కమీషన్లు ఇస్తాం బిల్లులు ఇప్పించండి.. ప్రగతి భవన్‌లో కాంట్రాక్టర్ల పైరవీలు

దిశ, తెలంగాణ బ్యూరో : బోర్డు పరిధిని ఖరారు చేస్తూ విడుదలైన గెజిట్ ​నోటిఫికేషన్ ​ఇరిగేషన్​కాంట్రాక్టర్లను ఇరకాటంలో పడేస్తోంది. ఈ పనులపై ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల కోట్లు పెండింగ్​బిల్లులు పేరుకుపోవడంతో వాటిని ఎలా విడుదల చేయించుకోవాలనే తంటాలు పడుతున్నారు. ప్రగతిభవన్‌లో తెలిసిన వారి కోసం వెతుకుతున్నామని ఇరిగేషన్​ కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. సీఎం దగ్గర నుంచి పెండింగ్ ​బిల్లులు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు. రూ.8 వేల కోట్ల బిల్లుల బాకీ రాష్ట్రంలో […]

Update: 2021-07-18 20:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బోర్డు పరిధిని ఖరారు చేస్తూ విడుదలైన గెజిట్ ​నోటిఫికేషన్ ​ఇరిగేషన్​కాంట్రాక్టర్లను ఇరకాటంలో పడేస్తోంది. ఈ పనులపై ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల కోట్లు పెండింగ్​బిల్లులు పేరుకుపోవడంతో వాటిని ఎలా విడుదల చేయించుకోవాలనే తంటాలు పడుతున్నారు. ప్రగతిభవన్‌లో తెలిసిన వారి కోసం వెతుకుతున్నామని ఇరిగేషన్​ కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. సీఎం దగ్గర నుంచి పెండింగ్ ​బిల్లులు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు.

రూ.8 వేల కోట్ల బిల్లుల బాకీ

రాష్ట్రంలో ఇరిగేషన్​ ప్రాజెక్టులకు దాదాపు రూ.8 వేల కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందని ఇరిగేషన్​అధికారులు ఇప్పటికే సీఎంకు నివేదించారు. పాలమూరు–రంగారెడ్డికి రూ.1900 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన బిల్లులు కూడా రూ.2 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర గెజిట్‌లో పేర్కొన్న విధంగా అనుమతి లేని 26 ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్ల బిల్లులు బకాయిలున్నాయి. ఇవన్నీ పెద్ద సంస్థలు టెండర్లు దక్కించుకున్నప్పటికీ… సబ్​ కాంట్రాక్టర్లుగా చాలా మందికి అవకావం కల్పించారు. అధికార పార్టీ నేతలతో పాటు ఆయా ప్రాంతాల్లోని పలువురు కాంట్రాక్టర్లు ఇరిగేషన్​ ప్రాజెక్టుల పనులు చేశారు.

గెజిట్ వచ్చేసింది.. ఇప్పుడెలా..?

తెలుగు రాష్ట్రాల్లో బోర్డుల పరిధి ఖరారు చేస్తున్నట్లు కేంద్రం గెజిట్​ విడుదల చేసింది. అంతేకాకుండా అనుమతి లేని ప్రాజెక్టులను సూచిస్తూ ఆరు నెలల్లో వాటికి అనుమతి తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల సంఘం నుంచి అనుమతి లేకున్నప్పటికీ ఈ ప్రాజెక్టుల పనులు చేస్తున్నారు. ఉదాహరణకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అదే కార్పొరేషన్​నుంచి రుణం తీసుకున్నారు. దాదాపు రూ. 32 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అటు కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు కూడా 80 శాతం పూర్తి అయ్యాయి. కానీ పనులు చేసిన సంస్థలకు మాత్రం ఇంకా బిల్లులు రాలేదు. కరోనా ఆర్థిక కష్టాల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ అవసరాలు మినహా.. బిల్లులన్నీ ఆపేసింది.

అంతేకాకుండా తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టు పనులకు ఏండ్ల నుంచి బిల్లులు రావడం లేదు. ఇదే సమయంలో కేంద్రం గెజిట్​జారీ చేయడంతో ఇరకాటంలో పడినట్లైంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల పనులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. అనుమతులు తెచ్చిన తర్వాతే పనులు చేయాల్సి ఉంటోంది. అంతవరకు వీటికి అప్పు కూడా తీసుకోవడం సాధ్యం కాదు. ఇదంతా ఒకవైపు ఉంటే… ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు ఎలా అనేదే సందేహంగా మారింది.

కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను కేంద్రం బోర్డుల పరిధిలోకి తెచ్చింది. వీటిలో తెలంగాణలో మొత్తం 26 ప్రాజెక్టులకు అనుమతి లేదని, వీటికి ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని, అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు జరుగుతున్న పనులకు కత్తెర వేసినట్టే.

ఇప్పిస్తారా ప్లీజ్​..!

ప్రస్తుతం కాంట్రాక్టర్లు పాత బిల్లులను ఇప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం దగ్గర ఫైరవీ చేసే నేతల కోసం వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ అనుమతి లేని ప్రాజెక్టుల పనులు మొత్తం ఆపాల్సి వస్తోంది. ఇప్పటికే అప్పులు తెచ్చి పనులు చేస్తున్నారు. కాంట్రాక్ట్​దక్కించుకున్న పెద్ద సంస్థల పరిస్థితి ఎలా ఉన్నా… చాలా పనులు సబ్ ​కాంట్రాక్టర్లతోనే చేపిస్తున్నారు. రాష్ట్రం నుంచి బిల్లులు రాకపోవడంతో సబ్ ​కాంట్రాక్టర్లకు కూడా చెల్లింపులు ఆపేశారు.

కానీ ఇదే సమయంలో గెజిట్​ నోటిఫికేషన్‌తో అన్ని పనులు ఆపాల్సి వస్తోంది. కానీ పాత బిల్లులను ఇప్పించుకునేందుకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని ఎలా ఇస్తారో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులపై అప్పులు వస్తే బిల్లులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ఇన్ని రోజులు ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం నుంచి కొంతైనా బిల్లులు ఇప్పించుకుంటే తాము చెల్లించాల్సిన అప్పులు తీరుతాయని ఆశిస్తున్నారు. అందుకే సీఎం దగ్గర నుంచి ఫైరవీ చేయించుకునేందుకు కమీషన్లు కూడా ఇస్తామంటూ వేడుకుంటున్నారు.

Tags:    

Similar News