగా ఇవ్వలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా పరిధిలోకి వచ్చిన కొత్తలో సక్రమంగా జీతాలను చెల్లిస్తూ వచ్చిన కాంట్రాక్టర్లు తమకు వర్కవుట్ కావటం లేదంటూ నాలుగైదు నెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో కుటుంబ పోషణ గగనంగా మారిన వీరు తీవ్ర మనో వ్యధకు గురవుతున్నారు. ఏడు నెలల క్రితం జీతాలు రాక కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనస్తాపానికి గురైన కార్మికుడు శ్యామ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, ఈ నెల 3వ తేదీన ఎల్బీనగర్ జోన్ లోని పద్మావతి నగర్ లో డ్రైనేజీ నుంచి పూడికను తీస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి శివ, అంతయ్య అనే కార్మికులు మృతి చెందిన సంగతి తెల్సిందే! ఇప్పుడు తాజాగా యాదగిరి అనే కార్మికుడు తనకు సకాలంలో జీతం అందకపోవటం, కుటుంబాన్ని పోషించుకోవటం గగనంగా మారటంతో తీవ్ర ఒత్తిడి గురైన అతనికి మెదడులో రక్తం గడ్డకట్టి, పక్షపాతం వచ్చి ఆస్పత్రి పాలైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

వీరి బదలాయింపుతో ఎవరికి లాభం

సుమారు 650 వరకున్న శివారు సీవరేజీ కార్మికులు ప్రస్తుతం బల్దియా పరిధిలో పని చేస్తున్నారు. ఈ నెలాఖరు తర్వాత వీరంతా జలమండలి పరిధిలోకి వెళ్లనున్నారు. కానీ తామంతా బల్దియా పరిధిలో బాగానే ఉన్నామని, పెండింగ్‎లో ఉన్న జీతాలు చెల్లిస్తే తమ పనులు తాము చేసుకుంటామని కార్మికులు వాదిస్తున్నా, మంత్రి, ఉన్నతాధికారులు మాత్రం 1వ తేదీ నుంచి వీరంతా జలమండలి పరిధిలోనే పని చేయాలని సూచిస్తున్నారు. వీరికి బల్దియా నుంచి జలమండలికి, జలమండలి నుంచి బల్దియాకు బదలాయిస్తే ఎవరికి లాభం చేకూరుతుంది, 650 మంది కాంట్రాక్టు సీవరేజీ కార్మికులు ఎవరు చేసేందుకు ఇష్టపడని పనిని చేస్తున్న వీరంతా ఎక్కడుంటేనేం, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అన్నదే ముఖ్యం. అలాంటపుడు వీరిని మళ్లీ ఎందుకు జలమండలి పరిధిలోకి మార్చేందుకు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమేనన్న వాదనలున్నాయి. కాంట్రాక్టర్లు ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ను కూడా తప్పుదోవపట్టించినట్లు చర్చ లేకపోలేదు.

జీతాలివ్వాలి.. బల్దియాలోనే కొనసాగించాలి

పెండింగ్‌లో ఉన్న కార్మికుల నాలుగైదు నెలల జీతాలను వెంటనే చెల్లించి, వారిని బల్దియాలోనే కొనసాగించాలని బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్ ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. నాలుగైదు నెలలుగా జీతం రాలేదన్న బెంగతో ఆస్పత్రి పాలైన యాదగిరి కుటుంబాన్ని కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ.. జలమండలిలో ఈ కార్మికుల కష్టాన్ని కొందరు కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని, డ్రైనేజీలో దిగి పనులు చేసే ఈ కార్మికులకు కష్టానికి తగిన జీతాలను చెల్లించాల్సిన బాధ్యత అధికారులు, కాంట్రాక్టర్లపైనే ఉందని గుర్తు చేశారు. వెంటనే జీతాలు చెల్లించకుంటే పెద్ద ఎత్తున బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. -బీజేపీ మజ్దూర్ మోర్చా చైర్మన్ ఊదరి గోపాల్

Tags:    

Similar News