మళ్లీ ‘హీట్’ పుట్టిస్తున్న దుబ్బాక పాలిటిక్స్.. సర్కార్ Vs రఘునందన్

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట జిల్లాలో అధికార టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీలు తమ పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ తమ పట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తుండగా.. బీజేపీ పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పంచాయతీ నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ తన స్థానాలను పెంచుకోవాలని చూస్తుండగా.. సిట్టింగ్ సీటును కోల్పోయిన టీఆర్ఎస్ ఆ స్థానాన్ని […]

Update: 2021-07-30 00:33 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట జిల్లాలో అధికార టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీలు తమ పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ తమ పట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తుండగా.. బీజేపీ పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పంచాయతీ నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ తన స్థానాలను పెంచుకోవాలని చూస్తుండగా.. సిట్టింగ్ సీటును కోల్పోయిన టీఆర్ఎస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది.

ఎన్నడూ పర్యటించని ప్రజాప్రతినిధులు సైతం దుబ్బాకలో రోజూ పర్యటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటనలో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటూ నినాదాలు చేశారు.

దుబ్బాకపై టీఆర్ఎస్ నజర్..

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఆయన గెలిచిన మరుక్షణం నుంచి టీఆర్ఎస్ తన వ్యూహ శైలిని మార్చుకుంది. సిద్దిపేట జిల్లాలోని అన్ని నియోజక వర్గాల కంటే దుబ్బాకపైనే టీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం బీజేపీ ఎమ్మెల్యే పాల్గొనే ప్రతి సమావేశంలో టీఆర్ఎస్ తరఫున మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పాల్గొనాలని ఆదేశించింది.

పార్టీ ఆదేశాల మేరకు వారు సైతం ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేకు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సమయం వీలు పడటం లేదు. ఎప్పుడూ ఏ సమావేశంలో పాల్గొనని ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా ప్రతీ మీటింగ్‌లో పాల్గొనడంపై అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నం..

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహ రచన చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తన ఆర్ధిక బలం, అంగ బలంతో బీజేపీ ఎమ్మెల్యే స్థాయిని తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా తాను పట్టువదలకుండా ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, పథకాలను వివరిస్తూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలు మరో ఏడాది ఉండటంతో ఎవరు ఎలాంటి వ్యూహా, ప్రతివ్యూహాలను అమలు చేస్తారో చూడాలి.

బహిర్గతమైన విబేధాలు..

సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలుపొందిన తర్వాత నుంచి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లాలో అన్ని నియోజక వర్గాలు అధికార పార్టీయైనా టీఆర్ఎస్ కాగా ఒక్కటి మాత్రమే బీజేపీ నియోజక వర్గంగా ఉంది. ఈ నియోజక వర్గంలో మంత్రి పర్యటిస్తున్నారని విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నాయకులు ఇందుకోసం సిద్ధమయ్యారు. మంత్రి పర్యటనలో ఒక్కసారిగా టీఆర్ఎస్ నాయకులు హరీశన్న నాయకత్వం వర్ధిల్లాలని ప్రారంభించగా.. వెంటనే బీజేపీ నాయకులు వాడెవడూ, వీడెవడూ రఘన్నకు అడ్డు ఎవడూ.. రఘన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ అనగానే.. బీజేపీ నాయకులు భారత్ మాతాకీ జై అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో, ఒక్కసారిగా ఇరు పార్టీలు ఘర్షణకు తలపడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల నేతలను సముదాయించారు. ఇదొక్కటే కాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రానున్న కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News