కుదేలైన నిర్మాణ రంగం..!
దిశ ప్రతినిధి, నల్లగొండ : నిర్మాణ రంగం కుదేలైపోయింది. కరోనా దెబ్బకు వలస కూలీలు ఎక్కడివారక్కడ ఇరుక్కుపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిల్చిపోయాయి. దీంతో బిల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థాయిని బట్టి రూ.లక్షలు, కోట్లలో అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తూ నెలల తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూడడం బిల్డర్ల వంతవుతోంది. ఇక ఈ పరిస్థితి ఎన్నాళ్లుంటుందో.. ఎప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొంటుందోన్న బెంగ అందరినీ వెంటాడుతోంది. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ ఈ రంగాన్ని […]
దిశ ప్రతినిధి, నల్లగొండ :
నిర్మాణ రంగం కుదేలైపోయింది. కరోనా దెబ్బకు వలస కూలీలు ఎక్కడివారక్కడ ఇరుక్కుపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిల్చిపోయాయి. దీంతో బిల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థాయిని బట్టి రూ.లక్షలు, కోట్లలో అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తూ నెలల తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూడడం బిల్డర్ల వంతవుతోంది. ఇక ఈ పరిస్థితి ఎన్నాళ్లుంటుందో.. ఎప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొంటుందోన్న బెంగ అందరినీ వెంటాడుతోంది. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ ఈ రంగాన్ని ఇప్పుడిప్పుడే కోలుకోని స్థాయిలో దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో హైదరాబాద్‌ను మినహాయిస్తే నిత్యం నిర్మాణ రంగం ఉధృతంగా సాగే పట్టణాలలో ఉమ్మడి నల్లగొండను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన అన్ని రంగాల ప్రజలు ఇక్కడ ఉండడం.. దీనికితోడు పక్కనే ఉన్న యాదాద్రి ఆలయం.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా కావడంతో ఇక్కడ సహజంగానే స్థిరాస్తి వ్యాపారం దూకుడుగానే ఉండేది. అదే స్థాయిలో భవన నిర్మాణ రంగం కూడా ఓ స్థాయిలో నడిచేది. ప్రస్తుతం పరిస్థితి మారింది. కరోనా వచ్చింది. మొత్తాన్ని భయపెట్టి మరీ శాసిస్తోంది.
తీవ్రంగా స్కిల్డ్ లేబర్ కొరత..
సిమెంట్, రైస్ మిల్లులు, ఫార్మా సెక్టార్ తర్వాత ఉమ్మడి నల్లగొండలో భవన నిర్మాణ రంగంలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. స్కిల్ ఉండి పనిచేయాలనే ఆటిట్యూడ్ ఉన్న వారికి నిత్యం ఏదో ఒక పని దొరికే ప్రాంతాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడికి బిల్డింగ్‌లకు సీలింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్, మార్బుల్ లేయింగ్, కార్పెంటర్స్, స్టీల్ రెయిలింగ్, గ్లాస్ వర్క్స్, శానిటరీ పనులు సహా మాశినరీ వర్క్ర్ కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్బిమబెంగాల్, ఒడిశా, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వచ్చి ఉంటుంటారు. కొందరు నమ్మకమైన మేస్త్రీలు ఇళ్ల కాంట్రాక్టు పనులు దొరకబుచ్చుకుని వారి ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకునే పరిస్థితి ఉంది.
బోసిపోతున్న కార్మికుల అడ్డాలు..
ఈ పనులకు గానూ అవసరమైన క్యాజువల్ లేబర్ సూర్యాపేట, కోదాడ, హుజుర్ నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ‘అడ్డా’లుగా పిలుచుకునే ప్రదేశాలు తిరునాళ్లను మరిపిస్తుంటాయి. పని కావాల్సిన వారు, కార్మికులు కావాల్సిన వారికి ఇవి జంక్షన్ పాయింట్. ఇక్కడి నుంచే అందరూ తమతమ పనుల కోసం డిస్పర్స్ అవుతుంటారు. అయితే కరోనా లాక్‌డౌన్ సమయంలో పనులు లేక వారంతా డీలా పడిపోయారు.
చేతిలో పనిలేక, డబ్బులేక ఇబ్బందులు పడుతున్న రోజువారీ పనుల కోసం వచ్చిన కార్మికులను అనేకమంది మంచి హృదయంతో ఆదరించారు. వారికి నిత్యావసరాలు సైతం అందించారు. బిక్కుబిక్కుమంటూ కుటుంబాలకు దూరంగా ఖాళీగా కాలం గడిపిన వీరంతా లాక్‌డౌన్ రిలాక్స్‌షన్ తర్వాత సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పటికీ వాళ్లెవరూ రాలేదు. వద్దామన్నా ఇక్కడ స్థానిక కార్మికులు రానిచ్చే పరిస్థితి కూడా లేదు. కరోనా వ్యాప్తి భయంతో ఇప్పటికే స్థానిక భవన నిర్మాణ కార్మికులంతా స్వచ్ఛందంగా పనులు నిలిపేసి బంద్ పాటిస్తున్నారు. వాళ్లెప్పుడు బంద్ విరమిస్తారో తెలీని పరిస్థితి. ఇది బిల్డర్ల పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇప్పటికే నిర్మాణ దశలో వెయ్యికిపైగా నివాస గృహాలు, సుమారు ఓ ఏభైకి పైగా అపార్ట్‌మెంట్లు ఎక్కడివక్కడ నిల్చిపోయాయి.
కార్మికులు దొరకట్లేదు..
అసలే కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లో సిమెంటు, ఇసుక, స్టీలు ఇతర ఇన్‌పుట్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో బిల్డర్ల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. దీనికితోడు విక్రయాలు పూర్తయిన ఇళ్లకు సంబంధించి లోన్లు మంజూరైనా డిస్బర్స్‌మెంట్‌లలో ఇబ్బందులు పెడుతున్నారని, దీనికి కరోనాను కారణంగా చూపుతున్నారు. అనేక మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి చూపే ఈ రంగానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కరోనా వైరస్ భయంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు వెళ్లిపోవడం, వైరస్ వ్యాప్తి భయంతో మళ్లీ తిరిగి రాకపోవడంతో నిర్మాణ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదెన్నాళ్లన్నది అంచనా వేయలేని పరిస్థితి.
– నాగరాజు, బిల్డర్